Andhra: ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యార్థులకు శుభవార్త తీసుకొచ్చిన ఏపీ సర్కార్!

ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యార్థులకు పండగలాంటి వార్త: సన్న బియ్యంతో రుచికరమైన మధ్యాహ్న భోజనం

Update: 2025-06-02 13:27 GMT

Andhra: ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యార్థులకు శుభవార్త తీసుకొచ్చిన ఏపీ సర్కార్!

Andhra: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు మధురమైన వార్తను అందించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులకు రుచికరమైన, పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం అందించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జూన్ 12వ తేదీ నుంచి సన్న బియ్యంతో భోజనం అందించనున్నట్టు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.

సన్న బియ్యంతో మెనూ – రైతుకు గౌరవం

రాష్ట్రంలోని 41,000 ప్రభుత్వ పాఠశాలలు, 4,000 సంక్షేమ హాస్టళ్లకు మొత్తం 3.5 లక్షల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం సరఫరా చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ బియ్యం ఉత్పత్తి చేసిన రైతుల నుంచే ప్రత్యక్షంగా సదరు బియ్యాన్ని కొనుగోలు చేసి పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. దీని ద్వారా రైతులకు గౌరవం కల్పించడమే లక్ష్యమని అన్నారు.

రైతులకు అండగా కూటమి ప్రభుత్వం

అకాల వర్షాలు, వరుస ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోయిన రైతులకు న్యాయం చేయడంలో పూర్వ ప్రభుత్వం విఫలమైందని, కానీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నెలలోనే రూ.1674 కోట్లు బకాయిలను రైతులకు చెల్లించినట్లు మంత్రి తెలిపారు. ఖరీఫ్, రబీ కలిపి 48 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ.12,400 కోట్లు 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో జమ చేసినట్టు వివరించారు.

సాంకేతికతతో ధాన్యం అమ్మకానికి అవకాశం

రైతులు తమకు అనుకూలమైన రైస్ మిల్లులకు ధాన్యం అమ్ముకునే వెసులుబాటు కల్పించామని, వాట్సాప్ ద్వారా కూడా అమ్మకాల సౌకర్యం కల్పించామన్నారు. తడిసిపోయే ధాన్యం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 5.13 లక్షల తడితొట్ల్లు ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు భరోసా ఇచ్చినట్లు తెలిపారు.

పారదర్శకతతో రేషన్ పంపిణీ

గత ప్రభుత్వ కాలంలో ఎం.డి.యూ వాహనాల ద్వారా సరుకుల పంపిణీపై అసంతృప్తి వ్యక్తమవగా, ప్రస్తుతం 1.46 కోట్ల కుటుంబాలకు 29,761 రేషన్ దుకాణాల ద్వారా రేషన్ సరుకులు పంపిణీ చేస్తున్నారు. ప్రతి నెలా 1 నుంచి 15వ తేదీ వరకు రెండు విడతలుగా రేషన్ అందజేస్తారు. దివ్యాంగులు, వృద్ధుల కోసం ఇంటి వద్దకే సరుకులు పంపిణీ చేసే ఏర్పాటు కూడా కల్పించామని మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు.

సంక్షేమం మాత్రమే కాదు, వ్యవసాయ అభివృద్ధికి కృషి

రైతుల నష్టాలను తక్షణమే పరిహరించేందుకు తీసుకుంటున్న చర్యలు, బకాయిల చెల్లింపు, మరియు పారదర్శక వ్యవస్థ ద్వారా నూతన ప్రభుత్వ సంకల్పాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయని మంత్రి తెలిపారు. రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా వ్యవసాయం, విద్య, ప్రజాపంపిణీ వ్యవస్థల బలోపేతానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు.

Tags:    

Similar News