UN General Assembly: ఐక్యరాజ్యసమితి 80వ సర్వసభ్య సమావేశాలు... ప్రత్యేక దేశంగా పాలస్తీనా

ఐక్యరాజ్య సమతి 80వ సమావేశాలు తెరపైకి ప్రత్యేక దేశంగా పాలస్తీనా ఫ్రాన్స్, బ్రిటన్ సహా పలు దేశాల మద్దతు వ్యతిరేకిస్తున్న ఇజ్రాయెల్, అమెరికా పాలస్తీనాను గుర్తించబోమన్న ఇజ్రాయెల్ పాలస్తీనాకు 140 పైగా దేశాల మద్ధతు.

Update: 2025-09-24 05:50 GMT

ఐక్యరాజ్యసమితి 80వ సర్వసభ్య సమావేశాలు... ప్రత్యేక దేశంగా పాలస్తీనా

పశ్చిమాసియాలో సమీకరణాలు మారుతున్నాయా? పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తిస్తారా? ఐక్యరాజ్యసమితి 80వ సర్వసభ్య సమావేశాల్లో ఈసారి ఇదే అంశం ప్రధాన ఎజెండాగా నిలువబోతోంది. ఇజ్రాయెల్, అమెరికా వ్యతిరేకిస్తున్నప్పటికీ పాలస్తీనా అంశానికి బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు మద్దతు ఇవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు గాజాలో ఎలాగైనా యుద్ధాన్ని నిలిపేసేందుకు అమెరికా అధ్యక్షుడు తయారు చేసిన ప్రణాళికపై చర్చ జరుగుతోంది. శాంతిని నెలకొల్పే దిశగా అరబ్, ఇస్లామిక్ దేశాలతో ట్రంప్ చర్చించనున్నారు. కాగా అమెరికా అధ్యక్షునికి హమాస్‌ రహస్య లేఖ పంపినట్లు తెలుస్తోంది.


ఈసారి జరుగుతున్న ఐక్యరాజ్యసమితి 80వ సర్వసభ్య సమావేశాలకు మరింత ప్రాధాన్యత పెరిగింది. సెప్టెంబర్ 9న సమావేశాలు ప్రారంభం కాగా సెప్టెంబర్ 23 నుంచి 27 వరకు, 29న జరిగే ఉన్నత స్థాయి సాధారణ చర్చలతో కీలక మైలురాయిగా నిలవనుంది. గాజా, ఉక్రెయిన్‌ యుద్ధాలతో పాటు.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ విధిస్తున్న సుంకాలతో ప్రపంచం అతలాకుతలమవుతున్న నేపథ్యంలో 150కుపైగా దేశాల అధినేతలు న్యూయార్క్‌లో జరగనున్న ఐక్యరాజ్యసమితి వార్షిక సర్వ ప్రతినిధుల సభ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశానికి భారత్‌ తరఫున విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ హాజరుకానున్నారు. మొత్తం 193 సభ్య దేశాలు ఈ వార్షిక సమావేశంలో వివిధ అంశాలపై తమ గళాన్ని వినిపించనున్నాయి. తమ దేశాల ఆలోచనలను, సమస్యలను, పరిష్కార మార్గాలను పంచుకుంటారు. యుద్ధాలతో పాటు.. పర్యావరణ అంశాలు, టెక్నాలజీ, ఐరాస సంస్కరణలు ఇతర కీలక అంశాలపై ప్రపంచ నేతలు చర్చించనున్నారు.


