సీబీఐ అధికారి నాగేశ్వరరావుకు షాకిచ్చిన సుప్రీం కోర్టు

Update: 2019-02-12 12:12 GMT

సీబీఐ అడిషనల్ డైరెక్టర్ మన్నెం నాగేశ్వరరావుకు సుప్రీంకోర్టు మళ్లీ షాకిచ్చింది. బీహార్ వసతి గృహాల్లో వేధింపుల కేసులో అక్షింతలు వేసింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు లక్ష జరిమానాతో పాటూ కోర్టు బెంచ్‌ లేచే వరకు గదిలో ఓ మూల కూర్చోవలసిందిగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్‌ గొగోయ్‌ ఆదేశించారు. నాగేశ్వరరావు లీగల్ అడ్వైజర్‌కు కూడా జరిమానాతో పాటూ అదే శిక్ష విధించింది.

బీహార్‌‌లోని ముజఫర్‌పుర్‌ వసతిగృహ అత్యాచారాల కేసులో దర్యాప్తు అధికారిగా ఉన్న ఎస్‌కే శర్మను బదిలీ చేసి సీబీఐ అదనపు డైరెక్టర్ ఎం. నాగేశ్వరరావు కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు అత్యున్నత న్యాయస్థానం నిర్ధారించింది. ఇందుకు గానూ ఆయనకు న్యాయస్థానం అసాధారణ శిక్ష విధించింది. లక్ష జరిమానాతో పాటు నేటి కోర్టు కార్యకలాపాలు ముగిసేంతవరకు కోర్టు ప్రాంగణంలోనే ఉండాలని ఆదేశించింది.

ముజఫర్‌పుర్‌ అత్యాచారాల కేసు దర్యాప్తు నుంచి అధికారులను బదిలీ చేయవద్దని సుప్రీంకోర్టు గతంలో స్పష్టం చేసింది. అయితే ఈ ఆదేశాలను పక్కనబెట్టి నాగేశ్వరరావు తాను తాత్కాలిక డైరెక్టర్‌గా ఉన్న సమయంలో ఎస్‌కే శర్మను దర్యాప్తు నుంచి తప్పించారు. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేస్తూ నాగేశ్వరరావుకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది.

ఈ వ్యవహారానికి సంబంధించి నాగేశ్వరరావు కోర్టు ఎదుట హాజరయ్యారు. ఆయన తరఫున అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ వాదనలు వినిపించారు. నాగేశ్వరరావు ఉద్దేశపూర్వకంగా చేయలేదని, అయితే ఇందుకు ఆయన ఇప్పటికే బేషరతుగా క్షమాపణలు చెప్పినట్లు కేకే వేణుగోపాల్ న్యాయస్థానానికి విన్నవించారు.

అయితే దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. అధికారి తప్పు చేస్తే ప్రభుత్వం ధనంతో ఆయన తరఫున ఎలా వాదిస్తారని సీజేఐ ప్రశ్నించారు. క్షమాపణలు చెప్పడం వింతగా, హాస్యాస్పదంగా ఉందని,.. క్షమాపణలు చెబితే సరిపోతుందా అని జస్టిస్‌ గొగోయ్‌ అన్నారు. ఆయన క్షమాపణల్ని తిరస్కరించి జరిమానాతో పాటూ శిక్ష విధించింది.

Similar News