మళ్లీ శ్రీలంకలో నిరసనలు.. చమురు కొరతతో రెండ్రోజుల పాటు ప్రభుత్వ కార్యాలయాలు, స్కూల్లు మూసివేత

Sri Lanka Fuel Crisis: పడిపోయిన చమురు నిల్వలు.. పెట్రోలు బంకుల వద్ద భారీ క్యూలు

Update: 2022-06-18 12:01 GMT

 మళ్లీ శ్రీలంకలో నిరసనలు.. చమురు కొరతతో రెండ్రోజుల పాటు ప్రభుత్వ కార్యాలయాలు, స్కూల్లు మూసివేత

Sri Lanka Fuel Crisis: సంక్షోభ శ్రీలంకలో పరిస్థితులు చక్కబడడం లేదు. రోజు రోజుకు మరింత అధ్వానంగా మారుతున్నాయి. చమురు నిల్వలు పూర్తవడంతో మళ్లీ పరిస్థితి మొదటికొచ్చింది. ప్రజలు మళ్లీ ఆందోళన బాట పట్టారు. మరోవైపు పెట్రోలు కొరత కారణంగా.. ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లను రెండు వారాల పాటు మూసివేస్తున్నట్టు ప్రధాని విక్రమసింఘే ప్రకటించారు. దేశంలో ఎక్కడ చూసినా.. ప్రజలు పెట్రోలు బంకులు, సరుకుల కోసం దుకాణాల వద్ద భారీగా క్యూలు కడుతున్నారు. మరోవైపు ఆర్థిక సంస్యలతో కొట్టుమిట్టాడుతున్న ద్వీప దేశంలో ఐక్యరాజ్య సమితి అత్యవసర సేవలను ప్రారంభించింది.

శ్రీలంకలో ఫిబ్రవరి నుంచి పరిస్థితులు విషమించాయి. విదేశీ మారక నిధులు కొరత నెలకొంది. దీంతో దేశంలో ఇంధనం, నిత్యావసరాల దిగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగింది. నిత్యావసరాల ధరలు దూసుకెళ్లాయి. దీంతో ప్రజలు ఆందోళన బాట పట్టారు. దేశంలో ఆర్థిక సంక్షోభం నెలకొనడానికి రాజపక్సే కుటుంబమే కారణమంటూ ప్రజలు మండిపడ్డారు. రాజపక్సే కుటుంబం ఇంటికి వెళ్లిపోవాలంటూ పట్టుబట్టారు. దేశంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ప్రధాని పదవికి మహింద రాజపక్సే ఇప్పటికే రాజీనామా చేశారు. అధ్యక్ష పదవిలో గొటబాయ మాత్రం కొనసాగుతున్నారు. కొత్త ప్రధానిగా రాణిల్‌ విక్రమసింఘే బాధ్యతలు చేపట్టారు. అయినప్పటికీ పరిస్థితుల్లో ఏ మాత్రం మార్పు రాలేదు.

ఇటీవల భారత్‌ సాయంతో శ్రీలంక ఇంధనం దిగుమతి చేసుకుంది. అయితే వచ్చిన పెట్రోలు, డీజిల్‌ కోసం జనం ఎగబడ్డారు. ఇప్పుడు ఆ పెట్రోలు కాస్తా నిండుకుంది. దీంతో మళ్లీ పెట్రోలు బంకుల వద్ద ప్రజల నిరసనలకు దిగుతున్నారు. మరోవైపు చమురు కొరత కారణంగా రెండు వారాల పాటు ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లను మూసివేస్తున్నట్టు ప్రధాని రాణిల్‌ విక్రమసింఘే ప్రకటించారు. ఈనెల 20 నుంచి జూలై మొదటి వారం వరకు ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు మూతపడనున్నాయి. అధికారులు మాత్రం ఆన్‌లైన్‌లో పని చేయాలంటూ ఆదేశాల్లో ప్రభుత్వం కోరింది. మరోవైపు వేలాది మంది ప్రజలు ఆహారం అందక ఆందోళన చెందుతున్నారు. తాజాగా అందుతున్న నివేదికల ప్రకారం ప్రతి ఐదుగురిలో నలుగురు ఆకలితో మాడుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో శ్రీలంకలో అత్యవస సేవలు ప్రారంభమయ్యాయి. సంక్షోభ సమయంలో అక్కడి ప్రభుత్వానికి, ప్రజలకు ఐక్యరాజ్యసమితి సాయం అందిస్తుంది.

తాజా చమురు కొరతపై శ్రీలంక విద్యుత్‌ శాఖ మంత్రి కంచన విజేశేఖర స్పందించారు. విదేశీ నిధుల కొరతతో చమురు దిగుమతులకు ఇబ్బందులు తలెత్తినట్టు తెలిపారు. ఉన్న నిల్వలను 21 వరకు వచ్చేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. మరో మూడ్రోజుల్లో పెట్రోలు సిప్‌మెంట్‌ వచ్చే అవకాశం ఉందని లంక ఆశిస్తోంది. ఆ తరువాత 8 రోజుల్లో మరో రెండు షిప్‌మెంట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. దేశంలో చమురు కొరత కారణంగా రావాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. వేలాది బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. పెట్రోలు, డీజిల్‌ కొరతతో ఆటోలు కూడా నిలిచిపోయాయి. శ్రీలంక ప్రభుత్వం క్రెడిట్‌ లైన్ల కోసం ప్రయత్నిస్తోంది. 75 కోట్ల డాలర్ల బకాయిలు చమురు సప్లయర్స్‌కు చెల్లించాల్సి ఉంది. తాజాగా చమురు కొతర నేపథ్యంలో దేశవ్యాప్తంగా మూతేయాల్సిన అవసరం లేదని ప్రధాని రాణిల్‌ విక్రమసింఘే తెలిపారు.

తాజాగా భారత్‌ కొలంబోకు మరో డీజిల్‌ షిప్‌మెంట్‌ను పంపింది. ఈ షిప్‌మెంట్‌లో 40వేల మెట్రిక్‌ టన్నుల డీజిల్‌ శ్రీలంకకు చేరుకుంది. ఇదే కాకుండా.. భారత్‌కు చెందిన బ్యాంకుల నుంచి మరో 50 కోట్ల డాలర్ల క్రెడిట్‌ లైన్ కోసం శ్రీలంక ప్రభుత్వం ఎదురుచూస్తోంది. ఆ నిధులనే వచ్చే చమురుకు చెల్లించనున్నట్టు తెలుస్తోంది. భారత్‌ నుంచి 50వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని దిగుమతి చేసుకునేందుకు శ్రీలంక ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో 60 లక్షల డాలర్ల సాయాన్ని ఇచ్చేందుకు అమెరికా సంసిద్ధతను వ్యక్తం చేసింది. ఇతర దేశాల నుంచి సాయాన్ని పొందేందుకు శ్రీలంక ప్రభుత్వం చర్చలు జరుపుతోంది.

లంకలో నెలకొన్న సంక్షోభంతో ప్రజలు దేశం విడిచి వెళ్లేందుకు యత్నిస్తున్నారు. పలువురు విదేశీ వీసాలకు దరఖాస్తు చేసుకుంటున్నారు. దేశంలో ఉండి.. ఆకలితో చచ్చేకంటే.. ఇతర దేశాలకు వెళ్లి.. ప్రాణాలను కాపాడుకోవడమే మేలని శ్రీలంక ప్రజలు భావిస్తున్నారు. 

Tags:    

Similar News