అమెరికాలో హిందూ దేవాలయంపై దాడి.. స్పందించిన భారత్

Update: 2025-03-09 08:43 GMT

అమెరికాలో హిందూ దేవాలయంపై దాడి.. స్పందించిన భారత్

Temple Vandalised In California: క్యాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్స్‌లో ఉన్న చినో హిల్స్ ప్రాంతంలోని హిందూ దేవాలయంపై కొంతమంది గుర్తుతెలియని దుండగులు దాడి చేసి విధ్వంసం సృష్టించారు. ఇటీవల కాలంలో అమెరికాలో ఈ తరహా ఘటనల్లో ఇది మూడోది.

గతేడాది సెప్టెంబర్ నెలలో క్యాలిఫోర్నియాలోని సాక్రామెంటోలో బాప్స్ (బొచ్చసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామి నారాయణ్ సంస్థ) దేవాలయంపై దాడి జరిగింది. అంతకంటే కొద్దిరోజుల ముందే న్యూయార్క్ లోని మెల్విలెలోని మరో బాప్స్ దేవాలయంపై కూడా దాడి జరిగింది.

తాజాగా చినో హిల్స్ దేవాలయం ఘటనపై భారత ప్రభుత్వం స్పందించింది. ఈ ఘటనను భారత్ తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ తెలిపారు. ఈ దాడికి బాధ్యులైన వారిని అదుపులోకి తీసుకుని వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా అమెరికాలోని స్థానిక అధికార యంత్రాంగాన్ని కోరారు. ప్రార్ధనా మందిరాలపై దాడులు జరగకుండా చూసుకోవాల్సిందిగా రణ్‌ధీర్ జైశ్వాల్ వారికి విజ్ఞప్తి చేశారు.

బొచ్చసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామి నారాయణ్ సంస్థ ప్రతినిధులు కూడా ఈ దాడిని ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. అహంకారపూరిత ధోరణితో జరిగే దాడులను తిప్పి కొట్టేందుకు హిందూ కమ్యునిటీ అంతా కలిసి పనిచేస్తుందన్నారు. విద్వేషం వేళ్లూనుకునేందుకు బాప్స్ అవకాశం ఇవ్వదని అన్నారు.

శాంతిస్థాపన కోసమే తాము కృషి చేస్తున్నట్లు వారు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బొచ్చసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామి నారాయణ్ సంస్థ దేవాలయాల లక్ష్యం కూడా అదేనన్నారు. 

Tags:    

Similar News