ఐక్యరాజ్యసమితి 80వ సర్వసభ్య సమావేశాల్లో పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించే అంశం ప్రధానంగా చోటు చేసుకోనుంది. ఫ్రాన్స్, సౌదీ అరేబియా దేశాలు ఈ అంశంపై ఇతర దేశాల మద్దతు కోరేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఈ గుర్తింపు విషయంలో వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నాయి. పాలస్తీనా ఎప్పటికీ దేశం కాబోదని వ్యాఖ్యానించిన నెతన్యాహు ఇజ్రాయెల్‌ ప్రధానిగా తన దేశం తరఫున సభలో వాదనలు వినిపించనున్నారు. జోర్డాన్ నది పశ్చిమ భాగంలో పాలస్తీనా ఏర్పాటు కాదని ఆయన ఇప్పటికే ప్రకటించారు. పాలస్తీనా అధ్యక్షుడు మహమ్మద్‌ అబ్బాస్‌కు అమెరికా వీసా నిరాకరించిన నేపథ్యంలో ముందే రికార్డుచేసిన వీడియో సందేశంలో ఆయన వర్చువల్‌గా ప్రసంగిస్తారు. ఈ సమావేశాల్లో ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధంతో గాజాలో నెలకొన్న మానవతా సంక్షోభంపై ఇటీవల సర్వప్రతినిధుల సభ ఆమోదించిన ‘న్యూయార్క్‌ డిక్లరేషన్‌’పైనా చర్చ జరిగే అవకాశం ఉంది.


మరోవైపు మన దేశం శాంతి, స్థిరత్వం, సహకారం కోసం తన విధానాలను వివరించనుంది. పర్యావరణ సమస్యలు, అంతర్జాతీయ భద్రత వంటి అంశాలపై భారతదేశం తన దృక్పథాన్ని స్పష్టం చేయనుంది. పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించాలనే డిమాండ్‌కు క్రమంగా మద్దతు పెరుగుతోంది.అమెరికా, ఇజ్రాయెల్‌ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ.. పాలస్తీనాను అధికారికంగా దేశంగా గుర్తిస్తున్నట్లు ప్రకటించారు బ్రిటిష్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ . పాలస్తీనీయులు, ఇజ్రాయెల్‌ పౌరుల్లో శాంతిస్థాపన ఆశలను పునరుద్ధరించేందుకు, ద్విదేశ పరిష్కారం కోసం ఈమేరకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఫ్రాన్స్‌ అధినేత మేక్రాన్‌ మాట్లాడుతూ తమ దేశం పాలస్తీనాను అధికారికంగా గుర్తిస్తుందని ప్రకటించారు. శాంతికి కచ్చితంగా అవసరమైన మార్గం సిద్ధం చేయాలన్నారు. కెనడా, ఆస్ట్రేలియాలు సైతం ఈమేరకు ప్రకటన చేశాయి.

గాజాలో కాల్పుల విరమణకు, ఐరాస సాయం అనుమతికి, దీర్ఘకాలిక శాంతికి ఇజ్రాయెల్ అంగీకరించకపోతే.. పాలస్తీనాను దేశంగా గుర్తిస్తామని జులైలోనే స్టార్మర్‌ ప్రకటించారు. ఇప్పటివరకు 140కి పైగా దేశాలు పాలస్తీనాను దేశంగా గుర్తించాయి. త్వరలోనే ఫ్రాన్స్‌ తదితర దేశాలూ ఈమేరకు ప్రకటనలు చేయనున్నట్లు సమాచారం.


మరోవైపు గాజా యుద్ధం ముగించే ప్రణాళికపై దృష్టి పెట్టారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇందుకు అనుసరించనున్న ప్రణాళికపై ఆయన అరబ్‌, ముస్లిం దేశాధినేతలతో చర్చించాలని నిర్ణయించారు. ఈ దిశగా సౌదీ, యూఏఈ, ఖతార్‌, ఈజిప్ట్‌, జోర్డాన్‌, తుర్కియే, ఇండోనేసియా, పాకిస్థాన్‌ నేతలతో ట్రంప్‌ చర్చలు జరిపేందుకు సిద్ధమయ్యారు. గాజా యుద్ధాన్ని అత్యవసరంగా ఆపేందుకు ట్రంప్‌ ఈ ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. శాంతికి అవసరమైన ప్రతి అంశాన్ని కచ్చితంగా పరిశీలించాలని ఆయన సూచించారు. ప్రాంతీయ భాగస్వాములతో కలిసి వాషింగ్టన్‌ పనిచేస్తోందన్నారు.

