హిందువు కాదన్న పుకార్లపై వైవీ సుబ్బారెడ్డి రియాక్షన్

Update: 2019-06-07 05:13 GMT

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తన బాబాయ్, వైసీపీ కీలకనేత వైవీ సుబ్బారెడ్డికి టీటీడీ చైర్మన్‌ పదవి దాదాపు ఖరారు చేసిన సంగతి తెలిసిందే! ఇక అధికారికంగా ప్రకటన మాత్రమే మిగిలుంది. అయితే వైవీ పేరు ప్రకటించిన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో వైవీపై ఓ రేంజ్‌లో పుకార్లు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోఎట్టకేలకు వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడిన వైవీ క్లారిటీ ఇచ్చేశారు. అసలు తాను పుట్టుకతోనే హిందువునని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. తిరుమల శ్రీవారు తన ఇష్టదైవమని ఆయన తెలిపారు. సీఎం జగన్ తన పేరును ఈ పదవి కోసం పరిశీలనలోకి తీసుకోగానే కొందరు గిట్టనివారు తాను క్రిస్టియన్‌ని అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దయచేసి ఇలాంటి పుకార్లను ఎవరూ నమ్మకండని వైవీ సుబ్బారెడ్డి తేల్చిచెప్పారు. తాను ఇప్పటివరకు 30 సార్లు అయ్యప్ప మాట ధరించానని వివరించారు. దేవుడికి సేవ చేసే భాగ్యం కలిగించిందని అనుకుంటున్నానని సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు. టీటీడీనే కాదు భవిష్యత్తులో ఏ బాధ్యత అప్పగించినా తీసుకుంటానని వైవీ చెప్పారు. సీఎం జగన్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు.

Tags:    

Similar News