Sri Lanka: రాజీనామా దిశగా శ్రీలంక అధ్యక్షుడు

Sri Lanka: ప్రజలు, ప్రతిపక్షాల నుంచి పెరుగుతున్న ఒత్తిడి

Update: 2022-04-11 11:00 GMT

రాజీనామా దిశగా శ్రీలంక అధ్యక్షుడు

Sri Lanka: శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పార్లమెంట్‌లో సుదీర్ఘంగా చర్చజరిగినా విపక్షాలు మాత్రం అధ్యక్షుడు గొటబాయ రాజీనామా చేయాలని పట్టుబడుతున్నాయి. అవిశ్వాస తీర్మానం దిశగా ప్రధాన ప్రతిపక్షం సమాగి జన బల్వేగయ-ఎస్‌జేబీ పార్టీ అధినేత సాజిత్‌ ప్రేమదాస అడుగులు వేస్తున్నాయి. మరోవైపు ప్రజలు సైతం గో గొటబాయ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. దేశవ్యాప్తంగా నినాదాలు నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రాజీనామా చేసే ప్రశసక్తే లేదని తేల్చి చెప్పిన గొటబాయ ప్రజాగ్రహంతో మెత్తబడినట్టు తెలుస్తోంది. రాజీనామా దిశగా యోచిస్తున్నట్టు అక్కడి మీడియా చెబుతోంది. అధ్యక్ష పదవికి ఇవాళ గొటబాయ రాజపక్సే రాజీనామా చేసే అవకాశం ఉందని స్పష్టమవుతోంది.

శ్రీలంకలో నెలరోజులుగా తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొన్నది. ఆహారం, పెట్రోలు, కరెంటు, ఇతర నిత్యావసరాలు అందక ప్రజలు విలవిలాడుతున్నారు. పరిస్థితిని చక్కదిద్దడంలో అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే విఫలమయ్యారంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారం రోజులుగా శ్రీలంక రాజధాని కోలంబోలో గొటబాయ ఇంటి ఎదుట ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. కొలంబోతో పాటు దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. దేశంలో సంక్షోభ పరిస్థితిని చక్కదిద్దేందుకు అన్ని పార్టీలు కలిసికట్టుగా పని చేయాలని అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే పిలుపునిచ్చారు. ఐక్య పార్టీల అధ్వర్యంలో ప్రభుత్వాన్ని నడుపుదామని సూచించారు. అందుకు నలుగురు మంత్రులను కూడా నియమించారు. అయితే ఆ మంత్రులను నియమించిన ఒక్కరోజులోనే ఆర్థికశాఖ మంత్రి పదవికి అలీ సబ్రీ రాజీనామా చేయడం గమనార్హం.

అధ్యక్షుడు గొటబాయ ఆఫర్‌ను ప్రతిపక్షాలు తిరస్కరించాయి. గొటబాయ రాజీనామా చేయాలంటూ పట్టుబడుతున్నాయి. అయితే అధ్యక్ష పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదంటూ గొటబాయ భీష్మించారు. తాజాగా జరిగిన పార్లమెంట్‌ సమావేశాల్లోనూ ఆర్థిక సంక్షోభంపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. అధ్యక్షుడు రాజీనామా చేయాలని ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఎస్‌జేబీ అధినేత సాజిత్‌ ప్రేమదాస డిమాండ్‌ చేశారు. ఆర్థిక సంక్షోభాన్ని నిరవారించడంలో గొటబాయ విఫలమయ్యారని తాము అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతామని ప్రేమదాస స్పష్టం చేశారు. మరోవైపు ప్రజలు కూడా రెడ్లెక్కి గో  గొటబాయా అంటూ నినాదాలు చేస్తున్నారు. అన్ని పక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండడంతో అధ్యక్షుడు గొటబాయ మెత్తబడుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు మిత్రపక్షం శ్రీలంక ఫ్రీడం పార్టీ-ఎస్‌ఎల్‌ఎఫ్‌ఫీ నుంచి కూడా ఒత్తిడి పెరిగింది.

ప్రధానంగా దేశ అధ్యక్షుడికి అపరిమితమైన అధికారాలను కట్టబెడుతూ 20వ రాజ్యాంగ సవరణను మార్చాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. సర్వాధికారాలు ఉండడంతోనే రాజపక్సే కుటుంబం కీలక పదవులను చేపట్టి దేశాన్ని భ్రష్టుపట్టించినట్టు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో అధ్యక్షుడి అధికారాలను పరిమితం చేయాలని మిత్రపక్షం ఎస్‌ఎల్‌ఎఫ్‌ఫీ అధినేత మైత్రిపాల శిరిసేన నిన్న జరిగిన మిత్రపక్ష పార్టీల సమావేశంలో కోరారు. దేశమంతటా రాజపక్సే కుటుంబం దిగిపోవాలని కోరుకుంటున్నట్టు శిరిసేన తెలిపారు. ప్రజలు వెంటనే ఉపశమనం కావాలని కోరుకుంటున్నారని సిరిసేన తెలిపారు., వీటికి తక్షణమే పరిష్కార మార్గాలు కనిపెడితే తప్ప ప్రజలు ఊరుకునేలా లేరని తెలిపారు. ఇక అన్ని వర్గాల నుంచి ఒత్తిడి పెరగడంతో పదవికి రాజీనామా చేసే దిశగా రాజపక్సే యోచిస్తున్నట్టు అక్కడి మీడియా చెబుతోంది. ఇవాళ రాజీనామా చేసే అవకాశం ఉందని మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. 

Tags:    

Similar News