Donald Trump: ట్రంప్‌పై కొనసాగుతున్న విమర్శలు

Update: 2020-05-13 07:14 GMT

ట్రంప్‌పై విమర్శల పరంపర కొనసాగుతూనే ఉంది. అమెరికాలో కరోనాను అరికట్టడంలో అధ్యక్షుడు పూర్తిగా విఫలమయ్యాడంటూ ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్థికరాజధాని న్యూయార్క్‌లోని ప్రఖ్యాత టైమ్స్‌ స్క్వేర్‌ దగ్గర ఏర్పాటు చేసిన బిల్ బోర్డ్‌ కలకలం రేపింది. ట్రంప్‌ డెత్‌ క్లాక్‌ పేరుతో ఏర్పాటైన బోర్డులో ఓ సంఖ్యను ప్రదర్శించారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో అధ్యక్షుడు ట్రంప్‌ సరైన సమయంలో స్పందించి చర్యలు తీసుకుంటే ఆపగలిగే మరణాల సంఖ్యను ప్రదర్శించారు. ఇప్పటివరకు సుమారు 48 వేలకు పైగా మరణాలు ఆపే అవకాశం ఉండనుందని బోర్డులో పేర్కొన్నారు. మృతుల సంఖ్య పెరుగుతున్నా కొద్ది. ఆ సంఖ్య కూడా మారుతూ కనిపిస్తోంది.

అమెరికాలో కరోనా కరాళనృత్యం చేస్తున్న సమయంలో అక్కడి ప్రజలతో పాటు రాజకీయనాయకులు ట్రంప్‌ నాయకత్వాన్ని విమర్శిస్తూ వస్తున్నారు. ఇటీవలే అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా ట్రంప్‌పై చేసిన విమర్శలు తీవ్ర దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో న్యూయార్క్‌కు చెందిన సినీ నిర్మాత యూజీన్‌ జారెకి ఏర్పాటు చేసిన బిల్ బోర్డ్ అందరిలో ఆసక్తిని రేపుతోంది. కరోనా వల్ల దేశంలో ఇప్పటికే 83 వేలకు పైగా మరణాలు సంభవించాయి. అయితే ట్రంప్‌ యంత్రాంగం సరైన సమయంలో స్పందించి ఉంటే 48 వేలకు పైగా మరణాలు అరికట్టగలిగేవారమని ప్రస్తుత మరణాల సంఖ్యలో అది 60 శాతానికి పైగా ఉందంటూ యూజిస్‌ విమర్శలు చేశారు. మార్చ్‌ 16 న కాకుండా 9 నుంచే కఠినంగా నిబంధనలు అమలు చేస్తే ఇంతటి ఉపద్రవం జరిగేదే కాదంటూ డెత్ క్లాక్‌లో రాసుకుంటూ వచ్చారు. అంతేకాకుండా ఇంతటి భారీ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు మరింత సమర్థవంతమైన నాయకత్వాన్ని కోరుకుంటున్నామని ఆ నిర్మాత డెత్‌ క్లాక్‌ పై పేర్కొన్నాడు. 

Tags:    

Similar News