Texas Floods: అమెరికాలో వరదలు..70 మందికి పైగా మృతి..27మంది బాలికలు గల్లంతు.. వీడియోలు వైరల్
Texas Floods: అమెరికాలోని టెక్సస్‌ను వరదలు ముంచెత్తాయి. చరిత్రలో ఎప్పుడూ లేనంతగా నదులు ఉంపొంగి ఊళ్లను ముంచేసాయి.
Texas Floods: అమెరికాలో వరదలు..70 మందికి పైగా మృతి..27మంది బాలికలు గల్లంతు.. వీడియోలు వైరల్
Texas Floods: అమెరికాలోని టెక్సస్‌ను వరదలు ముంచెత్తాయి. చరిత్రలో ఎప్పుడూ లేనంతగా నదులు ఉంపొంగి ఊళ్లను ముంచేసాయి. ఇందులో 70 మందికి పైగా చనిపోగా..హాస్టల్‌లో ఉన్న 27మంది బాలికలు గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు.
టెక్సస్‌లో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నదులన్నీ పొంగి పొర్లుతున్నాయి. చరిత్రలో ఇప్పటివరకు ఎప్పుడూ లేనంత వర్షపాతం నమోదవగా ఒకేసారి నదుల నీటిమట్టం పెరిగిపోయింది. శాన్ ఆంటోనియో, కెర్ విల్లే, శాన్ ఏంజెలో ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. గ్యాడాలూపే నది కేవలం 45 నిమిషాల్లో నీటిమట్టం 8 మీటర్లు పెరిగిపోవడంతో చుట్టుపక్కల ఊళ్లన్నీ ఒక్కసారిగా మునిగిపోయాయి.
కెర్ కౌంటీలోని గ్యాడెలూప్ నది అకస్మాత్తుగా పొంగి పొర్లడంతో వేసవి శిక్షణా శిబిరంలో ఉన్న 27మంది బాలికలు గల్లంతయ్యారు. వారికోసం అధికారులు గత 36 గంటల నుంచి గాలిస్తున్నా ఎటువంటి సమాచారం దొరకలేదు. అయితే ఈ క్యాంప్‌లో ఉన్న ఒక ఎనిమిదేళ్ల బాలిక, క్యాంప్ డైరెక్టర్ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
టెక్సస్ సంభవించిన వరదలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఒక్కసారి ఊళ్లను వరదలు ముంచెత్తడం, ఆ వరదల్లో ఇళ్లకు ఇళ్లే కొట్టుకుపోవడం, కార్లు, చెట్లు కూడా కొట్టుకుపోవడం..ఇవన్నీ కూడా అందరినీ కలిచివేస్తున్నాయి. కొన్ని చోట్ల ఇళ్లు కూలిపోవడంతో శిథిలాల కింద ప్రజలు ఉండిపోయారు. వీరిని రెస్క్యూ సిబ్బంది రక్షించారు. వరదలు ఇళ్లల్లోకి చేరడంతో ఎంతోమంది ఇళ్లపైకి ఎక్కి రక్షించమని వేడుకుంటున్నారు.
12 డ్రోన్లు, 14 హెలికాఫ్టర్లు, పడవల ద్వారా 9 రెస్క్యూ టీమ్‌లు ఎక్కడిక్కడ ప్రజలను రక్షించి, హెలికాఫ్టర్ల ద్వారా తరలిస్తున్నారు. వరదల్లో చిక్కుకున్న 237మందిని సిబ్బంది రక్షించారు. అయితే ముందస్తు చర్యలు తీసుకుంటే ఇంత ప్రాణ, ఆస్తినష్టం జరిగేది కాదని ప్రజలు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.