ప్రధాన పార్టీలను దడదడలాడిస్తున్న సంప్రదాయం

Update: 2019-05-09 11:08 GMT

ప్రతి నియోజకవర్గానికి ఒక చరిత్ర ఉంది. ఒక ప్రస్థానముంది. అలాగే ఒక్కో సెగ్మెంట్‌కు ఒక్కో సెంటిమెంట్‌ కూడా ఉంటుంది. అదెంటో గానీ, ప్రతిసారి వచ్చే ఫలితం ఆ సెంటిమెంట్‌ను మరింత బలపరిచేలానే ఉంటుంది. నిజమే కదా అనే నమ్మకాన్ని కూడా అక్కడ ప్రజలకు, ముఖ్యంగా నేతలకు అనిపిస్తుంటుంది. కర్నూలు జిల్లా ఆదోనిలోనూ ఒక సెంటిమెంట్‌ ఉంది. అది అన్ని పార్టీల అభ్యర్థుల్లో గుబులు రేపుతోంది ఇంతకీ ఏంటది?

కర్నూలు జిల్లా ఆదోనిలో ఒక సెంటిమెంట్‌ ఉంది. ఇక్కడ ఏ అభ్యర్థి గెలిస్తే, ఆ పార్టీ అధికారంలోకి రాదన్న నమ్మకముంది. అయితే ఈ వాదన పూర్తిగా చెరిపివేసి నియోజకవర్గంలో జెండా ఎగిరేసి,రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని ఇరు పార్టీ నేతలు తొడగొడుతున్నారు. ఓటర్లు తమకే పట్టంకట్టారని ఎవరికి వారు నమ్మకంగా ఉన్నారు.

ఆదోని నియోజకవర్గం1955లో ఏర్పడింది. మొత్తం ఓటర్లు 2,40,149. ఈ నియోజకవర్గంలో 37 గ్రామపంచాయతీలు, 41కౌన్సిల్ వార్డులున్నాయి. 2014 ఎన్నికలలో తెలుగుదేశం అభ్యర్థిగా మీనాక్షి నాయుడు పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థిగా సాయి ప్రసాద్ రెడ్డి నిలబడ్డారు. అయితే మీనాక్షి నాయుడుపై 17,800 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు సాయి ప్రసాద్ రెడ్డి. మరోసారి వీరిద్దరే బరిలో నిలవడంతో, పోటీ రంజుగా మారింది.

ఆదోని నియోజకవర్గంలో బీసీ ఓటర్లు ఎక్కువ. ఎక్కువగా బోయ, కురువ, తరువాత ఎస్సీ సామాజికవర్గం ఉంటారు. ఈ సెగ్మెంట్‌లో బీసీ ఓటర్లు, మైనారిటీ ఓటర్లు ఎటువైపు ఉంటారో వారిదే విజయం. ఆదోని నియోజకవర్గ పరిధిలోని తెలుగుదేశం, వైసీపీ నాయకులకు దీటుగా జనసేన, బిజెపీ, కాంగ్రెస్ అభ్యర్థులు కూడా ప్రజల్లోకి దూసుకుపోయారు. అయితే వీరిలో ఎవరూ గెలిచే అవకాశం లేకపోయినా, రెండు ప్రధాన పార్టీల అభ్యర్థుల ఓట్లకు మాత్రం గండికొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

ఆదోనిలో ముస్లిం ఓటర్ల చుట్టే ప్రధాన పార్టీల అభ్యర్థులు చక్కర్లు కొట్టారు. వారిని ఆకట్టుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ముస్లింలకు తామెంతో అండగా ఉన్నామని, వారి ఓట్లన్నీ తనకే పడతాయని ధీమాతో ఉన్నారు. అంతేకాకుండా మసీదులో ప్రార్థన చేసే హిమాంలకు గౌరవ వేతనం, మౌజన్లకు 5000 రూపాయల గౌరవ వేతనం కింద ఇస్తామని జగన్ ఇచ్చిన హామీలతో వారంతా తమవైపే ఉన్నారని లెక్కలేస్తున్నారు.

ఆదోనిలో టిడిపి అభ్యర్థి మీనాక్షి నాయుడు కూడా విజయం తనదేనంటున్నారు. టిడిపి సంక్షేమ పథకాలు, మహిళలకు పసుపు కుంకుమ, వృద్దాప్య పింఛన్లు, వితంతు పింఛన్లు, ఎన్టీఆర్ గృహాలు కలసివచ్చే అంశాలుగా చెబుతున్నారు. అలాగే ఇమామ్లకు, మౌజన్‌లకు పింఛన్లు, షాదీ ముబారక్‌తో ఆర్థిక సాయం ఇలా అనేక పథకాలు ఓట్ల వర్షం కురిపించాని నమ్మకంగా ఉన్నారు.

తమిళనాడు తరహాలో ఎప్పుడూ విలక్షణ తీర్పు ఇచ్చే ఆదోని ఓటరన్న, ఒకసారి ఒకరి వైపు మొగ్గు చూపితే మరోసారి మరో పార్టీకి గెలుపును అందిస్తున్నారు. అయితే ఈసారి జరిగిన హోరాహోరి పోరులో, విజయం తమదంటే తమదేనంటూ ప్రధాన పార్టీల అభ్యర్థులు కాన్ఫిడెన్స్‌గా ఉన్నారు. ఇలా ఎవరి ధీమా వారిదే. మరి ఆదోని ఓటరన్న ఎవరి వైపు నిలిచాడో తెలియాంటే, మరికొన్ని రోజులు ఆగక తప్పదు.

Full View

Similar News