జగన్‌కు మరో ఆయుధం దొరికినట్టేనా?

కేసీఆర్‌ ప్రతిపాదిస్తున్న ఫెడరల్‌ ఫ్రంట్‌, వైసీపీ గడపతొక్కింది. ఫ్రంట్లో చేరాలని, కేసీఆర్‌ ఆహ్వానంగా, జగన్‌తో చర్చించారు కేటీఆర్‌. కూటమిలో చేరేది, లేనిది పార్టీ నేతలతో చర్చించి చెబుతానన్న జగన్, ప్రత్యేక హోదా పోరాటానికి మరింత బలం అవసరమని అన్నారు.

Update: 2019-01-17 03:26 GMT
jagan

కేసీఆర్‌ ప్రతిపాదిస్తున్న ఫెడరల్‌ ఫ్రంట్‌, వైసీపీ గడపతొక్కింది. ఫ్రంట్లో చేరాలని, కేసీఆర్‌ ఆహ్వానంగా, జగన్‌తో చర్చించారు కేటీఆర్‌. కూటమిలో చేరేది, లేనిది పార్టీ నేతలతో చర్చించి చెబుతానన్న జగన్, ప్రత్యేక హోదా పోరాటానికి మరింత బలం అవసరమని అన్నారు. అందుకే కేసీఆర్ ప్రతిపాదిస్తున్న ఫెడరల్‌ ఫ్రంట్‌ మంచి వేదికగా భావిస్తున్నామని చెప్పారు. అంటే కేసీఆర్‌తో జగన్‌ జట్టుకట్టడం దాదాపు ఖాయమైంది. మరి కేసీఆర్-జగన్‌ ఫ్రంట్‌ వ్యవహారం, ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది టీఆర్ఎస్‌తో చేతులు కలపడం జగన్‌కు ప్లస్సా...మైనస్సా...బాబుపై దండెత్తడానికి జగన్‌కు మరో ఆయుధం దొరికట్టేనా లేదంటే చంద్రబాబుకే మరో అస్త్రం లభించినట్టయ్యిందా?

పాదయాత్ర ప్రభంజనం ముగించుకుని, ఎన్నికలపై దృష్టిపెట్టిన వైసీపీ అధినేత జగన్‌, తొలిసారి రాజకీయపరమైన నిర్ణయాలపై ఫోకస్‌ పెట్టారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఎలాంటి వ్యూహం అనుసరించాలన్నదానిపై ఆలోచిస్తున్నారు. కేసీఆర్ ప్రతిపాదిస్తున్న బీజేపీయేతర, కాంగ్రెసేతర ఫ్రంట్‌లో చేరడంపై మేథోమథనం సాగిస్తున్నారు. అందులో భాగంగానే తనను కలవడానికి వచ్చిన కేటీఆర్‌ బృందంతో చర్చించారు. ప్రత్యేక హోదా సాధనకు 25 ఎంపీ సీట్లకుతోడు మరిన్ని సీట్లు కావాలన్న జగన్‌, టీఆర్ఎస్‌కు వచ్చే స్థానాలతో మరింత బలంగా హోదాను అడగొచ్చన్నారు. అందుకే కేసీఆర్‌ ప్రతిపాదిస్తున్న ఫెడరల్‌ ఫ్రంట్‌లో చేరడంపై ఆలోచిస్తున్నామని చెప్పారు.

ముందు నుంచి చంద్రబాబుకు వ్యతిరేకంగా గళమెత్తుతున్నారు కేసీఆర్. తెలంగాణ ఎన్నికల్లో,చంద్రబాబే అస్త్రంగా వదిలి విజయం సాధించారు కూడా. కేసీఆర్‌‌తో చేతులు కలపడం ద్వారా, చంద్రబాబుపై దండెత్తడానికి, తనకు మరో ఆయుధం దొరికినట్టయ్యిందని భావిస్తున్నారు జగన్‌. ప్రత్యేక హోదాపై చంద్రబాబు వైఖరిని చాలాసార్లు తప్పుపట్టిన కేసీఆర్‌, వచ్చే ఎన్నికల్లోనూ అలాగే మాట్లాడితే, తనకు కలిసొస్తుందని అనుకుంటున్నారు. అలాగే రాజధానిని చంద్రబాబు గ్రాఫిక్స్‌లోనే చూపించారని విమర్శించారు కేసీఆర్. జగన్‌ కూడా నాలుగున్నరేళ్లుగా చంద్రబాబుపై ఇవే విమర్శలు చేస్తున్నారు. తన వాదన బలపరిచేలా కేసీఆర్‌ ఏపీ జనానికీ పిలుపునిస్తారని, అది తనకు మేలు చేస్తుందని జగన్‌ లెక్కలేస్తున్నారు.

ఇక ఫెడరల్‌ ఫ్రంట్‌‌‌తో జగన్‌ కు మరో ప్లస్ పాయింట్. కేసీఆర్‌ ద్వారా మరో మిత్రుడు లభించడం. అతనే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ. ఇప్పటికే ఐ యామ్‌ కమింగ్‌ టు ఏపీ అంటూ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు అసదుద్దీన్. కాచుకో అన్న రేంజ్‌లో చంద్రబాబుకు సవాల్ విసిరారు. ఒవైసీ అస్త్రం కూడా తనకు తోడయితే, ఒకవర్గం ఓట్లను ఆకర్షించొచ్చని జగన్‌ వ్యూహం. కర్నూలు, గుంటూరు, అనంతపురం లాంటి చోట్ల మైనారిటీ ప్రాబల్యం ఎక్కువుగా ఉంది. ఇలాంటి చోట్ల ఎంఐఎం పోటీ చేయడం లేదా, జగన్‌కు ఒవైసీ మద్దతు ప్రకటించడం మరో ఆప్షన్‌గా కనిపిస్తోంది. తద్వారా టీడీపీ వైపు మళ్లే ముస్లిం ఓటర్లను ఎంఐఎం ద్వారా తమకు మళ్లించుకోవచ్చని వైసీపీ భావనగా తెలుస్తోంది. 

Similar News