ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి చెప్పినా వినిపించుకోలేదన్న అమెరికా అధ్యక్షుడు

Joe Biden: రష్యా దాడి చేస్తుందని ముందే తెలుసున్న బైడెన్‌

Update: 2022-06-11 11:00 GMT

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి చెప్పినా వినిపించుకోలేదన్న అమెరికా అధ్యక్షుడు

Joe Biden: ఉక్రెయిన్‌పై రష్యా దాడికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను అమెరికా అధ్యక్షుడు బైడెన్ వివరించారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేస్తుందని తమకు ముందే తెలుసునని స్ఫష్టం చేశారు. ఈ విషయం తాము ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లొదిమిర్‌ జెలెన్‌స్కీకి వివరించినా అతడు వినిపించుకోలేదని బైడెన్‌ తెలిపారు. అప్పట్లో తాము చెబితే.. చాలా మంది.. అదొక అతిశయోక్తిగా తీసిపడేశారన్నారు. లాస్‌ఏంజిల్స్‌లో నిర్వహించిన పార్టీ నిధుల సేకరణ కార్యాక్రమంలో బైడెన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం దాడికి దిగుతున్నట్టు తాను ముందుగానే హెచ్చరించిన విషయాన్ని గుర్తు చేశారు. అయినప్పటికీ ఎవరూ నమ్మలేదన్నారు. ముందే అప్రమత్తమై ఉంటే.. అంత నష్టం జరిగేది కాదని బైడెన్‌ తెలిపారు.

ఉక్రెయిన్‌ సరిహద్దులకు పుతిన్ సేనలు వెళ్లినట్టు తమకు నిఘా వర్గాలు ఫిబ్రవరి ప్రారంభంలోనే కచ్చితమైన సమాచారం ఇచ్చారని బైడెన్ తెలిపారు. తాను జెలెన్‌స్కీకి ఈ విషయం చెప్పానని.. అయితే అతడు వినిపించుకోలేదన్నారు. చాలామంది ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకున్నారని బైడెన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం కొందరు ఐరోపా మిత్ర దేశాల అధినేతలు కూడా నమ్మలేదన్నారు. పైగా తననే ఎద్దేవా చేసినట్టు తెలిపారు. అలా ఎందుకు జరిగిందో నాకు ఆ తరువాత అర్థమైందన్నారు. తన వ్యాఖ్యలు చాలామందికి అతిశయోక్తిలా అనిపించాని చెప్పుకొచ్చారు. కానీ ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా దాడికి పాల్పడిందని స్ఫష్టం చేశారు.

ఫిబ్రవరి ప్రారంభంలోనే సరిహద్దుల వైపునకు రష్యా భారీ సైన్యాన్ని తరలించింది. ఉక్రెయిన్-రష్యా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌పై రష్యా దాడికి పాల్పడుతుందని అమెరికా నిఘా వర్గాలు హెచ్చరించాయి. అయితే ఈ విషయాన్ని మాస్కో కూడా ఖండించింది. ఉక్రెయిన్‌పై ఎలాంటి దాడికి దిగబోమని క్రెమ్లిన్‌ తెలిపింది. మరోవైపు అమెరికా మాత్రం తమ పౌరులను దేశానికి వచ్చేయాలని పిలుపునిచ్చింది. వెంటనే కీవ్‌కు ప్రత్యేక విమానాలను పంపింది. అయితే ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై సైనిక చర్య చేపడుతున్నట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రకటించారు. అప్పటికే సిద్ధంగా ఉన్న మాస్కో సేనలు ఉక్రెయిన్‌వైపు దూసుకెళ్లాయి.

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం నాలుగు నెలలుగా సాగుతోంది. ఈ యుద్ధంలో ఉక్రెయిన్‌పై క్షిపణులతో రష్యా సేనలు విరుచుకుపడ్డాయి. గ్రామం, పట్టణం, నగరం అన్న తేడా లేకుండా.. విక్షణ రహితంగా బాంబుల వర్షం కురిపించింది. దీంతో ఎక్కడ చూసినా.. శిథిల భవనాలే దర్శనమిస్తున్నాయి. బాంబుల మోతతో ఉక్రెయిన్‌ దద్దరిల్లుతోంది. ప్రజలు భయాందోళనతో దేశం విడిచి వెళ్లిపోయారు. ఇప్పటివరకు ఉక్రెయిన్‌ నుంచి 60 లక్షల మంది ప్రజలు సమీప దేశాలకు వలస వెళ్లారు. ఈ యుద్ధంలో దక్షిణ ఉక్రెయిన్‌లోని మారియూపోల్‌, అజోవ్‌స్తల్‌ స్టీల్‌ ప్లాంట్‌, ఖేర్సన్‌, డాన్‌బాస్‌ ప్రాంతాలపై రష్యా పట్టుసాధించింది. రష్యాపై పోరాడేందుకు తమకు మరిన్ని ఆయుధాలను ఇవ్వాలంటూ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పాశ్యాత్య దేశాలను కోరుతున్నారు. 

Tags:    

Similar News