ట్రంప్‌ శాంతి చర్చలకు పుతిన్‌ బ్రేక్‌ – ఉక్రెయిన్‌ యుద్ధం ముగింపు ఇంకా దూరమే

ఉక్రెయిన్ మీద రష్యా సాగిస్తున్న యుద్ధం ఎప్పుడు ముగుస్తుంది.? ఈ దిశగా అమెరికా అధ్యక్షుడు చేస్తున్న ప్రయత్నాలు ఎందుకు ఫలించడం లేదు? ఇప్పుడు ప్రపంచం ముందున్న ప్రశ్నలివే..

Update: 2025-12-05 07:45 GMT

ట్రంప్‌ శాంతి చర్చలకు పుతిన్‌ బ్రేక్‌ – ఉక్రెయిన్‌ యుద్ధం ముగింపు ఇంకా దూరమే

ఉక్రెయిన్ మీద రష్యా సాగిస్తున్న యుద్ధం ఎప్పుడు ముగుస్తుంది.? ఈ దిశగా అమెరికా అధ్యక్షుడు చేస్తున్న ప్రయత్నాలు ఎందుకు ఫలించడం లేదు? ఇప్పుడు ప్రపంచం ముందున్న ప్రశ్నలివే.. తాజాగా డొనాల్డ్ ట్రంప్ ప్రతినిధులు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో జరిపిన చర్చల్లో కూడా ఎలాంటి పురోగతి కనిపించలేదు. ట్రంప్ ప్రతిపాదనలు రష్యాకు రుచించలేదు. తాము ఆక్రమించిన భూభాగాలను వదులుకోడానికి ఏమాత్రం సిద్ధంగా లేదు. అయితే అమెరికా అధ్యక్షుడు మాత్రం పుతిన్‌తో జరుపుతున్న చర్చలపై అశాభావం వ్యక్తం చేశారు. ఓవైపు చర్చలు జరుగుతుంటే మరోవైపు ఇరు దేశాల మధ్య దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.


సుదీర్ఘంగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు. అటు రష్యా, ఇటు ఉక్రెయిన్ మెట్టుదిగడం లేదు. ఫలితంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రక్రియ ఎక్కడి గొంగలి అక్కడే అన్నట్లు నిలిచిపోయింది. ఈ ప్రతిష్టంభనకు తెర దించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రత్యేక రాయబారి స్టీవ్‌ విట్కాఫ్, అల్లుడు జేర్డ్‌ కుష్నర్‌.. రష్యా అధ్యక్షుడితో మాస్కోలో జరిపిన చర్చలు అంతగా ఫలితాన్నివ్వలేదు. యుద్ధ విరమణ కోసం ప్రతిపాదిత శాంతి ప్రణాళికపై ఆయనతో ఐదు గంటల పాటు సమాలోచనలు జరిపారు. తాజా చర్చల పూర్తి వివరాలను బయట పెట్టేందుకు అమెరికాగానీ, రష్యాగానీ ముందుకు రాలేదు. ప్రతిపాదిత ప్రణాళికలోని కొన్ని అంశాలను పుతిన్‌ విమర్శించినట్లు తెలుస్తోంది. అయితే చర్చలు ఫలప్రదంగా సాగాయని అంటూనే.. చేయాల్సిన పని ఇంకా చాలా ఉందని రష్యన్ అధికారులు చెబుతున్నారు..


ఉక్రెయిన్ లో తాము ఆక్రమించిన భూభాగాలపై రాజీ పడలేదని రష్యాచెప్పింది. కానీ ఇంకా పరిష్కారాల కోసం ఆలోచిస్తున్నామని తెలిపింది. ప్రణాళికలో మార్పులు చేశాక కూడా అందులో తమకు అభ్యంతరాలు ఉన్నాయని రష్యా చెబుతోంది. కొన్ని అంగీకరించే విషయాలు ఉన్నాయని..కానీ భూభాగం విషయంలో రాజీ లేదని పుతిన్ చెప్పారు.ఈ చర్చల్లో ఉక్రెయిన్​ నాటోలో చేరాలనే చేస్తున్న ప్రయత్నం కీలక ప్రశ్నగా ఉందని పుతిన్‌ సీనియర్‌ సలహాదారు యూరీ ఉషకోవ్‌ తెలిపారు. చర్చల్లో పెద్ద పురోగతి సాధించలేకపోయినా కీవ్​ నాటో సభ్యత్వం ప్రధానంగా చర్చించామని పేర్కొన్నారు. 'మా పరిగణనలను, కీలన ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకోవడానికి అమెరికా భాగస్వాములు సిద్ధంగా ఉన్నారని వారు ధృవీకరించారు.అయితే ఈ సమావేశం, యుద్ధం ప్రారంభమైన తర్వాత అమెరికా, రష్యా మధ్య జరిగిన అత్యంత విస్తృత చర్చలలో ఒకటి. రెండు పక్షాలు శాంతి కోసం పలు మార్గాలను పరిశీలించినప్పటికీ, ప్రధాన విభేదాలు అలాగే ఉన్నాయి.' అని ఉషకోవ్ తెలిపారు.


