Indiana IN US: వలసదారులను వెనక్కి పంపించేస్తున్న ట్రంప్.. భారత్ బయలుదేరిన తొలి విమానం
Indiana IN US: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా అక్రమ వలసదారులను లక్ష్యంగా చేసుకున్నారు. దీంతో అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ షురూ అయ్యింది. అక్రమంగా ఉంటున్నవారిని గుర్తించి అధికారులు ఆయా దేశాలకు ప్రత్యేక విమానాల్లో తరలిస్తున్నారు. తాజాగా భారత్ కు చెందిన అక్రమ వలసదారులతో కూడిన విమానం భారత్ కు బయలు దేరింది. ఈ విషయాన్ని అక్కడి అధికారులు వెల్లడించిన వార్త ఏజెన్సీ రాయిటర్ సంస్థ పేర్కొంది. సీ 17 ఎయిర్ క్రాఫ్ట్ లో వలసదారులను తరలిస్తున్నట్లు సమాచారం. భారత్ కు చేరుకునేందుకు 24గంటల సమయం పడుతుందని అంచనా. అయితే ఎంత మంది వలసదారులను తరలిస్తున్నారన్న విషయంపై మాత్రం క్లారిటీ లేదు.
అక్రమ వలసదారులపై ట్రంప్ మొదటి నుంచి కఠినంగానే వ్యవహరిస్తున్నారు. ఆయన పదవీ బాధ్యతలు చేపట్టడంతో వారి గుర్తింపు తరలింపు ప్రక్రియ వేగవంతం చేశారు. మొదట 538మందిని అరెస్టు చేసి ఆయ దేశాలకు తరలిచారు. ఇక ఎల్ పాసూ, టెక్సాక్, శాన్ డియాగో, కాలిఫోర్నియాలో ఉన్న 5,000మంది అక్రమ వలసదారులను ఆయా దేశాలకు తరలించేందుకు పెంటగాన్ సిద్ధమైంది. ఇప్పటికే గటేమాలా, పెరు, హొండూరస్ తదితర దేశాలకు అమెరికా విమానాల్లో పలువురిని తరలించింది. ఒక్కొక్క వలసదారుడిని తరలించేందుకు అమెరికాకు భారీగా ఖర్చు అవుతోంది. గతవారం గటెమాలకు తరలించిన ఒక్కో వ్యక్తిపై అమెరికా సుమారు 4,675 డాలర్లను ఖర్చు చేసింది.
అక్రమ వలసదారులపై అమెరికా అనుసరిస్తున్న విధానాల పట్ల ఇప్పటికే భారత్ తన స్పందనను తెలిపింది. అక్రమ వలసలకు తాము వ్యతిరేకమని..ఈ అంశం అనేక రకాల వ్యవస్థీక్రుత నేరాలతో ముడిపడి ఉందని పేర్కొంది. వీసా గడువు ముగిసినా లేదా సరైన దస్త్రాలు లేకుండా భారతీయులు అమెరికాతో సహా ఎక్కడ ఉన్నా వారిని తిరిగి తీసుకువచ్చేందుకు వీలు కల్పిస్తామని భారత విదేశాంగశాఖ స్పష్టం చేసింది. అమెరికాలో సరైన ధ్రువపత్రాలు లేకుండా భారత్ కు చెందిన వలసదారులు 7,25,000 మంది ఉన్నట్లు సమాచారం. వీరిలో 18,000మందికి భారత్ కు తరలించేందుకు అమెరికా ప్రభుత్వం జాబితాను రూపొందించింది. మెక్సికో, సాల్వెడార్ ప్రజల తర్వాత ఎక్కువమంది భారతీయులే ఉన్నారు.