అక్షయ తృతీయకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

Update: 2019-05-07 05:57 GMT

దేశ వ్యాప్తంగా పసిడి పండగ వచ్చేసింది. అనాదిగా వస్తున్న సెంటిమెంట్‌ను కొనసాగిస్తూ అక్షయ తృతీయకు కోట్లాది మంది మగువలు సిద్ధమవుతున్నారు. వినియోగదారులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా కార్పోరేట‌్ సంస్ధలు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటించాయి.

దేశ వ్యాప్తంగా జరిగే వేడుకల్లో అక్షయ తృతీయకు ప్రత్యేక స్ధానం ఉంది. ఈ రోజు కనీసం ఒక గ్రాము బంగారమయినా కొనుగోలు చేయాలని మధ్య తరగతి ప్రజలు కూడా భావిస్తుంటారు. సెంటిమెంట్‌ను బలంగా నమ్మే మహిళలు ఈ రోజు బంగారం కొనుగోలుకు అధిక ప్రాధాన్యనతిస్తారు. వాస్తవానికి అక్షయం అంటే ఎప్పటికీ తరగనిది అని అర్థం. మత్స్య పురాణంలో 65 అధ్యాయం ప్రకారం ఈశ్వరుడు పార్వతీదేవికి అక్షయ తృతీయ వ్రతం గూర్చి చెప్పాడు. వైశాఖ శుద్ధ తదియ రోజున చేసే ఏ వ్రతమైనా, జపమైనా, దానాలు ఏవైనా సరే అక్షయమౌతుంది. పుణ్య కార్యాచరణతో వచ్చే ఫలితం అక్షయమైనట్లే, పాపకార్యాచరణతో వచ్చే పాపం అక్షయమే అవుతుంది. అక్షయ తృతీయ రోజున ఉపవాస దీక్ష చేసి ఏ పుణ్య కర్మనాచరించినా అక్షయముగా ఫలము లభిస్తుంది. అక్షయుడైన విష్ణువును పూజిస్తున్నందునే దీనికి అక్షయ తృతీయ అని పేరు వచ్చింది.

అక్షయ తృతీయ నాడు బంగారం, వెండి లాంటి నగలు, ఆభరణాలు కొనుగోలు చేయడం అలావాటుగా మారింది. అక్షయ తృతీయ రోజు ఏ శుభ కార్యాన్నైనా వారం, వ్యర్జం, రాహు కాలంతో నిమిత్తం లేకుండా నిర్వహించుకోవచ్చని పండితులు చెబుతున్నారు. అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు చేసి బ్రాహ్మాణులకు దానం చేస్తే మంచి జరుగుతుందని ప్రజల్లో నమ్మకముంది. అంతేకాదు గృహ నిర్మాణం, ఇంటి స్థలం కొనుగోలు చేయడం వంటి శుభకార్యాలు ప్రారంభించవచ్చని పండితులు చెబుతున్నారు.

ఈ సెంటిమెంట్ వల్లే అక్షయ తృతీయ రోజున బంగారం వ్యాపారులు పోటాపోటీగా ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటారు. ఈ ఏడాది కూడా అక్షయ తృతియ ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త ఆఫర్లను ప్రకటించాయి. 

Similar News