గొటబయకు మూసుకుంటున్న దారులు.. సింగపూర్‌లో కేవలం 15 రోజుల విజిటే

*శ్రీలంక ప్రజలకు వ్యతిరేకంగా... ఎలాంటి నిర్ణయం తీసుకోమని భారత్‌ స్పష్టం

Update: 2022-07-16 10:13 GMT

గొటబయకు మూసుకుంటున్న దారులు.. సింగపూర్‌లో కేవలం 15 రోజుల విజిటే

Gotabaya Rajapaksa: శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబయ ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయాడు. దేశంలో నుంచి బయటపడితే చాలనుకుని మాల్వీవులకు చెక్కేసి అక్కడికి నుంచి సింగపూర్‌కు చేరుకున్నారు. ఇక తప్పించుకున్నానని భావించిన గొటబయకు సింగపూర్‌ ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. ప్రైవేట్ విజిట్‌తో వచ్చారని 15 రోజులే ఉంటారని సింగపూర్‌ ప్రభుత్వం తెలిపింది. తనకు ఆశ్రయమివ్వాలని భారత్‌ను కోరిన గొటబయకు అక్కడా చుక్కెదరుయ్యింది. దీంతో ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలోనని గొటబయ తలపట్టుకుంటున్నాడు. మరోవైపు సోదరుడు, మాజీ ప్రధాని మహింద రాజపక్స దేశం విడిచి వెళ్లొద్దంటూ.. శ్రీలంక సుప్రీంకోర్టు ఆదేశించింది.

శ్రీలంక ప్రజలను తీవ్ర కష్టాల్లోకి నెట్టిన మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్సకు దారులు మూసుకుపోతున్నాయి. శ్రీలంక నుంచి భార్య, ఇద్దరు బాడీగార్డులతో కలిసి పారిపోయి.. మాల్దీవులకు చేరుకున్న ఆయన ఆ తరువాత సింగపూర్‌కు వెళ్లిపోయారు. ఇక సింగపూర్‌లోనే గొటబయ గడపనున్నట్టు అందరూ భావించారు. అయితే కేవలం 15 రోజుల ప్రైవేటు విజిట్‌ కోసం మాత్రమే గొటబయకు అనుమతి ఇచ్చినట్టు తాజాగా సింగపూర్‌ ప్రభుత్వం తెలిపింది. తాము గొటబయకు ఆశ్రయం కల్పించడం లేదని.. 15 రోజుల ప్రైవేటు విజిట్‌ను కూడా పొడిగించే అవకాశం లేదని స్పష్టం చేసింది. 15 రోజుల తరువాత పరిస్థితి ఏమిటన్నది గొటబయ నిర్ణయంపై తమకు తెలియని సింగపూర్‌ ప్రభుత్వం చెప్పింది.

15 రోజుల్లోగా సింగపూర్‌ను గొటబాయ వదిలి వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆశ్రయం కల్పించాలని గొటబయ రాజపక్స భారత్‌ను కూడా సంప్రదించినట్టు తెలిసింది. అయితే మాజీ అధ్యక్షుడి విన్నపాన్ని భారత ప్రభుత్వం తిరస్కరించింది. తాము శ్రీలంక ప్రజాభిప్రాయానికే మద్ధతు ఇస్తామని, వారికి వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయం తీసుకోమని భారత్‌ స్పష్టం చేసింది. ఇప్పటికే రాజపక్స సోదరులకు భారత్‌ ఆశ్రయమిస్తుందన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ఇలాంటి తరుణంలో భారత్‌ రిస్క్‌ తీసుకునే అవకాశమే లేదు. మొదటి నుంచి శ్రీలంక ప్రజల బాగు కోసమే తాము ప్రయత్నాలు చేస్తామని భారత్‌ స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో గొటబయకు ఆశ్రయం కల్పించే అవకాశమే లేదు.

జులై 9న దేశవ్యాప్తంగా ప్రజలు రాజధాని కొలంబోకు చేరుకుని.. భారీ ర్యాలీగా అధ్యక్షుడి నివాస భవనాన్ని ముట్టడించారు. విషయం ముందే తెలుసుకున్న గొటబయ రాజపక్స ఇంటి నుంచి పారిపోయారు. వేలాది మంది ప్రజలు అధ్యక్షుడి నివాసాన్ని చుట్టుమట్టి.. గో గొటా అంటూ నినాదాలు చేశారు. అధ్యక్ష పదవికి గొటబయ 13న రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. 11న అర్ధరాత్రి భార్య, ఇద్దరు బాడీగార్డులతో కలిసి.. గొటబయ మాల్దీవ్స్‌కు వెళ్లిపోయారు. అక్కడి నుంచి 13న సింగపూర్‌కు వెళ్లిపోయారు. అయితే గొటబయకు సింగపూర్‌ ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. 15 రోజుల ప్రైవేట్‌ విజిటింగ్‌కు మాత్రమే అనుమతిస్తున్నట్టు తెలిపింది. ఆ తరువాత గొటబయ ఏ దేశానికి వెళ్తారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మాజీ ప్రధాని మహింద రాజపక్సకు శ్రీలంక సుప్రీంకోర్టు షాక్‌ ఇచ్చింది. దేశం విడిచి వెళ్లకుండా నిషేధం విధించింది. మరో సోదరుడు, ఆర్థిక శాఖ మంత్రి బసిల్‌ రాజపక్స విషయంలోనూ కోర్టు ఇదే తీర్పునిచ్చింది. బసిల్ రాజపక్స దేశం విడిచి పారిపోవాలని యత్నించగా.. విమానాశ్రయంలో ప్రజలు అడ్డుకోవడంతో దేశంలోనే ఉండిపోవాల్సి వచ్చింది.

మరోవైపు గొటబయ రాజీనామాను అధికారికంగా ఆమోదించినట్టు శ్రీలంక స్పీకర్‌ మహింద దాప అబెయవర్దెన ప్రకటించారు. తాత్కాలిక అధ్యక్షుడిగా రణిల్‌ విక్రమసింఘే బాధ్యతలు చేపట్టారు. అధ్యక్ష ఎన్నిక ప్రక్రియను ప్రారంభించినట్టు స్పీకర్‌ అబెయవర్దెన ప్రకటించారు. అధ్యక్ష పదవికి తాత్కాలిక అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘే, ప్రతిపక్ష నేత సాజిత్‌ ప్రేమదాసతో పాటు అధికార పార్టీ శ్రీలంక పొడుజన పెరుమున - ఎస్‌ఎల్‌పీపీ నేత డల్లస్‌ అలహప్పెరుమ పోటీ పడుతున్నారు. అయితే ప్రస్తుత లంక సంక్షోభాన్ని పరిష్కరించే నేత అవసరమని విశ్లేషకులు చెబుతున్నారు. అధ్యక్ష అభ్యర్థి ఎవరైనా.. అటు ప్రజలకు నచ్చిన వారై ఉండాలని.. అలాగే పార్లమెంట్‌లోనూ బలనిరూపణ చేసుకోవాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు దేశంలో కొత్త అధ్యక్షుడిని ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది. జులై 19న నామినేషన్లను స్వీకరణ, 20న ఎన్నిక జరగనున్నట్టు పార్లమెంట్‌ స్పీకర్‌ అబెయవర్దెన తెలిపారు.  

Full View


Tags:    

Similar News