Shubhanshu Shukla: భూమిపైకి శుభాంశు శుక్లా..!
అంతరిక్షంలో భారత కీర్తిపతాకను ఎగరేసిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా భూమిపైకి విజయవంతంగా చేరుకున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లో అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన శుభాంశు
Shubhanshu Shukla: భూమిపైకి శుభాంశు శుక్లా..!
వాషింగ్టన్: అంతరిక్షంలో భారత కీర్తిపతాకను ఎగరేసిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా భూమిపైకి విజయవంతంగా చేరుకున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లో అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన శుభాంశు, మరో ముగ్గురు సహచర వ్యోమగాములతో కలిసి సురక్షితంగా భూపైకి వచ్చారు. యాక్సియం-4 మిషన్లో భాగంగా ప్రయాణించిన వీరు అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 2:50 గంటలకు కాలిఫోర్నియా సమీపంలోని సముద్ర జలాల్లో స్పేస్‌ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ ద్వారా ల్యాండ్ అయ్యారు. ప్రస్తుతం వ్యోమగాములు ఏడురోజుల క్వారంటైన్‌కి తరలించబడ్డారు.
ఐఎస్‌ఎస్‌లో ఘన వీడ్కోలు
ఐఎస్‌ఎస్‌లోని ఏడుగురు సహచర వ్యోమగాములు శుభాంశు బృందానికి ఘనంగా వీడ్కోలు పలికారు. పరస్పర కౌగిలింతలు, కరచాలనాలు సాగిన అనంతరం వాతావరణం ఉద్వేగభరితంగా మారింది. 18 రోజులు కలిసి గడిపిన స్మృతులను అందరూ ఆనందంగా గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా శుభాంశు వండిన క్యారెట్, పెసరపప్పు హల్వా రుచి ఎప్పటికీ మర్చిపోలేమని సహచరులు పేర్కొన్నారు.
జూన్ 25న అంతరిక్ష యాత్ర ప్రారంభం
శుభాంశు శుక్లా అంతరిక్ష ప్రయాణం జూన్ 25, 2025న నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్‌ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్ ద్వారా ప్రారంభమైంది. 28 గంటల ప్రయాణం అనంతరం ఐఎస్‌ఎస్ చేరుకున్న బృందం మొత్తం 60 శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించింది. వీటిలో శుభాంశు వ్యక్తిగతంగా 7 కీలక ప్రయోగాలు చేశారు. జీరో గ్రావిటీ పరిస్థితుల్లో మానవ కండరాల నష్టం, అంతరిక్షంలో జీర్ణవ్యవస్థ పని తీరును అధ్యయనం చేశారు. భారత విద్యార్థుల కోసం ఆయన ప్రత్యేకంగా ఒక శిక్షణ వీడియో కూడా రూపొందించారు.
ఫ్లోటింగ్ వాటర్ బబుల్ ప్రయోగం
బృందం మానసిక స్థితిగతులపై కూడా పరీక్షలు జరిపింది. ఆ క్రమంలో రూపొందించిన ఫ్లోటింగ్ వాటర్ బబుల్‌లో గడపడం అద్భుత అనుభవమని శుభాంశు తెలిపారు. "ఐఎస్‌ఎస్‌లో ప్రతి క్షణం ఆస్వాదించాను. ముఖ్యంగా కిటికీ పక్కన కూర్చుని భూమిని చూడటం నా జీవితంలోనే అత్యంత అద్భుతమైన అనుభూతి" అన్నారు. అంతరిక్ష వ్యవసాయం దిశగా కూడా పలు కీలక పరీక్షలు చేపట్టారు.
76 లక్షల మైళ్లు..288 భూ ప్రదక్షిణలు
18 రోజుల అంతరిక్ష ప్రయాణంలో బృందం 76 లక్షల మైళ్లు ప్రయాణించగా, 288 సార్లు భూమి చుట్టూ ప్రదక్షిణలు చేసింది.
భావోద్వేగంతో శుభాంశు
తిరుగు ప్రయాణానికి ముందు శుభాంశు భావోద్వేగంతో సహచరులపై ప్రశంసలు కురిపించారు. 1984లో తొలి భారతీయుడు రాకేశ్ శర్మ చెప్పిన "సారే జహా సే అచ్ఛా" వ్యాఖ్యను స్మరించుకుంటూ, "నేటి భారత్ ధైర్యవంతమైనది, మహత్తరమైన ఆకాంక్షలతో ముందుకు సాగుతోంది. అంతరిక్షం నుంచి చూసినా నా దేశం నిజంగానే ప్రపంచంలో అత్యుత్తమంగా కనిపిస్తుంది" అన్నారు.
"ఫాల్కన్-9లో ఎగిరిన క్షణంలో ఈ యాత్ర ఇంత అద్భుతంగా సాగుతుందని ఊహించలేదు. ఈ ప్రయాణం ఇంత ప్రత్యేకం కావడానికి కారణం నా సహచరులే. ఇలాంటి అద్భుతమైన వృత్తి నిపుణులతో కలిసి పని చేయడం నా జీవితంలో మరచిపోలేని అనుభవం" అని హర్షం వ్యక్తం చేశారు.