తీవ్ర చర్చకు దారి తీసిన ముగ్గురి మంతనాలు

ఇటు కేసీఆర్‌ అటు కేటీఆర్‌ మధ్యలో పవన్‌ కల్యాణ్‌. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ ఇచ్చిన తేనేటి విందు ఎట్‌ హోం కార్యక్రమంలో అందరినీ ఆకర్షించారు ఆ ముగ్గురు. ఏపీ రాజకీయాలు వేడెక్కిన ఈ తరుణంలో ఈ ముగ్గురి కలయిక సరికొత్త చర్చకు దారి తీసింది.

Update: 2019-01-27 04:40 GMT

ఇటు కేసీఆర్‌ అటు కేటీఆర్‌ మధ్యలో పవన్‌ కల్యాణ్‌. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ ఇచ్చిన తేనేటి విందు ఎట్‌ హోం కార్యక్రమంలో అందరినీ ఆకర్షించారు ఆ ముగ్గురు. ఏపీ రాజకీయాలు వేడెక్కిన ఈ తరుణంలో ఈ ముగ్గురి కలయిక సరికొత్త చర్చకు దారి తీసింది. సుమారు అరగంట పాటు ఆ ముగ్గురు జరిపిన చర్చల సారాంశం ఏంటి..? ఆ ముచ్చట్ల వెనుక మర్మమేంటి..?

రిపబ్లిక్‌ డే సందర్భంగా రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన ఎట్‌ హోం కార్యక్రమంలో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చాలా సమయం ముచ్చట్లలో గడిపారు. దీంతో వారిద్దరి మధ్య ఏయే అంశాలు చర్చకు వచ్చాయనే విషయం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి.

ఎట్‌ హోం కార్యక్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ పక్కనే కూర్చున్న పవన్‌ కల్యాణ్‌ ఆయనతో చాలా వరకు మాట్లాడుతూ కనిపించారు. తొలుత కేటీఆర్‌ పవన్‌ ముచ్చటించగా ఆ తర్వాత కేసీఆర్‌తో మాట్లాడారు. అయితే వీరి మధ్య తాజా రాజకీయ పరిణామాలపై చర్చ జరిగిందా..? అనే విషయం ఉత్కంఠ రేపుతోంది. ఇదివరకే ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటామంటూ కేటీఆర్‌ ప్రకటించడం చంద్రబాబుకు రిటర్న్‌ గిఫ్ట్ ఇస్తా అంటూ కేసీఆర్‌ చేసిన ప్రకటనలతో వీరి సమావేశం హాట్‌ టాపిక్‌గా మారింది.

ఇటీవలే ఫెడరల్‌ ఫ్రంట్‌లోకి రావాలంటూ జగన్‌తో కేటీఆర్ సమావేశం కావడాన్ని పవన్ వ్యతిరేకించారు. గతంలో ఆ రెండు పార్టీల మధ్య ఉన్న వైరం గురించి గుర్తుచేస్తూ వారి భేటీని తప్పుబట్టారు. ఇలాంటి సమయంలో పవన్‌, కేసీఆర్‌, కేటీఆర్‌లు ఏం మాట్లాడుకుంటారనే దానిపై చర్చ సాగుతోంది.

సుమారు అరగంటకు పైగా సాగిన మంతనాలు కాస్త సీరియస్‌గానే జరిగినట్లు కనిపిస్తోంది. అందరూ అనుకున్నట్లు సమకాలీన రాజకీయాలపైనా చర్చ జరిగిందా..? లేక.. జగన్‌ను ఆహ్వానించినట్లు.. ఫెడరల్‌ ఫ్రంట్‌లోకి రావాలంటూ పవన్‌ ఆహ్వానించారా అన్నది అందరికీ తెలియాల్సిన విషయంగా మారింది.  

Similar News