ప్రపంచాన్ని భయపెట్టాలనుకున్న బాగ్దాదీ చివరికి కుక్క చావు చచ్చాడు: ట్రంప్‌

Update: 2019-10-28 06:03 GMT

నరమేధంతో ప్రపంచాన్నే భయపెట్టిన ఐసిస్ చీఫ్ అబూబకర్ అల్ బాగ్దాదీ హతమయ్యాడు. ఈశాన్య సిరియాలో అమెరికా దళాలు ఆపరేషన్ చేపట్టడంతో తనను తాను బాంబుతో పేల్చుకుని బాగ్దాదీ తనువు చాలించాడు. అమెరికన్ ఆర్మీ ఆపరేషన్‌తో పారిపోయి సొరంగంలో దాక్కున్న బాగ్దాదీ చివరికి, తప్పించుకోలేనని నిర్ధారించుకున్నాక ఆత్మాహుతి చేసుకున్నాడు. ఐసిస్ చీఫ్ మృతిని అధికారికంగా నిర్ధారించిన అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌ చివరి క్షణాల్లో బగ్దాదీ భయంతో వణికిపోయాడని, ప్రాణభయంతో భీతిల్లిపోయాడని వివరించారు.

నరమేధంతో ప్రపంచాన్నే భయపెట్టిన ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాద సంస్థ అధినేత అబు బుకర్ బాగ్దాదీ హతమైనట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికా సైన్యానికి భయపడి పిరికిపందలా బాగ్దాదీ ఆత్మహత్య చేసుకున్నాడని ట్రంప్ వెల్లడించారు. అమెరికన్ ఆర్మీ దాడి చేస్తుండగా తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మాహుతికి పాల్పడ్డాడని తెలిపారు. అమెరికా బలగాలను ఎదుర్కోలేననే భయంతోనే తనను తాను బాంబుతో పేల్చుకున్నాడని, దాంతో అతడి శరీరం తునాతునకలైందని వెల్లడించారు. డీఎన్‌ఏ టెస్ట్‌లు బాగ్దాదీ మృతిని ధృవీకరించాయని ట్రంప్‌ అధికారికంగా ప్రకటించారు.

ఉగ్రవాదంతో ప్రపంచాన్ని భయపెట్టాలనుకున్న బాగ్దాదీ చివరికి కుక్క చావు చచ్చాడని, ఈ ఆపరేషన్‌ మొత్తాన్ని తాను తిలకించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. మొత్తం రెండు గంటలపాటు ఆపరేషన్ జరిగిందన్నారు. ఐసిస్‌ స్థావరాలపై అమెరికా బలగాలు దాడులు చేస్తున్న సమయంలో బాగ్దాది భయపడిపోయాడని, సొరంగం చివరన దాక్కున్నాడని, అయితే ఇక తప్పించుకోలేనని నిర్ధారించుకున్నాకే, బాంబుతో తనను పేల్చేసుకున్నాడని ట్రంప్ అన్నారు. వాయవ్య సిరియాలోని ఇడ్లిబ్‌లో ఈ దాడి జరిగినట్లు తెలిపారు.

ఐసిస్ చీఫ్ అబూబకర్ అల్ బాగ్దాదీ హతమైనట్లు అధికారికంగా ప్రకటించిన ట్రంప్ అమెరికన్లనుద్దేశించి ప్రసంగించారు. సిరియాలో అమెరికా ఆపరేషన్, లక్ష్యం పూర్తవడంతో ఈశాన్య ప్రాంతం నుంచి తమ సైన్యాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. మొత్తానికి వేలాది మందిని ఊచకోత కోసి, ఉగ్ర దాడులతో పలు దేశాల్లో నరమేధం సృష్టించిన ఐసిస్ చీఫ్ అబూబకర్ అల్ బాగ్దాదీ కథ ముగిసింది.


Tags:    

Similar News