నియంతృత్వ నీడలో పాక్: ఆసిమ్ మునీర్ నియామకంతో కలకలం

పాకిస్తాన్‌పై నియంతృత్వ పాలన నీడ పాక్‌ సీడీఎఫ్‌గా ఆసిమ్‌ మునీర్‌ నియామకం ఏకంగా దేశ అధ్యక్షునితో సమాన హోదా సీడీఎఫ్‌ పదవితో విశేష అధికారాలు ఆర్మీని బలోపేతం చేసే దిశగా అడుగులు

Update: 2025-12-06 07:49 GMT

నియంతృత్వ నీడలో పాక్: ఆసిమ్ మునీర్ నియామకంతో కలకలం

పాకిస్తాన్ మళ్లీ సైనిక నియంతృత్వ పాలనలోకి వెళ్లిపోతోందా?.. ఎన్నికైన ప్రభుత్వాలకన్నా సైన్యమే పెత్తంనం చేస్తుందా? అసిమ్ మునీర్ హోదాను పెంచడం దేనికి సంకేతం?. ఏకంగా పదేళ్ల కాలానికి ఆయన్ని చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌‌గా నియమించడం దేనికి సంకేతం? ఈ పదవితో మునీర్ ఏకంగా దేశ అధ్యక్షునితో సమాన హోదాను పొందారు.. ఇదే సమయంలో ప్రధాని షెహ్‌బాజ్‌ షరీఫ్‌ కావాలనే మునీర్ నియామకాన్ని ఆలస్యం చేయడంతో ప్రభుత్వం, సైన్యం మధ్య విభేదాలు కొనసాగుతున్నట్లు వినిపిస్తున్నాయి. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. పాకిస్తాన్‌కు ప్రధాన్యత ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ అమెరికాన్ కాంగ్రెస్ సభ్యులు రాసిన లేఖ కలకల రేపుతోంది.


ఇటీవల పాకిస్తాన్‌లో పరిణామాలు రోజు రోజుకీ కొత్త మలుపు తిరుగుతున్నాయి. ఆ దేశ తొలి రక్షణ బలగాల అధిపతిగా-CDFగా సైనాధ్యక్షుడు ఆసిమ్‌ మునీర్‌ నియమితులయ్యారు. ప్రధాని షెహబాజ్ షరీఫ్ సిఫార్సు మేరకు దేశాధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఆమోద ముద్ర వేశారు. దేశ ఆర్మీ చీఫ్‌గా పనిచేసిన మునీర్‌ పదవీ కాలం నవంబర్ 29తో ముగిసింది. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌ దళాలను ఏకీకృతం చేసేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం 27వ రాజ్యాంగ సవరణ ద్వారా చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ పదవిని సృష్టించింది. జాయింట్ చీఫ్స్‌ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్ పదవిని రద్దు చేసి, ఆ స్థానంలో CDFను తీసుకొచ్చింది. ఇందుకు ఇటీవల జాతీయ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ‘‘ఏదేళ్ల కాలానికి ఏక కాలంలో సైనిక దళాల చీఫ్‌గా వ్యవహరించేందుకు సీడీఎఫ్‌ పదవికి ఆసిమ్‌ మునీర్‌ను నియమించాలని పాక్‌ ప్రధాని సమర్పించిన సిఫార్స్‌ను అధ్యక్షుడు అసిఫ్‌ అలీ జర్దారీ ఆమోదించారు’’ అని అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. 


భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత ఆర్మీని బలోపేతం చేసే దిశగా పాకిస్తాన్‌ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే పాక్‌.. తమ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌ దళాలను ఏకీకృతం చేసేందుకు చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ పదవిని సృష్టించింది. ఆసిమ్ మునీర్ ఈ ఏడాదే అరుదైన ఫీల్డ్‌ మార్షల్‌ హోదాను పొందారు. ఇది అత్యున్నత సైనిక హోదా. పాక్‌ చరిత్రలో ఇంతకుముందు జనరల్‌ అయూబ్‌ ఖాన్‌కు మాత్రమే ఫీల్డ్‌ మార్షల్‌ హోదా లభించింది. ఇప్పుడు సీడీఎఫ్‌గా నియామకంతో పాక్‌లో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా మునీర్‌ నిలవనున్నారు. న్యాయపరమైన విషయాల్లో అధ్యక్షుడితో సమానంగా రక్షణ పొందనున్నారు. దీంతో ఆసిమ్‌ మునీర్‌కు మరిన్ని అధికారులు లభించే అవకాశం ఉంది. ఇప్పుడు మునీర్‌‌ను ప్రాసిక్యూట్‌ చేసే అవకాశం కూడా ఉండదు. ఒకవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్‌లో పర్యటకు వచ్చిన నేపథ్యంలో పాకిస్తాన్ మునీర్‌ను సీడీఎఫ్‌గా నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.


