లాక్‌డౌన్‌ను ఎత్తివేయకపోతే అనేక దేశాల్లో ఆకలి చావులు చూడాల్సి వస్తుంది

లాక్‌డౌన్‌ను ఎత్తివేయకపోతే ప్రపంచంలో 50 కోట్లమంది మరింత పేదరికంలో మగ్గిపోవడంతో పాటుగా, అమెరికాతో సహా ప్రపంచంలోని అనేక దేశాల్లో ఆకలి చావులు చూడాల్సి వస్తుంది.

Update: 2020-05-12 02:45 GMT
representative image

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కారణంగా వ్యాపార, వాణిజ్యం ఆగిపోయింది. రోజుకు వేలకోట్ల డాలర్ల నష్టం వస్తోంది. అమెరికా ఆర్ధిక వ్యవస్థ అతలాకుతలం అయ్యింది. కరోనా నుంచి బయటపడితేనేగాని వ్యాపారం మరలా పుంజుకోదు. లాక్‌డౌన్‌ను ఎత్తివేయకపోతే ప్రపంచంలో 50 కోట్లమంది మరింత పేదరికంలో మగ్గిపోవడంతో పాటుగా, అమెరికాతో సహా ప్రపంచంలోని అనేక దేశాల్లో ఆకలి చావులు చూడాల్సి వస్తుంది.

కరోనా తగ్గుముఖం పట్టడంతో ఊపిరి పీల్చుకొని లాక్‌డౌన్‌ను సడలిస్తున్న దేశాలకు మళ్లీ షాక్‌ తగులుతోంది. నిషేధాజ్ఞలు అమల్లో లేకపోవడంతో జనం స్వేచ్ఛగా సంచరిస్తుండటం వైరస్‌ వ్యాప్తి ముప్పును పెంచుతోంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఈ పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంతా సర్దుకుందని సంతోషిస్తున్న తరుణంలో వైరస్‌ వ్యాప్తి మళ్లీ పెరుగుతోంది. ప్రధానంగా బార్లు, నైట్‌క్లబ్‌లలో జనం భౌతిక దూరం వంటి పాటించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా వైరస్‌ బారిన పడినట్లు తేలినవారిలో ఎక్కువమంది ఇలాంటి కేంద్రాలను సందర్శించినవారే.

రాష్ట్రాల నుంచి ఒత్తిడి పెరగడంతో జర్మనీలో నిషేధాజ్ఞలను ఛాన్స్‌లర్‌ పాక్షికంగా సడలించారు. ఇప్పటికీ కొన్ని ఆంక్షలు అమల్లో ఉండటంపై ఆదివారం పలుచోట్ల వేలమంది నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఇటలీలోనూ సడలింపులు ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తున్నాయి. పలు కేంద్రాల్లో జనం అధిక సంఖ్యలో గుమిగూడుతుండటంపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అమెరికాలోని జార్జియా, టెక్సాస్‌ల్లో చిన్న చిన్న మాల్‌లు తెరుచుకున్నాయి. నెవడాలో రెస్టారెంట్లు, హెయిర్‌ సెలూన్లూ తెరిచేందుకు అనుమతించారు. న్యూయార్క్‌లో ఈ నెల 15తో ముగియనున్న నిషేధాజ్ఞలను వచ్చే నెల 7 వరకు పొడిగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

కరోనా వ్యాప్తి పూర్తిగా నియంత్రణలోకి రాకపోయినా, ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతుండటంతో పలు దేశాలు ఆంక్షల ఎత్తివేసేందుకు శ్రీకారం చుడుతున్నాయి. ఫ్రాన్స్‌లో తాజాగా 80 మంది మృతి చెందారు. గత నెల రోజుల్లో ఆ దేశంలో ఒక్కరోజులో ఇంత తక్కువ సంఖ్యలో మరణాలు నమోదవడం ఇదే తొలిసారి. దీంతో జన సంచారంపై 8 వారాలుగా ఉన్న నిషేధాజ్ఞలను సడలించేందుకు ఫ్రాన్స్‌ సన్నద్ధమవుతోంది. స్పెయిన్‌లో తాజాగా 24 గంటల్లో 143 మంది మరణించారు. మార్చి 18 తర్వాత అక్కడ ఒక్క రోజులో నమోదైన అతి తక్కువ మరణాలు ఇవే. ఆ దేశంలో నిషేధాజ్ఞలను పాక్షికంగా సడలించనున్నారు. దీంతో దాదాపు 4.7 కోట్ల మందికి ఉపశమనం లభించే అవకాశముంది. 

Tags:    

Similar News