ట్రంప్ ప్రతినిధులతో ఈ సమావేశానికి ముందు రష్యా అధ్యక్షుడు పుతిన్ యూరోప్ దేశాలకు వార్నింగ్ ఇచ్చారు. ఆ దేశాలు యుద్ధం కోరుకుంటే అందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఉక్రెయిన్‌తో వివాదంపై ఒక అంగీకారం కుదరకుండా యూరోప్ నేతలు అడ్డు తగులుతున్నారని ఆరోపించారు. వారు యుద్ధం వైపు ఉన్నారని, వారి వద్ద ఎలాంటి శాంతి ప్రణాళిక లేదని విమర్శించారు. నల్ల సముద్రంలో రష్యా ‘షాడో ఫ్లీట్’ ట్యాంకర్లపై తరచూ దాడులు జరుగుతుండటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ దాడులకు కారణమైన ఉక్రెయిన్‌కు గట్టి హెచ్చరికలు చేశారు. ‘‘దీనికి పరిష్కారం సముద్రంతో ఉక్రెయిన్‌కున్న సంబంధాలను తెంచేయడమే..! అప్పుడే ఈ పైరసీ దాడులు ఆగుతాయి’’ అని పుతిన్‌ స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌ నౌకలపై దాడులను మరింత పెంచుతామని రష్యా అధ్యక్షుడు హెచ్చరించారు.ఆ దేశానికి సాయం చేసే దేశాల ట్యాంకర్ల పైనా చర్యలు తీసుకుంటామన్నారు. 


మూడేళ్లకు పైగా సాగుతున్న రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధానికి శాశ్వత పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో ట్రంప్‌ 28 సూత్రాల ప్రణాళికను రూపొందించడం తెలిసిందే. వీటిలో రష్యాకు అనుకూలంగా ఉన్న అంసాలు ఎక్కువగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే శాంతి ప్రణాళికపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో అమెరికా బృందం జరిపిన చర్చలు బాగా జరిగాయని అంటున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఆ చర్చలు తర్వాత పుతిన్ యుద్ధం ముగించాలని కోరుకుంటున్నారనే ఒక భావన కలిగిందని తెలిపారు. 'జేర్డ్‌ కుష్నర్‌, స్టీవ్ విట్కాఫ్‌తో కలిసి పుతిన్ చాలా మంచి సమావేశం నిర్వహించారు. ఆ సమావేశం ఫలితాలు ఏ విధంగా ఉంటుందో నేను చెప్పలేను. ఏమి వస్తుందో చెప్పలేను, ఎందుకంటే ఇది ఇద్దరూ కలిసి చేయాల్సిన ప్రక్రియ. అయితే పుతిన్ మాత్రం యుద్దాన్ని ముగించాలని కోరుకుంటున్నారు. ఇదే వారి అభిప్రాయం'అని ట్రంప్ మీడియాతో తెలిపారు.


ఇదిలా ఉంటే యుద్ధం ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రతిపాదించిన శాంతి ప్రణాళికపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆశాభావంతో ఉన్నారు. ప్రతిపాదనలు మొదట రష్యాకు అనుకూలంగా ఉన్నా..సవరణలు చేసిన తర్వాత మెరుగ్గా ఉందని సానుకూలంగా స్పందించారు. దాదాపు నాలుగేళ్లగా కొనసాగుతున్న యుద్ధాన్ని ఎలా ముగించాలనే దానిపై చర్చలు జరుగుతున్నారు. ఈ చర్చల్లో ఉక్రెయిన్‌ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడంతో పాటు బలమైన భద్రతా హామీలను పొందడం తమ ప్రాధాన్యత అని పేర్కొన్నారు. చర్చలు నిర్మాణాత్మకంగా జరుగుతున్నాయని తెలిపారు. అయితే, ఇంకా పరిష్కారం కావాల్సిన కొన్ని కఠినమైన సమస్యలు ఉన్నాయని వివరించారు. అంతకు ముందు అమెరికా ప్రతిపాదించిన ప్రణాళికలో ఎక్కువ శాతం రష్యాకు అనుకూలంగా ఉన్నాయంటూ ఉక్రెయిన్​ ఆందోళన వ్యక్తం చేసింది. ఆ దేశానికి నాటో దేశాలు కూడా మద్దతుగా నిలిచాయి. దీంతో ఆ ప్రణాళికలో కొన్ని మార్పులను సూచించాయి.


మరోవైపు ర‌ష్యాలోని డ్రోన్ త‌యారీ కేంద్రంపై ఉక్రెయిన్ బాంబు దాడి చేసింది. సుఖోయ్‌-27 ఫైట‌ర్ జెట్‌.. సుమారు 226 కిలోల బాంబును జార‌విడిచి వోవ్‌చాన్స్క్ లో ఉన్న డ్రోన్ కంట్రోల్ అండ్ క‌మ్యూనికేష‌న్ హ‌బ్‌ను పేల్చివేసింది. డ్రోన్ సెంట‌ర్‌లో ఉన్న ఓ బిల్డింగ్‌పై సుఖోయ్ యుద్ధ విమానం బాంబును వేసింది. టార్గెట్‌ను చేరుకోగానే.. చాలా శ‌క్తివంత‌మైన పేలుడు జ‌రిగింది. దీంతో ద‌ట్టమైన పొగ వ్యాపించింది. ఇందుకోసం కోసం 500 పౌండ్లు ఉన్న జీబీయూ-62 బాంబును వాడారు. జేడీఏఎం-ఈఆర్ కిట్‌ను కూడా వినియోగించారు. శాటిలైట్‌, ఇంట‌ర్నల్ నావిగేష‌న్ ద్వారా ఈ బాంబు టార్గెట్‌ను చేరుకుంటుంది. ఈఆర్ గ్లైడ్ మాడ్యూల్‌.. ఆ బాంబును టార్గెట్ వ‌ర‌కు తీసుకెళ్లే ప్రయ‌త్నం చేస్తుంది. అంటే యుద్ధ విమానం టార్గెట్ స‌మీపం వ‌ర‌కు వెళ్లవ‌ల‌సిన అవ‌స‌రం లేకుండానే బాంబును పేల్చవ‌చ్చు. ఆ దాడికి చెందిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. 

Tags:    

Similar News