మళ్లీ ఆర్మూరు రైతుల రణం

Update: 2019-02-07 04:32 GMT

ఆర్మూర్‌ రైతులు మరోసారి రోడ్డెక్కెందుకు సిద్ధమయ్యారు. గిట్టుబాటు ధరలు ఎర్రజొన్నల కొనుగోలే లక్ష్యంగా వంద గ్రామాల రైతులు ఒకే తాటిపైకి వచ్చారు ఆర్మూర్ వేదికగా భారీ పాదయాత్రతో పోరుబాట పట్టాలని నిర్ణయించుకున్నారు. రైతుల ఆందోళనకు అఖిలపక్ష నేతలు కూడా మద్ధతు పలకడంతో జిల్లా వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు.

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డివిజన్ రైతులు మరోసారి ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. పసుపు క్వింటాకు 15వేలు, ఎర్రజొన్నలకు క్వింటాలుకు 3500 ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నేడు మహా పాదయాత్రకు సిధ్ధమయ్యారు. మామిడిపల్లి చౌరస్తా నుంచి సుమారు 100 గ్రామాల రైతులు భారీ పాదయాత్రగా ఆర్మూర్ తహసిల్దార్ కార్యాలయానికి రానున్నారు. ఇక్కడే నిరసన ప్రదర్శన చేపట్టి తమ డిమాండ్ల సాధన దిశగా పోరాటానికి దిగనున్నారు. ఇటీవల జరిగిన రైతు ఆవేదన సభలో దశల వారిగా ఉద్యమాన్ని ఉద్దతం చేయాలని తీర్మానించారు. ఇందులో భాగంగానే ఆర్మూర్ డివిజన్ లోని ఇంటికొక పసుపు రైతు ఆందోళనలో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు.

రైతుల పిలుపుతో జిల్లా కలెక్టర్‌తో పాటు వ్యవసాయ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. సీడ్ కంపెనీలతో పాటు రైతు సమన్వయ సమితి సభ్యలతో సమావేశం ఏర్పాటు చేశారు. బై బ్యాక్ ఒప్పందం ప్రకారం సీడ్ కంపెనీలు ఎర్రజొన్నలను కొనుగోలు చేయాలని ఆదేశించారు. లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రైతుల ఛలో ఆర్మూర్ పిలుపు నేపథ్యంలో నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో హై అలర్ట్ ప్రకటించారు. రైతులు ఒక్కసారిగా రోడ్డెక్కితే పరిస్ధితి చేయి దాటుతుందని పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే రైతులు మాత్రం శాంతియుతంగా పాదయాత్ర చేసి తమ ఆవేదన సర్కారు దృష్టికి తీసుకెళ్తామంటున్నారు. ఈ నేపధ్యంలో రైతుల ఆందోళనపై జిల్లా వ్యాప్తంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికే రైతుల కదలికలపై కన్నేసిన పోలీసులు పరిస్ధితి చేయి దాటకుండా చర్యలు తీసుకుంటున్నారు.  

Similar News