Indonesia: ఇండోనేషియాలో భారీ వర్షాలు.. 44 మంది మృతి

Indonesia:తూర్పు ఇండోనేషియాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వీటికి తోడు కొండచరియలు విరిగిపడుతుండటంతో ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతున్నారు.

Update: 2021-04-04 16:03 GMT

ఇండోనేషియా వరదలు 

Indonesia: తూర్పు ఇండోనేషియాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వీటికి తోడు కొండచరియలు విరిగిపడుతుండటంతో ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ మహా విలయంలో ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 44 మంది మృతిచెందారు. వరదల కారణంగా వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.

ఇండోనేషియా ప్రకృతి విపత్తులకు నిలయంగా మారింది. అక్కడ ప్రకృతి సృష్టించే బీభత్సంతో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఇండోనేషియాలో భారీ వరదలు సంభవించాయి. అర్ధరాత్రి ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి నదులన్నీ పొంగిపొర్లాయి. ఈ నేపథ్యంలోనే వరదలు ముంచెత్తాయి. దీంతో నది పరీవాహక ప్రాంతంల్లోని ఊళ్లకు ఊళ్లు తుడిచిపెట్టుకుపోయాయి. అనేక మంది మరణించారు. పలువురు గల్లంతయ్యారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని జాతీయ విపత్తు నిర్వహణ ప్రతినిధులు తెలిపారు.

కొండల నుంచి పెద్ద ఎత్తున బురద జారడంతో తూర్పు నుసా తెంగారా ప్రావిన్స్‌లోని ఫ్లోర్స్ ద్వీపంలోని లామెనెలే గ్రామంలో దాదాపు 50 ఇళ్లు కుప్పకూలిపోయాయి. వెంటనే రంగంలో దిగిన సహాయక బృందాలు తన ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ఇప్పటివరకు 40 మృతదేహాలను గుర్తించగా.. తొమ్మిది మంది గాయపడినట్లు జాతీయ విపత్తు నిర్వహణ అధికారి తెలిపారు.

ఓయాంగ్‌ బయాంగ్‌ గ్రామంలో వరదలతో గ్రామస్తులు కొట్టుమిట్టాడుతున్నారు. మరో గ్రామమైన వైబురక్‌లో రాత్రిపూట కురిసిన వర్షాలకు తూర్పు ఫ్లోర్స్‌ జిల్లాలోని ప్రాంతాలకు బురదనీరు ప్రవహించింది. వందలాది మంది ప్రజలు మునిగిపోయిన ఇళ్ల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. వారిలో కొందరు వరదలకు కొట్టుకుపోయారు.

Tags:    

Similar News