అడవి నుంచి పూచికపుల్ల బయటికి పోరాదు

Update: 2019-01-27 04:51 GMT

అడవి నుంచి పూచికపుల్ల కూడా బయటికి పోకుండా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. కలప స్మగ్లర్లపై పీడీ యాక్ట్ నమోదు చేయాలన్నారు. అటవీ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.

ప్రగతి భవన్‌లో పోలీస్, అటవీ శాఖ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ ఎస్‌కే జోషి, డీజీపీ మహేందర్ రెడ్డి, అటవీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అడవుల పరిరక్షణ, మొక్కల పెంపకం కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. రాష్ట్రంలో అడవులను కాపాడే విషయంలో ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోంది అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అడవి నుంచి పూచికపుల్ల కూడా బయటికి పోకుండా చర్యలు తీసుకోవాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. కలప స్మగ్లర్లపై పీడీ యాక్ట్ నమోదు చేయాలన్నారు.

సాయుధ పోలీసులు అటవీ శాఖ అధికారులతో కలిసి జాయింట్ ఫ్లయింగ్ స్క్వాడ్‌ను ఏర్పాటు చేయాలని సీఎం కోరారు. ఈ బృందాలు అడవిలో నిరంతర తనిఖీలు నిర్వహించడంతో పాటు అడవి నుంచి వెళ్లే మార్గాలపై నిఘా పెట్టాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పోలీస్ ఇన్‌స్పెక్టర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో అడవులను రక్షించే బాధ్యతను తీసుకోవాలన్నారు కేసీఆర్. అడవులను రక్షించడానికి, ఆక్రమణదార్లు, స్మగ్లర్లను కఠినంగా శిక్షించడానికి అవసరమైతే చట్టాల్లో మార్పులు తేవాలని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. 

Similar News