వాస్తవానికి ఆసిమ్ మునీర్‌కు చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ పదవి ఇవ్వడానికి ముందే నిర్ణయం అయిపోయినా నిమామకంలో జాప్యం జరిగింది. మునీర్‌ ఆర్మీ చీఫ్‌గా మునీర్‌ పదవీ కాలం గత నెల 29తో ముగిసింది. అయితే ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ కావాలనే ఈ నియామకాన్ని ఉద్దేశ్యపూర్వకంగానే ఆలస్యం చేశారని ఊహాగానాలు వచ్చాయి. మునీర్‌కు అత్యున్నత హోదా కట్టబెట్టే విషయంలో ప్రభుత్వం, సైన్యం మధ్య విభేదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ను జైల్లో వేధింపులకు గురిచేస్తున్నారన్న వార్తల నేపథ్యంలో పీటీఐ పార్టీ మద్దతుదారులు ఇటీవల దేశవ్యాప్త ఆందోళనలు చేపట్టారు. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇస్లామాబాద్‌, రావల్పిండిల్లో పలు ఆంక్షలు విధించారు. ఆ సమయంలో ప్రధాని షెహబాజ్ విదేశీ పర్యటనకు వెళ్లారు. కీలక సమయంలో ఆయ బెహరైన్, లండన్ పర్యటనకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.


అసిమ్ మునీర్‌ చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ పదవి చేపట్టడం ద్వారా పాకిస్తాన్‌లో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా మారారు. న్యాయపరమైన విషయాల్లో అధ్యక్షుడితో సమానంగా రక్షణ పొందుతారు. ఆయన్ను ప్రాసిక్యూట్‌ చేసే అవకాశం కూడా ఉండదు. పౌర–సైనిక సంబంధాలలో, సైన్యం పాత్రలో గణనీయమైన మార్పులను ప్రవేశపెట్టే లక్ష్యాలతో ఈ పదవిని సృష్టించారని తెలుస్తోంది. దేశంలో ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఇలా అధికారం కేంద్రీకృతం కావడం గతంలో ఎప్పుడూ జరగలేదు. అయితే సీడీఎఫ్ పోస్టు మునీర్‌కు అప్పగింతపై ఎందుకు జాప్యం చేశారనే విషయంపై చర్చ జరుగుతోంది. మునీర్‌ తిరుగుబాటు చేసే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో వైస్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ సహా పలు కీలక పోస్టుల్లో విశ్వాసపాత్రులను నియమించాలని నవాజ్‌ షరీఫ్‌, మరియం నవాజ్‌లు ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.


పాకిస్తాన్ గత చరిత్ర చూస్తే.. ఆ దేశ రాజకీయాల్లో సైన్యం పెత్తనం కొత్తేమీ కాదు. ఆ దేశ రాజకీయాలు, విధానాలను సైన్యమే ప్రభావితం చేస్తుంది. ఎన్నికైన ప్రభుత్వాలు సైన్యం కనుసన్నల్లో కొనసాగించాల్సిందే. గతంలో ఆ దేశాన్ని దాదాపు మూడున్నర దశాబ్దాల పాటు సైనిక నియంతలే పాలించారు. సైన్యం తిరుగుబాటు చేసి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను పడగొట్టి అధికారం హస్తగతం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి.

1958 – 1969 మధ్య జనరల్ అయూబ్ ఖాన్.. 1977 – 1988 మధ్య జనరల్ జియా-ఉల్-హక్.. 1999 – 2008: జనరల్ పర్వేజ్ ముషారఫ్ సైనిక పాలన కొనసాగింది.. ప్రజాస్వామ్య పాలన పునరుద్ధరించబడిన తర్వాత కూడా, సైన్యం రాజకీయాల్లో జోక్యం చేసుకుంటూ, రాజకీయ అస్థిరతకు కారణమవుతుందనే విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం అసిమ్ మునీర్‌కు సీడీఎఫ్ పదవి కట్టబెట్టడం ద్వారా లభించిన కొత్త అధికారాలు నియంతృత్వానికి సంకేతమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


