2019లో దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు

Update: 2019-04-16 04:22 GMT

వరుణు త్వరలో కరుణించనున్నాడు. 96 శాతం వర్షపాతంతో మన ముందుకు రానున్నాడు. తొలుత కేరళను తాకిన తర్వాత దేశమంతటా విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండి అంచనాలను వెల్లడించింది. ముఖ్యంగా రైతులకు ఖరీఫ్‌ సీజన్‌కు అనుకూలంగా ఉంటుందని అధికారులు తెలియచేశారు. మండే ఎండల నుంచి ఉపశమనానికి వాన రాకకోసం ఎదురు చూస్తుంటారు. ఆ వాన కబురు వివరాలను తెలియచేసింది భారత వాతావరణ శాఖ. ఈ ఏడాది దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. 2019 నైరుతి రుతుపవనాల వర్షపాతంపై అంచనాలు వెల్లడించింది. ఈ ఏడాది జూన్‌ మొదటి వారంలో కేరళను రుతుపవనాలు తాకనున్నట్టు వాతావరణ శాఖ అధికారులు వివరించారు.

ఇక ఈ సంవత్సరం రైతులకు అంతా శుభం జరుగుతుందని వాతావరణ శాఖ తెలియచేసింది. రైతులకు ఖరీఫ్‌ సీజన్‌ ఉపయోగకరంగా ఉంటుందని, 2018 మాదిరిగానే 2019లో కూడా వర్షపాతాలు రైతుకు మేలు చేస్తాయని వాతావరణ శాఖ చెప్తోంది. ఇప్పటికే పెరిగిన ఉష్ణోగ్రతలు భూతాపాన్ని పెంచుతున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉంది. కానీ ఎల్‌నినో ప్రభావం రుతుపవనాలపై ఉండదని, వర్షాలు విస్తారంగా కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి వెల్లడించారు. ఇలా ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సాధారణ వర్షపాతం నమోదు అవుతుంది. జూన్ లో వర్షపాతంపై రెండో విడత అంచనాలను విడుదల చేస్తామని, దీర్ఘకాలికంగా 96 శాతం వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ డైరెక్టర్‌ జనరల్‌ తెలిపారు.

Similar News