Pakistan: మా ప్రధానే పిరికివాడు..భారత్ తో పోరాడటానికి అంత సీన్ లేదు: పాకిస్తాన్ ఎంపీ

Update: 2025-05-10 00:58 GMT

 Pakistan: మా ప్రధానే పిరికివాడు..భారత్ తో పోరాడటానికి అంత సీన్ లేదు: పాకిస్తాన్ ఎంపీ

 Pakistan: పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ ను చేపట్టిన భారత్..పాకిస్తాన్ లోని ఉగ్రస్ధావరాలను నేలమట్టం చేసింది. ఈ పరిణామాలతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ప్రతీకారంగా భారత్ పై దాడులకు విఫలయత్నం చేస్తోంది. పాకిస్తాన్ దాడులను భారత బలగాలు సమర్థంగా తిప్పికొడుతున్నాయి. గగనతల రక్షణ వ్యవస్థలనూ కూడా ధ్వంసం చేశాయి. ఈ పరిణామాలతో పలువురు పాకిస్తాన్ ప్రజలు, రాజకీయ నాయకులు అక్కడి ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పాకిస్తాన్ కు చెందిన తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పార్టీ ఎంపీ షాహిద్ అహ్మద్.. ఆ దేశ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు.

పార్లమెంట్ లో ప్రసంగిస్తూ..తమ ప్రధాని పిరికివాడని..భారత ప్రధాని మోదీ పేరు పలకడానకి కూడా ఆయన భయపడుతున్నాడని అన్నారు. టిప్పు సుల్తాన్ చెప్పిన కోట్స్ ను ప్రస్తావించాడు. సింహాల సైన్యాన్ని నక్క నడిపిస్తే..అవి యుద్ధంలో పోరాడలేక ఓడిపోతాయన్నారు. అదేవిధంగా సరిహద్దుల్లో ఉన్న తమ సైనికులు ధైర్యంగా భారత్ తో పోరాడాలనుకున్నా దేశ ప్రధానికే ధైర్యం లేనప్పుడు వాళ్లు ముందడుగు ఎలా వేయగలరని ప్రశ్నించారు. భారత్ దాడి చేసినప్పటి నుంచి ఆ దేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ ప్రధాని ఒక్క ప్రకటన కూడా చేయలేదని ఎంపీ మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో సరిహద్దుల్లో నిలబడి ఉన్న పాకిస్తాన్ సైనికులకు ప్రభుత్వం ఏం ఆదేశాలు ఇస్తుందంటూ నిలదీశారు.

ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాదంపై పోరు తలపెట్టిన భారత్ ను ఇబ్బంది పెట్టేందుకు పాకిస్తాన్ గురువారం రాత్రి దాడులకు పాల్పడింది. అందులో భాగంగా జమ్మూకశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్స్ ప్రయోగించింది. అయితే భారత సైన్యం వాటిని తిప్పికొట్టింది. ఉదంపూర్, సాంబా, జమ్మూ, అఖ్నూర్, నగ్రోటా, పఠాన్ కోట్ ప్రాంతాల్లో పాక్ దాడి చేసిన 50 డ్రోన్లను భారత సైన్యం కూల్చివేసింది.

Tags:    

Similar News