Rice Shortage: బియ్యం ఎగుమతులపై నిషేధం.. అమెరికాలో ఎన్నారైల తిప్పలు
Rice Shortage: ఒకరికి ఒక సంచి మాత్రమే ఇస్తున్న సూపర్ మార్కెట్లు
Rice Shortage: బియ్యం ఎగుమతులపై నిషేధం.. అమెరికాలో ఎన్నారైల తిప్పలు
Rice Shortage: అమెరికాలో బియ్యం కష్టాలు మొదలైయ్యాయి. సన్నరకం బియ్యం ఎగుమతులపై భారత్ నిషేధం విధించడంతో అమెరికాలో ఉంటున్న భారతీయులు ఆందోళన చెందుతున్నారు. దీంతో సూపర్ మార్కెట్లకు క్యూ కట్టి పెద్ద ఎత్తున బియ్యం కొనుగోలు మొదలు పెట్టారు. తెలుగు రాష్ట్రాల రైతులు పండించే సన్నరకం బియ్యం దొరక్క అమెరికాలో భారతీయులు.. ప్రధానంగా తెలుగువారు అల్లాడుతున్నారు. గత రెండు రోజులుగా అగ్రరాజ్యంలోని పలు రాష్ట్రాల్లో బియ్యం నిల్వలు లేవని, ఒకరికి ఒక సంచి మాత్రమే అమ్ముతామనే బోర్డులు పలు దుకాణాల్లో కనిపిస్తున్నాయి.
విదేశాలకు బియ్యం ఎగుమతులను నిషేధిస్తున్నట్లు భారత ప్రభుత్వం ఈ నెల 20న ప్రకటించడంతో 140కి పైగా దేశాల మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడింది. అమెరికాలో సన్నబియ్యం అమ్మకాలపై తీవ్ర ఆంక్షలు విధించారు. పలు దుకాణాల ముందు ఎన్నారైలు బియ్యం కోసం బారులు తీరుతున్నారు. కొరత భయంతో బియ్యం సంచులు కొంటుండటంతో దుకాణాల్లో పలు ఆంక్షలు పెడుతున్నారు. ఒక మనిషికి ఒకటి మాత్రమే విక్రయిస్తామని, అది కూడా ఇతర వస్తువులేవైనా 35-40 డాలర్లకు కొంటేనే బియ్యం అమ్ముతామని షరతులు విధిస్తున్నారు. కేవలం 9 కిలోల బియ్యం మాత్రమే ఉండే సంచి విక్రయించడానికి ఇన్ని షరతులా అని ఎన్నారైలు ఆందోళన చెందుతున్నారు.
మనదేశంలో గత ఆర్థిక సంవత్సరం రికార్డుస్థాయిలో బియ్యం, గోధుమల దిగుబడులొచ్చినా ప్రపంచ మార్కెట్ల పరిస్థితులతో ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించింది. గత ఏడాది 13.08 కోట్ల టన్నుల బియ్యం, 11.21 కోట్ల టన్నుల గోధుమలు పండినట్లు కేంద్ర అర్థ గణాంకశాఖ ఇటీవల విడుదల చేసిన నివేదికలో ప్రకటించింది. దేశ చరిత్రలో ఇంత ఎక్కువ దిగుబడులు ఎన్నడూ రాలేదు. గతంలో అత్యధికంగా 2020-21లో 12.43 కోట్ల టన్నుల బియ్యం దిగుబడి రికార్డు.. గత ఏడాది అది చెరిగిపోయి మరో 65 లక్షల టన్నులు అదనంగా పండినట్లు వివరించింది. దేశంలో గోధుమల కొరత ఏర్పడడంతో వాటి ఎగుమతులను కేంద్రం ఇంతకుముందే నిషేధించింది. మరోవైపు ప్రపంచ ఆహార ద్రవ్యోల్బణం పెరుగుతుండటం, కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు లేనందున వరి సాగు తగ్గుతుందేమోనన్న ఆందోళనతో ముందు జాగ్రత్త చర్యగా బియ్యం ఎగుమతులనూ నిషేధించినట్లు తెలుస్తోంది. ఎన్నారైలకు ఎదురైన కొరతను నివారించడానికి నిషేధం తొలగించాలంటూ కేంద్రానికి విన్నవించామని బియ్యం ఎగుమతుల సంఘం జాతీయ అధ్యక్షుడు రామకృష్ణ చెప్పారు.
తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, తమిళనాడులలో పండించే సన్నరకాల బియ్యాన్ని 140 దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 180.20 లక్షల హెక్టార్లలో వరి పంట సాగయ్యింది. గత ఏడాది ఇదే సమయానికి 175.47 లక్షల హెక్టార్లలోనే వరినాట్లు పడగా ఈ ఏడాది మరో 4.73 లక్షల హెక్టార్లు పెరిగింది. ఇంతకాలం ఎగుమతుల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో సన్నబియ్యం ధరలు బాగా పెరిగాయి. సన్నరకం సోనామసూరి పాత బియ్యాన్ని కిలో రూ.60కి పైగా విక్రయిస్తున్నారు. ఇప్పుడు ఎగుమతులు ఆగినా ఇంకా దేశీయ మార్కెట్లలో ధరలు తగ్గలేదు.
అమెరికాలో ప్రస్తుతం సుమారు 12 వేల మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వలున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. మరో వైపు మన దేశం నుంచి 18 వేల టన్నుల బియ్యం రవాణాలో ఉన్నట్లు ఎగుమతిదారులు చెబుతున్నారు. ఈ నిల్వలు 6 నెలలకు సరిపోతాయన్న అంచనాలున్నాయి. అయితే ఎగుమతులు నిలిచిపోయాయన్న భయాందోళన నేపథ్యంలో అమెరికాలో ఉంటున్న భారతీయులు బియ్యం కోసం ఎగబడటంతో సూపర్ మార్కెట్లలో స్టాక్ నిండుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అమెరికాలో వ్యాపారులు ధరలు పెంచేశారు. తెలుగు వారు గంటలకొద్దీ క్యూలో నిలబడినా సన్నబియ్యం దొరకడం లేదు. ముందుజాగ్రత్తగా చాలామంది ఎక్కువ మోతాదులో కొనడం వల్ల గిరాకీ అధికమైంది. వారం క్రితం 9 కిలోల బియ్యం సంచి 19 డాలర్ల ఉండగా.. ఇప్పుడు అదే సంచికి 45 డాలర్లు పెరిగింది. పైగా ఒక మనిషికి ఒకటి మాత్రమే విక్రయిస్తున్నారు.
ఇక్కడ మరో ప్రమాదం కూడా ఉంది. బియ్యం సరఫరాను భారత ప్రభుత్వం పునరుద్ధరించినా.. పెరిగిన ధరలు తగ్గుతాయన్న నమ్మకం లేదని అమెరికాలో ఉంటున్న భారతీయులంటున్నారు. కోవిడ్ టైంలో ధరల పెరుగుదల గణనీకంగా నమోదు కాగా... కొవిడ్ తర్వాత వాటి కట్టిడి ఫెడరల్ గవర్నమెంట్ చాలా ప్రయత్నాలే చేసినా లాభం లేకుండా పోయింది. ఫలితంగా రెండేళ్లలోనే నిత్యవసర సరుకుల ధరలు రెండు రెట్లు పెరిగాయి.