42 ఏళ్ల పాటు సర్పంచ్‌గా...

ఒక ప్రజాప్రతినిధిని పదేళ్లు లేదా పదిహేను ఏళ్లు భరించాలంటే ప్రజలు విసిగిపోతారు. అతడి పట్ల వ్యతిరేక భావం వస్తోంది. కొత్త వారికి అవకాశం ఇస్తారు. కానీ ఒక వ్యక్తి 42 ఏళ్లు ప్రజాప్రతినిధిగా ఉన్నారు.

Update: 2019-01-18 03:05 GMT
veeraswamy

ఒక ప్రజాప్రతినిధిని పదేళ్లు లేదా పదిహేను ఏళ్లు భరించాలంటే ప్రజలు విసిగిపోతారు. అతడి పట్ల వ్యతిరేక భావం వస్తోంది. కొత్త వారికి అవకాశం ఇస్తారు. కానీ ఒక వ్యక్తి 42 ఏళ్లు ప్రజాప్రతినిధిగా ఉన్నారు. రికార్డు టైమ్ సర్పంచ్ పదవి నిర్వహించిన ఆ వ్యక్తి గురించి తెలుసుకోవాలంటే, మహబూబ్ నగర్ జిల్లాకు వెళ్లాల్సిందే.

ఈ వృద్ధుడి పేరు వీరస్వామి. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూరు మండలం అమిస్తా పూర్ గ్రామవాసి. వీరస్వామి ఐదేళ్లు పదేళ్లు కాదు ఏకంగా 42 ఏళ్లు గ్రామ సర్పంచ్ గా పని చేశారు. 1959 లో వీరస్వామి తొలిసారిగా గ్రామ సర్పంచ్ గా, మరో 9 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1964, 1969, 1974, 1979ఎన్నికల్లో వీరస్వామిని సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మొదటి సారిగా 1984లో అమిస్తాపూర్ గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులకు ఎన్నికలు జరిగగా అప్పుడు కూడా వీరస్వామి, అతడు బలపర్చిన వార్డు సభ్యులు విజయం సాధించారు.

ఐదో తరగతి చదివిన వీరస్వామికి విద్యార్ధి దశ నుంచే సామాజిక స్పృహ కలిగి ఉన్నారు. గ్రామంలో ఆర్య సమాజ్ కార్యక్రమాలను చురుకుగా నిర్వహించారు. కొన్నేళ్లపాటు మద్యరహిత గ్రామం కోసం కృషి చేశారు. తన హయంలో గ్రామంలో ఏ చిన్న సమస్య వచ్చినా అందరం కలిసి పరిష‌్కరించుకునేవారమని వీరస్వామి చెబుతున్నారు.

మొత్తం 42 ఏళ్లు సర్పంచ్ గా ఉన్న వీరస్వామి వయసు మీద పడటంతో 2001 నుంచి ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. సర్పంచ్ పదవిలో వీరస్వామి లేకున్నా ఇప్పటికీ ఆయన సలహాలు తీసుకుంటారు గ్రామస్తులు. వీరస్వామికి ఇప్పుడు 88 ఏళ్లు. తెలుగు రాష్ట్రాల్లో సుదీర్ఘకాలం సర్పంచ్ గా పని చేసిన వారిలో ఒకరు. 42 ఏ‌ళ్లు ప్రజాసేవకు జీవితం అంకితం చేసిన ఆయన పట్ల గ్రామస్తులు ఎంతో గౌరవభావంతో ఉంటారు.  

Similar News