ఆసిమ్ మునీర్‌ 2022 నవంబర్‌లో ఆర్మీ చీఫ్‌ అయ్యారు. . అసీమ్‌ తన అధికారాన్ని పటిష్ఠపరచుకున్న తీరు ఆసక్తికం. ఇప్పటికే పాకిస్తాన్ పౌర ప్రభుత్వం మీద అనధికార పెత్తనం కొనసాగిస్తున్నారు. స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన్ని వైట్‌హౌస్‌కు పిలిచి విందుకు ఇవ్వడం ఇందుకు నిదర్శనం. గత సైనిక పాలకుడు జియా-ఉల్‌ -హక్‌ తర్వాత తిరిగి అంత ప్రాభవాన్ని అనుభవిస్తున్న వ్యక్తి మునీర్‌ కానున్నారని చెబుతున్నారు. ఇంకా చెప్పాలంటే మునీర్ ఎలాంటి సైనిక తిరుగుబాటు మాట లేకుండానే మొత్తం అధికారాన్ని తన గుప్పిట్లోకి తెచ్చు కున్నారు. అసిమ్ మునీర్‌కు భారత్ అంటే ఏమాత్రం గిట్టదు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు ఆయనే కారణమనే విమర్శలున్నాయి.

పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదులు పహల్‌గామ్‌లో పర్యాటకులనే హత్య చేసిన నేపథ్యంలో భారత్‌ ఆ దేశంపై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ పోరులో పాకిస్తాన్ చిత్తు అయినా, తామే గెలిచినట్లు గోబెల్స్ ప్రచారం చేసుకున్న ఘనత మునీర్‌ది. ఇలాంటి ఎత్తుగడతోనే పాకిస్తాన్ ప్రభుత్వం మీద పట్టు సాధించాడు. మునీర్ రూపంలో దేశంలో మళ్లీ సైనిక నియంతృత్వ పాలన వస్తుందని పాక్ ప్రజలు భయపడుతున్నారు


ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ విషయంలో అతి ప్రేమ చూపించడం విమర్శలకు దారి తీసింది. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌‌కు ట్రంప్ పెద్ద పీట వేయడాన్ని అమెరికా కాంగ్రెస్ సభ్యులు తప్పపడుతున్నారు. మునీర్‌ ఇకపై అమెరికాలోకి రాకుండా.. ఆయనపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ.. 44 మంది ఎంపీలు అమెరికా విదేశాంగ మంత్రి మార్కోరూబియోకు లేఖ రాశారు. ఆసిమ్ మునీర్ ఒక నేరగాడని, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌పైనా చర్యలు తీసుకోవాలని అమెరికా ఎంపీలు తమ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖ రాసిన వారిలో డెమోక్రటిక్ సభ్యులు ప్రమీలా జయపాల్, గ్రేగ్ కస్సార్ వంటివారు ఉన్నారు. పాకిస్తాన్‌లో ప్రభుత్వమే సైన్యాన్ని నడుపుతోందని ఆ దేశంలో నియంతృత్వం, హింసా పెరిగాయని ఆరోపించారు. పాకిస్తాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నిర్భందం, ఆయన మృతిపై వచ్చిన వదంతులను ప్రస్థావించారు. 


2024 పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల్లో రిగ్గింగ్ అంశంపై దర్యాప్తు జరపాలని అమెరికా కాంగ్రెస్ సభ్యులు తమ లేఖలో డిమాండ్ చేశారు. ఈ ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చింది కేవలం తోలుబొమ్మ ప్రభుత్వమేనని విమర్శించారు. సైన్యమే డీఫాక్టోగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. వర్జీనియా జర్నలిస్టు అహ్మద్ నూరానీ పాకిస్థాన్ సైన్యంలో అవినీతిపై వరుస కథనాలు రాశారు. ఆ తర్వాత నూరానీ, పాకిస్థాన్‌లో ఉంటున్న అతని ఇద్దరు సోదరులు అపహరణకు గురయ్యారు. ప్రముఖ సంగీత దర్శకుడు సల్మాన్ అహ్మద్ బావమరిది కిడ్నాప్ అయ్యాడు అమెరికా జోక్యం తర్వాతే అతను విడుదలైన విషయాన్ని గుర్తుచేశారు. ఇవన్నీ చూస్తుంటే పాకిస్తాన్ మళ్లీ సైనిక నియంతృత్వ పాలనలోకి వెళ్లుతుందనే అనుమానాలను వ్యక్తం చేశారు. అమెరికా చట్టాల ప్రకారం 44 మంది కాంగ్రెస్ సభ్యుల లేఖను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాల్సి ఉంటుంది. అధ్యక్షుడు ట్రంప్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Tags:    

Similar News