భారత్‌లో చొరబాటుకు పాకిస్తానీయుల యత్నం..!

సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ పాకిస్థాన్ మరోసారి బరితెగించింది.

Update: 2026-01-16 06:31 GMT

సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ పాకిస్థాన్ మరోసారి బరితెగించింది. అరేబియా సముద్ర మార్గం గుండా భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన తొమ్మిది మంది పాకిస్థానీయులను భారత కోస్ట్ గార్డ్ (ICG) సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. 'ఆపరేషన్ సింధూర్' వంటి చర్యలతో భారత్ ఇప్పటికే హెచ్చరించినప్పటికీ, పాక్ తన వంకర బుద్ధిని మార్చుకోలేదని ఈ ఘటన నిరూపిస్తోంది.

రాడార్‌కు చిక్కిన అనుమానాస్పద పడవ

బుధవారం (జనవరి 14) రాత్రి భారత కోస్ట్ గార్డ్ గస్తీ నౌక అరేబియా సముద్రంలో సాధారణ నిఘా నిర్వహిస్తోంది. అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ (IMBL) సమీపంలో, భారత జలాల లోపల ఒక పడవ నిశ్శబ్దంగా కదులుతున్నట్లు రాడార్ గుర్తించింది. సాధారణంగా ఫిషింగ్ బోట్లు వెళ్లే మార్గం కాకపోవడం, దాని కదలికలు అత్యంత అనుమానాస్పదంగా ఉండటంతో సైనికులు అప్రమత్తమయ్యారు.

మత్స్యకారుల వేషంలో చొరబాటుదారులు

వెంటనే రంగంలోకి దిగిన కోస్ట్ గార్డ్ సిబ్బంది, ఆ పడవను చుట్టుముట్టారు. అందులో మత్స్యకారుల వేషధారణలో ఉన్న తొమ్మిది మంది పాకిస్థానీయులను గుర్తించారు. ప్రాథమిక విచారణలో వారు భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు పన్నాగం పన్నినట్లు తేలింది. దీంతో వారిని బంధించి, పడవను స్వాధీనం చేసుకున్న సైనికులు.. ప్రస్తుతం వారిని విచారణ నిమిత్తం గుజరాత్‌లోని పోర్టుకు తరలిస్తున్నారు.

హై అలర్ట్‌లో తీర ప్రాంతం

పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు సముద్ర మార్గాన్ని ఎంచుకునే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో, తీర ప్రాంతమంతా హై అలర్ట్ ప్రకటించారు. పట్టుబడిన వారి వద్ద ఏవైనా ఆయుధాలు లేదా పత్రాలు ఉన్నాయా అనే కోణంలో భద్రతా బలగాలు లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి.

Tags:    

Similar News