World War 3: మూడో ప్రపంచ యుద్ధం రావడం ఖాయమేనా?

World War 3: ఇజ్రాయెల్ చేసిన భారీ దాడికి ప్రతీకారంగా ఇరాన్ మిసైళ్ళతో విరుచుకుపడుతోంది. ఇరు దేశాల్లోని ప్రధాన నగరాల్లో పేలుళ్లు సంభవిస్తున్నాయి

Update: 2025-06-16 01:30 GMT

World War 3: మూడో ప్రపంచ యుద్ధం రావడం ఖాయమేనా?

World War 3: ఇజ్రాయెల్ చేసిన భారీ దాడికి ప్రతీకారంగా ఇరాన్ మిసైళ్ళతో విరుచుకుపడుతోంది. ఇరు దేశాల్లోని ప్రధాన నగరాల్లో పేలుళ్లు సంభవిస్తున్నాయి. ప్రజలు భయంతో బంకర్లలోకి పరుగులు తీస్తున్నారు. గగనతలంలో బాంబులు శబ్దాలు, భూమిపై అంబులెన్సులు.. ఇలా ఎక్కడ చూసినా ఆందోళనా, అనిశ్చితి. ఇలా ఇజ్రాయెల్‌-ఇరాన్‌ యుద్ధంతో ప్రపంచం మొత్తం బిక్కుబిక్కుమంటోంది. ఇక ఇదే సమయంలో అమెరికా కూడా రంగంలోకి దిగితే? అప్పుడు మూడో ప్రపంచ యుద్ధం రావడం ఖాయమేనా? లేదా ఇప్పటికే మూడో ప్రపంచ యుద్ధం మొదలైపోయిందా?

మరోవైపు ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిసైల్ దాడులతో రెచ్చిపోతూనే ఉంది. మొదటి దాడిలో టెల్ అవీవ్‌లోని ఓ హైరైజ్ బిల్డింగ్‌ లక్ష్యంగా మారింది. రెండో దాడి జెరూసలేంపై జరిగింది. ఇటు ప్రజలకు తక్షణంగా షెల్టర్‌ల్లోకి వెళ్లాలంటూ ఇజ్రాయెల్‌ ఆర్మీ హెచ్చరికలు జారీ చేసింది. వేల మంది రాత్రంతా భయంతో బంకర్లలోనే గడిపారు. అటు ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో ఇప్పటి వరకు మొత్తం 78 మంది మృతిచెందినట్లు ఇరాన్ ప్రకటించగా, 300కుపైగా మందికి గాయాలు అయ్యాయని సమాచారం. ఇక ఇరాన్ ప్రభుత్వం దీన్ని పూర్తి స్థాయి యుద్ధంగా భావిస్తుండగా, ఇజ్రాయెల్ మరో దాడికి సిద్ధమవుతోందన్న సంకేతాలు ఇస్తోంది.

ఇలా ఇరాన్-ఇజ్రాయెల్‌తో పాటు మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చే మిసైల్ గర్జనలు ఇప్పుడు ప్రపంచ రాజధానుల్లో ఆందోళనగా మారిపోయాయి. అమెరికా స్పందన, బ్రిటన్ నిర్ణయాలు, రష్యా కామెంట్స్‌, చైనా మౌనం.. ఇలా అన్నీ కలిపి చూస్తే భయమేస్తోంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసరంగా సమావేశమై మాట్లాడినా, దాని మాటలు మిసైల్ శబ్దాల మధ్యే మసకబారిపోయాయి. ఇటు నాటో దేశాలు తమ సైనిక స్థావరాలను బలోపేతం చేసుకుంటున్నాయి. మరోవైపు యుద్ధాన్ని ఆపే శక్తిగా నిలవాల్సిన ఐక్యరాజ్య సమితి చేతులెత్తేసినట్లే కనిపిస్తోంది. ఇక అంతర్జాతీయ మీడియా, గ్లోబల్ లీడర్లు ఒక్కొక్కరుగా వ్యూహాత్మక భద్రతకి సిద్ధం కావాలనే పిలుపులు ఇస్తున్నారు. అంటే తాము యుద్ధాన్ని ఆపలేమని, అయితే ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పకనే చెబుతున్నారు. ప్రపంచంలో తలెత్తుతున్న ఆర్థిక అస్థిరత, పెట్రోల్ ధరల ఎగసిపోవడం, స్టాక్ మార్కెట్ల పతనం లాంటివి ఈ ఉద్రిక్తతల ప్రతిఫలాలే. ఇక మిగతా ఖండాల్లో ఉన్న దేశాలు కూడా ఇప్పుడు తమ తమ సైనిక బలాన్ని పటిష్టం చేస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే, ఇది కేవలం రెండు దేశాల యుద్ధం కాదు.. ఒక ప్రపంచ యుద్ధానికి ప్రారంభమైన సంకేతం కనిపిస్తోంది. శాంతికి మార్గం ఏదైనా మిగిలిందా అనే ప్రశ్నకి సమాధానం లేకుండా పోతోంది.

ఇక ఇప్పుడంతా వేదిక మధ్యన నిలబడింది అమెరికానే. మాటల్లో శాంతిని పలుకుతూ, చేతల్లో ఆగ్రహాన్ని దాచుకుంటోంది. ఇరాన్‌పై ఇజ్రాయెల్ చేసిన దాడులకు మౌనంగా మద్దతిస్తోంది. అమెరికా తన సిబ్బందిని బహ్రెయిన్‌, బాగ్దాద్‌, కువైట్‌ల నుంచి వెనక్కి పిలవడం.. యుద్ధ భూతాన్ని స్వయంగా అంగీకరించినట్లే. మరోవైపు అణ్వాయుధంపై చర్చలు జరగాల్సిన ఒమన్ సమావేశం నిలిచిపోయింది. ఇక మౌనం మాటలకు ముందు నిలబడ్డ అగ్నిపర్వతంగా మారుతోంది. అమెరికా అధ్యక్షుడు చెప్పే ఒక్క మాటే ఈ యుద్ధాన్ని ఆపగలదు.. లేదా నిప్పుల చెరలోకి నెట్టగలదు. ఆయుధాల తీర్పు లేని చోట, మాటల సంధి అసాధ్యం అనిపిస్తోంది. ఇప్పుడు మాటలు కన్నా ముందుగా బుల్లెట్లు, మిసైళ్లే పరుగులు పెడుతున్నాయంటే.. ఆగిపోయిన అణు చర్చలు భవిష్యత్తుకే ప్రశ్నార్థకం. అగ్రరాజ్యాల తీర్పు ఇప్పుడే వస్తే మానవాళి బతికే అవకాశముంది.

Tags:    

Similar News