Masood Azhar: జైషే చీఫ్‌ మసూద్‌ అజహర్‌ మృతి అంటూ వార్తలు..

Masood Azhar: మసూద్‌ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన యూఎన్‌వో

Update: 2024-01-01 15:45 GMT

Masood Azhar: జైషే చీఫ్‌ మసూద్‌ అజహర్‌ మృతి అంటూ వార్తలు..

Masood Azhar: పాకిస్థాన్‌లో గత కొన్ని నెలలుగా గుర్తుతెలియని వ్యక్తుల చేతుల్లో ఉగ్రవాదులు హతమవుతున్న విషయం తెలిసిందే. తాజాగా జైషే మహ్మద్‌ చీఫ్‌, పుల్వామా దాడి మాస్టర్‌ మైండ్‌ మసూద్‌ అజహర్‌ పై బాంబు దాడి జరిగినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ దాడిలో అతడు మృతిచెందినట్లు కథనాలు వెలువడుతున్నాయి.ఈ ఉదయం 5 గంటల ప్రాంతంలో పాక్‌లోని భవల్‌పూర్‌ మసీదు నుంచి మసూద్‌ తిరిగి వస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు బాంబు దాడికి పాల్పడినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే మృతిచెందినట్లు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. అయితే, ఈ వార్తలపై ఎలాంటి అధికారి ధ్రువీకరణ లేదు. పాక్‌ పత్రిక డాన్, ఇతర స్థానిక మీడియాల్లోనూ ఈ పేలుడు గురించి ఎలాంటి కథనాలూ రాలేదు.

కాగా.. మసూద్‌పై బాంబు దాడి జరిగినట్లుగా పేర్కొంటూ వైరల్‌ అవుతున్న వీడియో పాతదని తెలుస్తోంది. ఇక, మసూద్‌ అజహర్‌ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. అతడు పాక్‌లోనే ఉన్నట్లు ఇప్పటికీ ఆ దేశం అంగీకరించలేదు. అందువల్ల, ఒకవేళ అతడిపై దాడి జరిగినా.. దాని గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం లేదు.పాక్‌ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహ్మద్‌ ఉగ్ర ముఠా అధినేత అయిన మసూద్‌.. భారత్‌లో పలు భీకర దాడులకు సూత్రధారి. 1995లో భారత్‌ అతడిని అరెస్టు చేసింది. అయితే, 1999లో కొందరు ఉగ్రవాదులు విమానాన్ని హైజాక్‌ చేసి అతడిని విడిపించుకున్నారు. ఆ తర్వాత అతడు జైషేను స్థాపించాడు. 2001లో పార్లమెంట్‌పై జరిగిన ఉగ్రదాడి, 2008లో ముంబయిలో జరిగిన బాంబు పేలుళ్లలోనూ ఇతడి ప్రమేయం ఉంది.

2019లో జమ్మూకశ్మీర్‌లో పుల్వామాలో సైనికుల కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ దాడికి వెనుక మసూద్‌ మాస్టర్‌మైండ్‌ ఉంది. ఈ ఘటన తర్వాతే ఐక్యరాజ్యసమితి.. అతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది.

Tags:    

Similar News