Myanmar, Bangkok: 23 మంది మృతి, పదుల సంఖ్యలో ఆచూకీ గల్లంతు... నమాజ్ చేస్తుండగా కూలిన మసీద్

Update: 2025-03-28 14:21 GMT

Earthquake in Myanmar, Bangkok: 23 మంది మృతి, పదుల సంఖ్యలో ఆచూకీ గల్లంతు... నమాజ్ చేస్తుండగా కూలిన మసీద్

Myanmar, Bangkok's earthquake latest news updates: మయన్మార్‌లో భూకంపం కారణంగా చనిపోయిన వారి సంఖ్య 20 కి చేరింది. ఆ 20 మరణాలు కూడా ఆ దేశ రాజధాని నైపీడోవాలోని ఒక్క ఆస్పత్రి నుండే నమోదైనట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. ఆస్పత్రిలో పరిస్థితి చూస్తోంటే మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తం అవుతోంది.

మయన్మార్‌లోనే రెండో అతిపెద్ద నగరమైన మండాలయ్‌లోనూ పరిస్థితి భయంకరంగా ఉంది. అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి. ఒక మసీదులో ముస్లింలు ప్రార్థనలో ఉండగా భూకంపం సంభవించడంతో మసీదు కూలిపోయింది. రంజాన్ మాసంలో చివరి శుక్రవారం కావడంతో భారీ సంఖ్యలో ముస్లిం సోదరులు ప్రార్థనల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. మసీదు శిథిలాల కింది నుండి మూడు మృతదేహాలను వెలికి తీశారు.

మరోవైపు బ్యాంకాక్‌లో నేలకూలిన 30 అంతస్తుల భవనం ఘటనలోనూ తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. బిల్డింగ్ కూలిన సమయంలో అందులో 40 మందికిపైగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. భవనం కూలి చోటు ఒక శిథిలాల కొండను తలపిస్తోంది. 30కి పైగా స్లాబులు, వాటి పిల్లర్లు ఒక్క చోట కుప్పపోసినట్లుగా ఉంది. ఆ శిథిలాల కింద ఎవరైనా ప్రాణాలతో ఉన్నారేమోనని రెస్క్యూ టీమ్స్ గాలిస్తున్నాయి.  

భూకంపం ధాటికి కూలిపోయిన కట్టడాల జాబితాలో మండాలయ్ యూనివర్శిటీ కూడా ఉంది. అనేక మంది విద్యార్థిని, విద్యార్థులు, ప్రొఫెసర్స్ ఈ ఘటనలో గాయపడినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను అంబులెన్స్‌లో ఆస్పత్రులకు చేర్చుతున్న దృశ్యాలు కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. 

Tags:    

Similar News