పాకిస్థాన్‌కు పట్టుకున్న మరో భయం... మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హఫీజ్ సయీద్‌కు సెక్యూరిటీ పెంపు
భారత్ విషయంలో హఫీజ్ సయీద్ రక్షణ గురించి పాకిస్థాన్ భయపడుతోంది. పాకిస్థాన్ స్పెషల్ సర్వీస్ గ్రూప్ మాజీ కమాండోలు సయీద్ స్థావరం చుట్టూ 24/7 పహరా కాస్తున్నారు.
Pakistan beefs up Hafiz Sayeed's security: భారత్ ఎప్పుడు, ఎటువైపు నుండి దాడి చేస్తుందా అని భయపడి చస్తున్న పాకిస్థాన్‌కు తాజాగా మరో భయం పట్టుకుంది. భారత్‌పై ఉగ్రవాదుల ముసుగులో జరుగుతున్న దాడులను వెనుకుండి నడిపించేది పాకిస్థాన్ అయితే, ముందుండి నడిపించేది లష్కరే తోయిబా, జమాత్ ఉద్ దవా ఉగ్రవాద సంస్థల చీఫ్ హఫీజ్ సయీద్. అందుకే భారత్ ఎప్పటి నుండో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హఫీజ్ సయీద్ కోసం వెతుకుతోంది.
ఇప్పుడు పాకిస్థాన్‌కు పట్టుకున్న భయం ఏంటంటే, పహల్గాం ఉగ్రదాడికి పాల్పడింది పాకిస్థాన్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థేనని బలంగా నమ్ముతున్న భారత్ ఏ క్షణమైనా హఫీజ్ సయీద్‌ను లేపెయొచ్చు అని. పాకిస్థాన్ ఊహించని రీతిలో ప్రతీకారం తీర్చుకుంటామని భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ప్రకటించారు.
గతంలో సర్జికల్ స్ట్రైక్స్ చేసి ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసిన భారత్ ఈసారి మరో అడుగు ముందుకేసి ఏకంగా ఉగ్రవాద సంస్థల నాయకులనే మట్టుపెడుతుందేమోననేది పాక్ అనుమానం. అందుకోసం ఇండియన్ ఇంటెలిజెన్స్ టీమ్ పాకిస్తాన్‌లో కోవర్ట్ ఆపరేషన్స్‌ను ఉపయోగించుకుంటుందేమో అని పాకిస్థాన్ భావిస్తోంది. అందుకే ఇండియాలో జరిగిన అనేక ఉగ్రవాద దాడుల వెనుక మాస్టర్ మైండ్‌గా వ్యవహరించిన హఫీజ్ సయీద్‌ను కాపాడుకునేందుకు అతడి స్థావరం చుట్టూ సెక్యురిటీ టైట్ చేసింది.
లాహోర్‌లో సయీద్ ఇంటి చుట్టూ పాకిస్థాన్ కమాండోలు
ఇప్పటికే పహల్గం ఎటాక్ తర్వాత సయీద్‌కు పాకిస్థాన్ ప్రభుత్వం అనధికారికంగా భద్రత పెంచింది. ఇప్పుడు కోవర్ట్ ఆపరేషన్స్ భయంతో ఆ భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. లాహోర్‌లోని మొహల్లా జోహార్‌లో హఫీజ్ సయీద్ నివాసం ఉంది. ఆ ఇంటి చుట్టూ పాకిస్థాన్ అదనపు బలగాలను మోహరించింది.
ఇండియన్ ఆర్మీ సయీద్‌పై ఎటాక్ చేయడానికి అవకాశం ఇవ్వొద్దనే ఉద్దేశంతో అతడిని కావాలనే అత్యంత రద్దీ కలిగిన ప్రాంతంలో మసీదులు, మదర్సలాల మధ్య దాచిపెట్టింది. ఆ ప్రాంతాన్ని పాకిస్థాన్ స్పెషల్ సర్వీస్ గ్రూప్ మాజీ కమాండోలు 24/7 పహరా కాస్తున్నారు. రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో ఇండియన్ ఆర్మీ మిలిటరీ ఆపరేషన్ చేయడం కష్టం అనేది పాక్ ఆలోచన.
పాకిస్థాన్ భయానికి కారణం లేకపోలేదు
భారత్ ఎలాగైనా హఫీజ్ సయీద్‌ను మట్టు పెడుతుందని పాకిస్థాన్ భయపడటానికి కారణాలు చాలానే ఉన్నాయి. ది గార్డియన్ ప్రచురించిన ఒక వార్తా కథనం ప్రకారం, 2020 నుండి 2024 ఏప్రిల్ మధ్య నాలుగేళ్ల వ్యవధిలోనే విదేశీ గడ్డపై దాక్కున్న 20 మంది టెర్రరిస్టులను ఇండియా తెలివిగా మట్టుపెట్టిందని పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ వర్గాల వద్ద సమాచారం ఉంది. ఈ స్పై ఆపరేషన్స్ లో రా ఏజెన్సీ (RAW - Research and Analysis Wing) కీలక పాత్ర పోషించినట్లుగా ఆ వార్తా కథనం స్పష్టంచేసింది. రా ఏజెన్సీని నేరుగా ప్రధాని మోదీనే హ్యాండిల్ చేస్తుంటారు. రా ఏజెన్సీ కార్యకలాపాల్లో కీలకమైన సమాచారం ఏదీ లీక్ అవకుండా ఉండటం కోసం ఆ సంస్థ నేరుగా ప్రధానికే రిపోర్ట్ చేయడం జరుగుతుంది.
కోవర్ట్ ఆపరేషన్స్‌లో సక్సెస్ అయిన దేశాలు
కోవర్ట్ ఆపరేషన్స్‌లో సక్సెస్ అయిన ఇతర దేశాల విషయానికొస్తే... ఉదాహరణకు గతంలో ఇజ్రాయెల్‌కు చెందిన మొసాద్ , అమెరికాకు చెందిన సీఐఏ లాంటి ఇంటెలిజెన్స్ టీమ్స్ తమ జాయింట్ ఆపరేషన్స్‌లో కావొచ్చు లేదా వేర్వేరు ఆపరేషన్స్‌లో కావచ్చు... తమ శత్రువులను విదేశీ గడ్డలపై మూడో కంటికి తెలియకుండా హతమార్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. విదేశీ గడ్డపై బంకర్లలో దాచుకున్న ఉగ్రవాదులను కూడా వారు చాకచక్యంగా హతమార్చడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది. అందుకే హఫీజ్ సయీద్ విషయంలో కూడా అలాగే జరిగే అవకాశాలు లేకపోలేదని పాకిస్థాన్ భయపడుతోంది.