అత్తారింటి ఎదుట కోడలి శవంతో ధర్నా

Update: 2019-05-08 05:44 GMT

వరకట్న వేధింపులు మరో వివాహితను బలి తీసుకున్నాయి. హైదరాబాద్‌ రామాంతపూర్‌ కు చెందిన జువాడీ శ్రీలత ఆత్మహత్య చేసుకుంది. 2011 లో శ్రీలత యూకే లో ఉంటున్న ఎన్నారై వంశీరావుతో వివాహం జరిగింది. ఆ తర్వాత 2012 లో వంశీరావు తన భార్య శ్రీలతను కూడా యూకేకి తీసుకెళ్లాడు. అయితే అప్పటి నుంచే శ్రీలతకు వరకట్న వేధింపులు మొదలయ్యాయి. తన బిడ్డను వేధిస్తున్నారనే వేదనతో శ్రీలత తల్లి చంద్రకళ కూడా 2016 లోనే మరణించింది. ఆ సమయంలో యూకేలో ఉన్న శ్రీలత తల్లి అంత్యక్రియలకు వచ్చి మళ్లీ యూకేకు వెళ్లింది. ఈ క్రమంలో శ్రీలత ప్రెగ్నెంట్‌ కావడంతో అత్త ఆశాలతను యూకేకు తీసుకెళ్లారు. శ్రీలత అక్కడే ఓ పాపకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి వేధింపులు మరింత ఎక్కువయ్యాయి.

ఆడపిల్ల పుట్టిందంటూ వేధింపులు ఎక్కువ కావడంతో 2018 ఫిబ్రవరిలో యూకేలో ట్రైన్‌ నుంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. అయితే భర్తపై యూకే లో కేసు నమోదు కాగా 20 ఏళ్లకుపైగా జైలు శిక్ష పడుతుందని తేల్చారు. దీంతో ఇరు వర్గాల మధ్య కాంప్రమైజ్‌ కావడంతో అప్పటికి సద్దుమణిగింది. అయినా కొంతకాలం తర్వాత శ్రీలతకు వేధింపులు తగ్గలేదు. 2018 జూన్‌లో భార్య శ్రీలతను భర్త వంశీరావు రామాంతపూర్‌కు తీసుకొచ్చి వదిలేసి యూకేకు వెళ్లాడు. దీంతో అప్పటి నుంచి ఇంట్లో ఉంటున్న శ్రీలతకు ఇక్కడ అత్తామామల నుంచి కూడా వేధింపులు ఆగలేదు. దీంతో నిన్న ముంబైలోని తన మేనమామ ఇంటికి వెళ్లిన శ్రీలత అక్కడే ఆత్మహత్య చేసుకుంది.

ముంబై నుంచి శ్రీలత మృతదేహాన్ని రామాంతపూర్‌కు తరలించారు. ఆమె కుటుంబ సభ్యులు మృతదేహంతో ఆందోళన చేపట్టారు. శ్రీలత మృతికి కారణమైన భర్త, అత్తామామలను వెంటనే అరెస్ట్‌ చేయాలని న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. తమకు న్యాయం జరగకపోతే అత్తింట్లోనే మృతదేహాన్ని ఖననం చేస్తామని హెచ్చరిస్తున్నారు.  

Similar News