విచిత్ర ప్రకటనలతో ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్న ట్రంప్

Update: 2020-04-25 05:59 GMT

అమెరికాలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న వేళ ఆదేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విచిత్ర ప్రకటనలతో అందరినీ ఆందోళన పరుస్తున్నారు. వైరస్‌కు ఔషధాన్ని కనుగొంటున్నామంటూ ఇప్పటికే ప్రకటించిన ట్రంప్‌ తాజాగా మరో విచిత్రమైన ప్రకటన చేశారు. క్లీనింగ్‌ ఏజెంట్లను కరోనా రోగుల శరీరంలోకి ఇంజక్ట్‌ చేయాలని ఉచిత సలహాలు ఇచ్చారు. డిస్ ఇన్ఫెక్షన్ మందు మనిషి శరీరంలోకి కూడా పంపించి ఎందుకు వైరస్ ను చంపెయ్యకూడదని ట్రంప్‌కు తట్టింది. ఈ దిశగా పరిశోధనలు చెయ్యొచ్చు కదా అని వైద్యులను, శాస్త్రవేత్తలను అడిగారు ట్రంప్. ట్రంప్ చెప్పిన ఐడియా విన్న అమెరికన్ శాస్త్రవేత్తలు షాక్ అయ్యారు. దయచేసి ప్రజలెవ్వరూ కూడా ట్రంప్ చెప్పిన ఈ ఐడియాను ఫాలో కావొద్దని, ప్రాణాలు పోతాయని హెచ్చరించారు. అసలే కరోనాను ఎలా వదలగొట్టాలా అని వైద్యులు, శాస్త్రవేత్తలు నానా తంటాలు పడుతుంటే, ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేసి ప్రజల్ని మరింత గందరగోళానికి గురిచేస్తున్నారు.

కరోనా రోగులను ఎక్కువ వేడి ఉన్న చోటు ఉంచాలని, వేడి ఎక్కువగా ఉండే చోట కరోనా మనుగడ సాధించలేదని ట్రంప్ అన్నారు. రోగులను ఎండకు ఉంచితే శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి వైరస్‌ సోకకుండా ఉంటుందని చెప్పుకొచ్చారు. అలాగే శక్తివంతమైన సన్‌లైట్‌, అల్ట్రావయొలెట్‌ రేస్‌లతో రోగి శరీరాన్ని వేడి చేయాలని సలహా ఇచ్చారు. సూర్యరశ్మి కాంతితో వైరస్‌ను నిరోధించవచ్చిన ట్రంప్‌ పేర్కొన్నారు. ఈ మేరకు వైట్‌ హౌస్‌లో జరిగిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ట్రంప్‌ ఈ ప్రకటన చేశారు. అంతా చెప్పిన తరువాత తానేమీ వైద్యుడికి కాదని, ఎవరికి వారు వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని ప్రసంగం ముగించారు.

Tags:    

Similar News