రేపు చివరి దశ పరిషత్ ఎన్నికలు

Update: 2019-05-13 16:30 GMT

రేపు పరిషత్ చివరి దశ ఎన్నికలకు ఏర్పాట్లు చేసింది ఈసీ. చివరి విడతలో 1708 ఎంపీటీసీ, 160 జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగనుంది. ఎంటీపీసీ స్థానాలకు 5,726మంది, జడ్పీటీసీ స్థానాలకు 741మంది బరిలో నిలిచారు. మూడోదశలో 46లక్షల 64వేల మంది ఓటర్లుండగా 9,494 పోలింగ్ స్టేషన్లు సిద్ధం చేశారు.

మూడో దశ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌కు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. రాష‌్ట్ర వ్యాప్తంగా 5,817 ఎంపీటీసీ, 538 జడ్పీటీసీ స్థానాలకు మూడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తోంది. మొదటి దశ ఎన్నికలు ఈనెల 6న , రెండో దశ 10న జరిగాయి. ఇక ఆఖరి దశ పోలింగ్ మంగళవారం జరుపనుంది.

చివరి దశలో 1738 ఎంపీటీసీలు, 161 జడ్పీటీసీలకు నోటిఫికేషన్ జారీ అయింది 30 ఎంపీటీసీలు ఏకగ్రీవం కాగా మిగిలిన 1708 ఎంపీటీసీలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఆసిఫాబాద్ జడ్పీటీసీ ఏకగ్రీవం కాగా 160 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఎంపీటీసీలకు 5,726 మంది, జడ్పీటీసీలకు 741 మంది పోటీ పడుతున్నారు. తొలివిడతలో వాయిదాపడిన రంగారెడ్డి జిల్లా అజిజ్ నగర్, సిద్దిపేట జిల్లా ఆళ్వాల్ ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ మంగళవారం జరుగుతుంది.

ఆఖరి విడత పరిషత్ పోలింగ్ ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన మంచిర్యాల, కొమురంభీం ఆసిఫాబాద్, భదాద్రి కొత్తగూడెం, ములుగు జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో సాయంత్రం 4గంటల వరకే పోలింగ్ జరుగుతుంది. పరిషత్ ఎన్నికల్లో ఎంపీటీసీలకు గులాబీరంగు, జడ్పీటీసీ అభ్యర్థులకు తెలుపురంగు బ్యాలెట్ పేపర్ ఉంటుంది. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది.

చివరి దశ పరిషత్ ఎన్నికలకు అన్నిఏర్పాట్లు చేసినట్లు ఈసీ ప్రకటించింది. చివరి విడతలో 46లక్షల 64వేలకుపైగా ఓటర్లు ఉండగా 9వేల 494 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసింది. ఎన్నికల తీరును పరిశీలించేందుకు రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలో వార్ రూంద్వారా పోలింగ్ సరళిని పర్యవేక్షించనున్నారు. ఎన్నికలకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పరిషత్ ఎన్నికల ఫలితాలు ఈనెల 27న వెలువడనున్నాయి.

Similar News