Sri Lanka: లంక అధ్యక్ష నివాసంలో సరదాలు.. బెడ్లు, సోఫాలపై సేదదీరుతున్న ప్రజలు

Sri Lanka Crisis: అధ్యక్షుడు కూర్చునే కుర్చీల వద్ద సెల్ఫీలు

Update: 2022-07-11 08:33 GMT

Sri Lanka Crisis: లంక అధ్యక్ష నివాసంలో సరదాలు.. బెడ్లు, సోఫాలపై సేదదీరుతున్న ప్రజలు

Sri Lanka Crisis: రెండ్రోజుల క్రితం శ్రీలంక అధ్యక్ష నివాసాన్ని ఆందోళనకారులు ముట్టడించారు. భవనంలోకి వెళ్లిన తరువాత అణువణువును గాలిస్తున్నారు. అక్కడి వసతులను చూసి నిరసనకారులు ముక్కున వేలేసుకున్నారు. అద్భుతమైన స్విమ్మింగ్‌ పూల్‌, విశాలమైన బెడ్‌రూమ్‌లు. ఖరీదైన పరుపులు భారీ జిమ్‌, రహస్య బంకరు, సంగీత వాయిద్యాలు, అత్యంత ఖరీదైన కార్లు.. ఇలా ఒకటేమిటి.. అక్కడున్న ఎన్నో వసతులను చూసి.. అధ్యక్షుడికి ఇన్ని సౌకర్యాలు ఉన్నాయా? అంటూ ఆశ్చర్యపోతున్నారు. అధ్యక్షుడు ఎప్పుడూ ప్రసంగించే కుర్చీల్లో కూర్చుంటూ.. నిరసనకారులు సెల్పీలు దిగుతున్నారు. స్విమ్మింగ్‌ పూల్‌లో సరదాగా ఈత కొడుతున్నారు. జిమ్‌లో వివిధ రకాల పరికరాలను పరిశీలిస్తున్నారు. కొందరు ట్రెడ్‌ మిల్లులపై పరుగులు పెట్టారు. అధ్యక్ష భనవంలో కోట్లాది రూపాయల నోట్ల కట్టలు లభించాయి. వాటిని నిరసనకారులు లెక్కపెట్టారు. అక్కడి పరిస్థితులను చూస్తుంటే ఆందోళన చేయడానికి వచ్చినట్టు లేదు సరదాగా ఎంజాయ్‌ చేయడానికి వచ్చామన్న హంగామా చేస్తున్నారు.

అధ్యక్ష నివాసంలోని పలువురు సెల్పీలు తీసుకోవడం కనిపించింది. అక్కడి దృశ్యాలను తమ సెల్‌ఫోన్లలో బంధించారు. మరికొందరు వెంటనే సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఇప్పుడు ఆ దృశ్యాలు తెగ వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లు కూడా అక్కడి వసతులను చూసి.. ఔరా.. అంటూ ఆశ్చర్యపోతున్నారు. అధ్యక్ష నివాసాన్ని ఖాళీ చేయాలని నిరసనకారులను ఆర్మీ చీఫ్‌ శివేంద్ర సిల్వా కోరారు. అయితే అధ్యక్షుడు గొటబాయ అధికారికంగా రాజీనామా చేసేవరకు ప్రెసిడెంట్‌ నివాసాన్ని ఖాళీ చేసేది లేదని భీష్మించారు. అధ్యక్షుడిని నమ్మే.. తాము దౌర్బాగ్య పరిస్థితుల్లో చిక్కుకుపోయామని మండిపడుతున్నారు. అక్కడే వంటా వార్పు చేపడుతున్నారు. అధ్యక్ష పదవికి గొటబాయ 13న రాజీనామా చేయనున్నట్టు శ్రీలంక పార్లమెంట్‌ స్పీకర్‌ మహింద యాప అభయ్‌వర్ధనే ప్రకటించారు. అప్పటివరకు ఆందోళనకారులు అధ్యక్షుడి అధికార నివాసంలోనే ఉండేందుకే పట్టుబడుతున్నారు. 

Tags:    

Similar News