ట్రంప్‌ కార్యవర్గ ప్రణాళికను ముఖ్యంగా మూడు అంశాలు కేంద్రంగా తయారుచేశారు. బందీలను విడిచిపెట్టడం, గాజా నుంచి ఇజ్రాయెల్‌ దళాల ఉపసంహరణపై చర్చించడం, హమాస్‌ పాత్ర లేకుండా యుద్ధానంతరం గాజా నిర్వహణ వ్యవస్థను ఏర్పాటుచేయడం ప్రధానమైనవి. అరబ్‌, ముస్లిం దేశాలు గాజాలో శాంతి కోసం దళాలను, పునర్‌నిర్మాణం కోసం నిధులు సమకూర్చాలని అమెరికా కోరుకుంటోంది. యుద్ధం ముగిసిన తర్వాత గాజాలో ఎవరి పాలన ఉండాలనే అంశంపై కూడా ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది.


అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు హమాస్‌ రహస్య లేఖ పంపినట్లు తెలుస్తోంది. తమ దగ్గర బందీలుగా ఉన్న 24 మంది విడుదలతో పాటు 60 రోజుల కాల్పుల విరమణకు సంబంధించి అందులో ప్రస్థావించినట్లు సమాచారం. దోహాలో ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసిన తర్వాత గాజా శాంతి చర్చలు నిలిచిపోగా.. ఈ పరిస్థితుల్లో ట్రంప్‌తో హమాస్ సంప్రదింపులకు ప్రయత్నం చేస్తోంది. అయితే ప్రస్తుతం ట్రంప్ బృందం ఈ విషయంపై స్పందించలేదు.

గత 23 నెలలుగా ఇజ్రాయెల్‌ ఆర్మీ యథేచ్ఛగా సాగిస్తున్న దాడుల్లో చనిపోయిన వారి సంఖ్య 65,100 దాటిపోయింది. భవనాలను నేలమట్టం చేస్తుండటంతో గాజా ప్రాంతంలో ఉన్న కనీసం 90 శాతం మంది పాలస్తీనియన్లకు నిలువ నీడ కూడా లేకుండాపోయింది. దాదాపు సగం మంది, అంటే సుమారు 4.50 లక్షల మంది గాజా వీడి వెళ్లిపోయినట్లు సమాచారం. గాజా ప్రాంతంలో పోషకాహార లోపంతో బాధపడుతున్న వేలాది మంది చిన్నారుల కోసం తీసుకువచ్చిన అత్యవసర ఆహార పదార్థాలున్న నాలుగు ట్రక్కులను సాయుధులు వచ్చి తరలించుకుపోయారంటూ యునిసెఫ్‌ పేర్కొంది.


మరోవైపు గాజాలో పోరు ఉధృతంగా సాగుతోంది. గాజా నగరంపై గట్టి పట్టున్న హమాస్‌తో అమీతుమీ తేల్చుకుంటామంటూ భారీగా సైనికులను రంగంలోకి దించిన ఇజ్రాయెల్‌ ఆర్మీ.. దాడుల తీవ్రతను కొనసాగిస్తోంది. ఇజ్రాయెల్‌ ట్యాంకులు ఉత్తర, దక్షిణ గాజాలోకి చొచ్చుకొస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. చాలాచోట్ల ఇళ్లను ఇవి ధ్వంసం చేస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు జోర్డాన్‌ తమ ఫీల్డ్‌ హస్పిటల్‌ను గాజా నుంచి ఖాన్‌ యూనిస్‌కు తరలిస్తున్నట్లు పేర్కొంది. ఇప్పటికే ఇజ్రాయెల్‌ దాడుల్లో పరికరాలు దెబ్బతిన్నట్లు పేర్కొంది.

ఇదిలా ఉంటే ఇజ్రాయెల్‌తో కుమ్మక్కు అయ్యారని ఆరోపిస్తూ ముగ్గురు పాలస్తీనా వాసులను హమాస్‌ దళాలు బహిరంగంగా కాల్చి చంపాయి. మాస్కులు ధరించిన హమాస్‌ సభ్యులు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఇది షిఫా హాస్పిటల్‌ బయట చోటుచేసుకొంది. ముందు ఆ ముగ్గురు పౌరుల కళ్లకు గంతలు కట్టి.. ప్రజలు చూస్తుండగానే వారిపై పలుమార్లు కాల్పులు జరిపారు. ఇజ్రాయెల్‌తో కుమ్మక్కు అయిన వారికి మృత్యుదండన విధిస్తామని బెదిరించారు.

Tags:    

Similar News