అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు షాక్ మీద షాక్

Update: 2021-01-13 15:15 GMT

YouTube Suspends Donald Trump Channel Temporarily

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పరిస్థితి రొజురోజుకూ దిగజారిపోతోంది. అమెరికాలో క్యాపిటల్ భవనంపై దాడి తర్వాత ట్రంప్ ఇమేజ్ ఒక్కసారిగా డామేజ్ అయింది. ఓ వైపు సన్నిహితులు దూరం పాటిస్తుంటే మరోవైపు ఆయనపై అభిశంసన మొదలైంది. ఇలాంటి సమయంలోనే పలు సోషల్ మీడియా అకౌంట్లు ట్రంప్‌కు షాకిస్తున్నాయి.

అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు షాక్ మీద షాక్ తగులుతోంది. ఇప్పటికే ట్విట్టర్, ఫేస్‌బుక్, గూగుల్‌తో పాటు పలు సోషల్ మీడియా సంస్థలు ట్రంప్ అకౌంట్లను తొలగించడమో తాత్కాలికంగా నిలిపివేయడమో చేయగా తాజాగా యూట్యూబ్ ట్రంప్ వ్యక్తిగత చానెల్‌ను నిలిపివేసింది. క్యాపిటల్‌ బిల్డింగ్ ‌పై దాడి అనంత‌రం అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ పై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తోన్న నేప‌థ్యంలో ఇప్ప‌టికే ఆయ‌న అధికారిక‌ ట్విట్ట‌ర్ అకౌంట్‌ను ఆ సంస్థ‌ బ్యాన్ చేసింది.

ఇప్పటికే ట్రంప్‌కు వ్యక్తిగత ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్ వంటి అకౌంట్లు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఇప్పుడు ఆయ‌న‌ యూట్యూబ్ ఖాతాను కూడా తాత్కాలికంగా స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు ఆ సంస్థ‌ ప్ర‌క‌టించింది. అందులో తాజాగా అప్‌లోడ్ చేసిన కంటెంట్‌ను యూట్యూబ్ డిలీట్ చేసింది. యూట్యూబ్ నిబంధ‌న‌ల‌ను అందులో ఉల్లంఘించిన‌ట్లు యూట్యూబ్ తెలిపింది. హింస‌ను ప్రేరేపించేలా వీడియోలో కంటెంట్ ఉండ‌డంతో యూట్యూబ్ ఈ చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు స్పష్టం చేసింది. దాంతో వారం రోజుల పాటు ట్రంప్ త‌న‌ ఛాన‌ల్‌లో వీడియోల‌ను అప్‌లోడ్ చేయలేరు. ట్రంప్ ఛాన‌ల్‌పై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ కొన్ని సామాజిక సంఘాలు డిమాండ్ చేయ‌డంతో యూట్యూబ్ ఈ చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

అధ్య‌క్ష‌ ఎన్నిక‌ల్లో మోసం జ‌రిగిన‌ట్లు ఓ వీడియోలో ట్రంప్ సంచలన వ్యాఖ్య‌లు చేశారు. ట్రంప్ ఛాన‌ల్‌కు 2.77 మిలియ‌న్ల స‌బ్‌స్క్రైబ‌ర్లు ఉన్నారు. ఇప్పటికే ఓటమితో ఢీలా పడిన ట్రంప్‌కు సోషల్ మీడియా సంస్థలు కూడా షాకులమీద షాకులిస్తున్నాయి. 

Tags:    

Similar News