కరోనావైరస్ లక్షణాలు ఉండి దాచి పెడితే ఆరు నెలల జైలు శిక్ష

చైనాలో మొదలైన కరోనా వైరస్ మెల్లిమెల్లిగా ఇతర దేశాలకు కూడా వ్యాపించి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది.

Update: 2020-03-16 12:01 GMT
6 month jail for people hiding COVID-19 symptoms in srilanka

చైనాలో మొదలైన కరోనా వైరస్ మెల్లిమెల్లిగా ఇతర దేశాలకు కూడా వ్యాపించి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. దీనిని త్వరగా అరికట్టాలని ఇప్పటికే ప్రపంచ దేశాలు కంకణం కట్టుకున్నాయి. ఇక కొన్ని దేశాలలో నియమ నిబంధనలు చాలా తీవ్రంగా ఉన్నాయి. అందులో శ్రీలంక ఒకటి.. ఆ దేశంలో ఇప్పటివరకు 18 కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం వారికి కొలంబో సిటీ శివార్లలోని ఇన్ఫెక్షయస్ డిసీస్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.

అయితే కరోనా లక్షణాలు ఉండి కూడా ఎవరైనా దాచి పెడితే వారికి ఆరు నెలల జైలు శిక్షను విధిస్తామని అక్కడి సీనియర్ పోలీసు అధికారి ఒకరు సోమవారం మీడియాకి వెల్లడించారు. వైరస్ ప్రభావిత దేశాల నుండి వచ్చిన తరువాత దిగ్బంధం కేంద్రాలలోకి వెళ్ళకుండా తప్పించుకున్న వ్యక్తులు కూడా ఉన్నారని, అలాంటి వ్యక్తుల వలన ఇంకా ప్రమాదం జరిగే ఛాన్స్ ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అలాంటి వారిని వారెంట్ లేకుండానే అరెస్టు చేయడానికి కఠినంగా చర్యలు తీసుకుంటామని సీనియర్ ఇన్‌స్పెక్టర్, డిఐజి అజిత్ రోహనా వెల్లడించారు.

COVID-19 పై సోషల్ మీడియా ద్వారా తప్పుడు పుకార్లు వ్యాప్తి చేసే వారిపై కూడా కఠినంగా చర్యలు అమలు చేయబడుతుందని పోలిస్ శాఖ వెల్లడించింది. ఇక ఇప్పటివరకు సోషల్ మీడియాలో అసత్యపు ప్రచారాలు చేసిన 23 మందిని అరెస్టు చేసినట్టుగా ఆ శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఉన్న ఒక్కో పోలీస్ స్టేషన్ లో 7గురు అధికారులను నియమించామని, వారు క్వారంటైన్ నిబంధనల గురించి ప్రజలకు సమాచారం ఇస్తారని వెల్లడించింది.

ఇక సుమారు 140 దేశాలకు పైగా ఈ కరోనా వైరస్‌ విస్తరించింది. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం లక్షా 30వేల 237 కేసులు నమోదయ్యాయి. అందులో 68వేల 677 మంది చికిత్స తీసుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. ఇంకా 56వేల 804 మంది చికిత్స పొందుతున్నారు. 5వేల 714 మందికి క్రిటికల్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. కొత్తగా వెయ్యి 600 కేసులు నమోదయినట్లు సమాచారం. కరోనాతో మొత్తం ఇప్పటి వరకు 6,526 మంది మృతి చెందినట్లు సమాచారం.

Tags:    

Similar News