తెలంగాణ ఉద్యమంపై మాటల తూటాలు పేల్చిన పవన్‌

Update: 2019-04-05 05:10 GMT

రాష్ట్రం ఏర్పడటం తోనే తెలంగాణకు స్వతంత్య్రం రాలేదని దోపిడీ వ్యవస్థ, అవినీతి రహిత, కుటుంబ పాలన నుంచి విముక్తి పొందినప్పుడే నిజమైన రాష్ట్రం వచ్చినట్లని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన యుద్ధభేరీలో బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతితో కలిసి పాల్గొన్న ఆయన తెలంగాణ ఉద్యమం తన చేతుల్లో ఉండి ఉంటే ఆంధ్రా పాలకులకు చుక్కలు చూపించే వాడినన్నారు. తెలంగాణలో పుట్టకపోవడం తన దురదృష్టమని అన్నారు.

లోక్‌సభ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన జనసేన యుద్ధభేరీలో పవన్‌ ప్రసంగం పంచ్‌లతో సాగింది. భారీగా తరలివచ్చిన అభిమానులతో కిక్కిరిసిపోయిన సభలో పవన్‌ తెలంగాణ ఉద్యమంపై మాటల తూటాలు పేల్చారు. తెలంగాణ వెనుకబాటుతనం, సాయుధ పోరాటంపై తనకు పూర్తిగా అవగాహన ఉందన్న పవన్‌ ప్రస్తుత తెలంగాణలో మార్పు రావాలని అన్నారు. తెలంగాణ ఉద్యమం తన చేతుల్లో ఉంటే ఆంధ్ర నాయకులకు చుక్కులు చూపించే వాడినంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడే జరిగి ఉంటే ఎంతో మంది ఉస్మానియా విద్యార్థులకు, యువతకు జనసేన నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చేవాడినని పవన్ కళ్యాణ్ తెలిపారు. మనకు ఆవేశంతో కూడిన తెలంగాణ కాదని ఆలోచనతో కూడిన తెలంగాణ కావాలని అన్నారు. దళితుడిని సీఎం చేస్తామన్న హామీ ఇంతవరకు అమలు కాలేదని పవన్‌ గుర్తు చేశారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి వేరుపడ్డా తెలంగాణ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. ఎస్సీ ఎస్టీ, బలహీన వర్గాలు ఎక్కువగా ఉన్న తెలంగాణలో వారంతా అధికారానికి దూరంగానే ఉన్నారని తెలిపారు. వారు అభివృద్ధికి దూరంగా ఉన్నారని చెప్పారు. ఎన్నో ప్రతికూల పరిస్థితులుండే ఉత్తరప్రదేశ్‌ లాంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన మాయావతి దేశానికి ప్రధాని కావాలని పవన్‌ ఆకాంక్షించారు. అలాంటి మార్పు కోసమే జనసేన పనిచేస్తుందని చెప్పుకొచ్చారు. 

Similar News