తెలంగాణ ఓటర్ల తుది జాబితాను ప్రకటించిన ఈసీ

Update: 2019-02-23 05:43 GMT

పార్లమెంట్ ఎన్నికల కోసం ఓటర్ల తుది జాబితాను ఈసీ ప్రకటించింది. తెలంగాణలో మొత్తం 2కోట్ల 95లక్షల మంది ఓటర్లు ఉన్నట్టు ఈసీ ప్రకటించింది. తుది జాబితాలో పేర్లు లేని వారికి మార్చి 2,3తేదీల్లో స్పెషల్ క్యాంప్ ద్వారా నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఓటు లేనివారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈసీ సూచించింది.

తెలంగాణలో ఓటర్ల తుది జాబితాను ఈసీ ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం 2కోట్ల 95లక్షల 18వేల 964 మంది ఓటర్లు ఉన్నట్టు ఈసీ వెల్లడించింది. ఇందులో పురుష ఓటర్లు ఒక కోటీ 48లక్షల 48వేల మంది ఉండగా ఒక కోటీ 46లక్షల 74వేల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అలాగే, థర్డ్ జెండర్ ఓటర్లు 1368 మంది, సర్వీస్ ఓటర్లు అంటే త్రివిధ దళాలకు చెందిన వారు 10వేల మందికి పైగా ఉన్నారు. ఇక ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు 1122 మంది, వికలాంగులు 4లక్షల 69వేల మంది, 18 నుంచి 19ఏళ్ల వయస్సు గల వారు 5లక్షల 99వేల 933 మంది ఓటర్లుగా ఉన్నట్టు ఈసీ రజత్‌కుమార్ చెప్పారు.

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల నమోదు కోసం స్పెషల్‌ డ్రైవ్‌ను ఈసీ నిర్వహిస్తోంది. ఈ డ్రైవ్‌లో కొత్త ఓటర్లు, అడ్రస్ చేంజ్, డెత్ కేసులు, ఫిర్యాదులు, అభ్యంతరాలకు సంబంధించి మొత్తం 26లక్షల 23 వేల దరఖాస్తులు వచ్చాయి. వాటిని స్ర్కూట్నీ చేసిన ఈసీ 23లక్షల 78వేల మంది దరఖాస్తులకు ఆమోదం తెలిపింది. ఇందులో 18 నుంచి 19ఏళ్ల వయస్సు గల వారు 5లక్షల 99 వేల మంది ఉన్నట్టు ఈసీ రజత్‌కుమార్ తెలిపారు.

ఓటర్ల నమోదుకు చివరి అవకాశాన్ని కూడా ఈసీ కల్పించింది. మార్చి 2,3తేదీల్లో ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేస్తోంది. ఓటరుగా నమోదు చేసుకున్నప్పటికీ జాబితాల్లో పేర్లు లేనివారికి మరో అవకాశం ఇస్తోంది. ఈ క్యాంపుల్లో బూత్ లెవెల్ అధికారులు దరఖాస్తులతో అందుబాటులో ఉంటారని, 14వ తేదీవరకూ పరిశీలించి ఓటరుగా నమోదు చేస్తామని ఈసీ రజత్‌కుమార్ తెలిపారు.

గత అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో 2కోట్ల 80లక్షల 64వేల 684 మంది ఓటర్లు ఉండగా ఈసీ చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌తో కొత్తగా 14లక్షల 54వేల మంది ఓటర్లు పెరిగారు. అంటే రాష్ట్రంలో ప్రస్తుతం ఓటర్ల సంఖ్య 2కోట్ల 95లక్షలకు చేరింది.  

Similar News