జమ్మూ కశ్మీర్‌లో ‘ఆపరేషన్ మహదేవ్’.. పహల్గాం దాడికి పాల్పడిన ఉగ్రవాదుల హతం?

జమ్మూ కశ్మీర్‌లో భద్రతా దళాలు ‘ఆపరేషన్ మహదేవ్’ ప్రారంభించాయి. పహల్గాం దాడికి సంబంధించి ముగ్గురు విదేశీ ఉగ్రవాదులు హతమయ్యారు. లష్కరే తయిబా ఉగ్రగుళ్లపై భారీ సెర్చ్‌ ఆపరేషన్ కొనసాగుతోంది.

Update: 2025-07-28 09:23 GMT

Operation Mahadev in Jammu & Kashmir: Terrorists Involved in Pahalgam Attack Neutralized?

జమ్మూ కశ్మీర్‌లో ‘ఆపరేషన్ మహదేవ్‌’ కొనసాగుతోంది.. పహల్గాం దాడికి పాల్పడిన ఉగ్రవాదుల హతం?

జమ్మూ కశ్మీర్‌లోని శ్రీనగర్ దాచిగమ్‌ నేషనల్‌ పార్క్‌ సమీపంలో భీకర ఎన్‌కౌంటర్ (Jammu and Kashmir Encounter) చోటుచేసుకుంది. భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కొనసాగుతున్న ఎదురుకాల్పుల్లో ఇప్పటివరకు ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరు గత ఏప్రిల్‌లో పహల్గాం (Pahalgam Terror Attack) దాడికి పాల్పడిన లష్కరే తయిబా (Lashkar-e-Taiba) కు చెందిన ఉగ్రవాదులుగా గుర్తింపు పొందినట్లు సమాచారం.

ఈ ఆపరేషన్‌కి ‘ఆపరేషన్ మహదేవ్‌ (Operation Mahadev)’ అనే పేరు పెట్టారు. జమ్మూ కశ్మీర్‌ పోలీస్‌, భారత సైన్యం, సీఆర్పీఎఫ్‌ సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ నిర్వహిస్తున్నాయి. హర్వాన్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు తలదాచుకుని ఉన్నారనే సమాచారం మేరకు గత కొన్ని రోజులుగా గాలింపు కొనసాగుతోంది. చివరికి సోమవారం ఉదయం దాచిగమ్‌ అటవీ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్‌ నిర్వహిస్తుండగా, ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులు జరిపారు. దానికి సమాధానంగా భద్రతా బలగాలు ప్రతీకార కాల్పులకు దిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు విదేశీ ఉగ్రవాదులు మృతి చెందారు.

ఈ ఘటన అనంతరం భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ నిర్వహించాయి. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను పరిశీలించిన తర్వాత వీరి వివరాలు అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. విశ్వసనీయ వర్గాల ప్రకారం, ఈ దాడి పహల్గాం ఘటనకు సంబంధించినదేనని, హతమైన ఉగ్రవాదులు అదే దాడికి పాల్పడిన వారేనని తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు చినార్ కోర్‌, సైన్యం నుంచి అధికారిక ప్రకటన రాలేదు.

గత ఏప్రిల్‌ 22న పహల్గాం సమీపంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం బైసరన్ లోయలో ఉగ్రవాదులు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. అతి సమీపం నుంచి కాల్పులు జరిపి 25 మంది పర్యాటకులు, ఒక స్థానిక కశ్మీరీ వ్యక్తిని హత్య చేసిన ఉగ్రవాదులు అనంతరం పరారయ్యారు. ఈ దాడికి సంబంధించి ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (The Resistance Front)’, లష్కరే తయిబా అనుబంధ ఉగ్రవాద సంస్థగా గుర్తించారు. ఈ ఉగ్రవాదుల్లో ప్రతి ఒక్కరి తలపై రూ.20 లక్షల రివార్డు కూడా ప్రకటించబడింది.

ప్రస్తుతం ‘ఆపరేషన్ మహదేవ్’ కొనసాగుతుండగా, ఇంకా మరికొంతమంది ఉగ్రవాదులు తలదాచుకున్న ఆశंका నేపథ్యంలో భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉండి గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి.

Tags:    

Similar News