Delta Variant: అమెరికాను వణికిస్తున్న డెల్టా వెరియంట్
Delta Variant: కిక్కిరిసిపోతున్న హాస్పిటల్స్ * ఆక్సిజన్ కొరతతో అల్లాడుతున్న అగ్రరాజ్యం
Representational Image
Delta Variant: మనదేశంలో కరోనా వైరస్ రెండో ఉద్ధృతికి కారణమైన డెల్టా వేరియంట్ ఇప్పుడు అమెరికాను వణికిస్తోంది. వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య మళ్లీ అక్కడ ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతోంది. రోగులతో ఆస్పత్రులు నిండిపోతున్నాయి. ఫలితంగా ఆక్సిజన్‌కు కొరత ఏర్పడింది. ఫ్లోరిడా, సౌత్ కరోలినా, టెక్సాస్, లూసియానాలోని ఆస్పత్రులు ఆక్సిజన్ కొరత ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో చాలా చోట్ల రిజర్వు చేసిన ఆక్సిజన్‌ను కూడా వాడుకోవాల్సిన పరిస్థితి వస్తోందని వైద్యులు పేర్కొన్నారు.
సాధారణంగా 90 శాతం నిండి ఉండే ఆక్సిజన్ ట్యాంకులో 30-40 శాతం మిగిలి ఉండే వరకు ఆక్సిజన్‌ను వాడతారు. అలా మిగల్చడం వల్ల మరో ఐదు రోజుల వరకు సరఫరాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. కానీ, ఇప్పుడు 10శాతం స్థాయి వరకు వాడేయాల్సి వస్తోందని వైద్యులు చెబుతున్నారు. దీని వల్ల ఒకటి రెండు రోజులకు మించి ఆక్సిజన్ నిల్వలు ఉండవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు హరికేన్ల కారణంగా గంటలపాటు విద్యుత్ సరఫరాకు అంతరాయ కలుగులోంది. ఇది వైద్య సేవలపై తీవ్ర ప్రభావం చూపుతోందని తెలుస్తోంది. 12 ఏళ్ల లోపు వారికి టీకాలు అందుబాటులో లేకపోవడంతో, త్వరలోనే స్కూళ్లు తెరవనుండడంతో వారు కూడా పెద్ద సంఖ్యలో కరోనా బారినపడే అవకాశం ఉందని, వారితో ఆస్పత్రులు నిండిపోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.