Covid Virus: మరోసారి దూసుకువస్తున్న కోవిడ్ మహమ్మారి..అక్కడ భారీగా కేసులు నమోదు

Update: 2025-05-16 00:35 GMT

Covid Virus: మరోసారి దూసుకువస్తున్న కోవిడ్ మహమ్మారి..అక్కడ భారీగా కేసులు నమోదు

Covid Virus: ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో కోవిడ్ 19 మరోసారి వేగంగా దూసుకువస్తోంది. ముఖ్యంగా ఆర్థిక కేంద్రాలైన హాంగ్ కాంగ్, సింగపూర్ లలో కేసుల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో అప్రమత్తమైన అక్కడి ఆరోగ్యశాఖ అధికారులు, ఇది కొత్త వేవ్ అని నిర్ధారించినట్లు తెలుస్తోంది. హాంగ్ కాంగ్ లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. గతేడాది కాలంలో ఎన్నడూ లేనంత విధంగా శ్వాసకోశ నమూనాల్లో కోవిడ్ 19 పాజిటివ్ శాతం పెరిగిందని నగర ఆరోగ్య పరిరక్షణ కేంద్రం, అంటువ్యాధుల విభాగం అధిపతి ఆల్బర్ట్ ఆ తెలిపారు. వైరస్ వ్యాప్తి ప్రస్తుతం చాలా ఎక్కువగా ఉందని స్పష్టం చేశారు.

మే 3తో ముగిసిన వారంలో తీవ్రమైన కేసులు, మరణాల సంఖ్య 31కి చేరుకుంది. ఇది కూడా దాదాపు ఏడాది తర్వాతే అత్యధికం. మురుగునీటి పరీక్షలు, ఆసుపత్రిలో చేరుతున్నవారి సంఖ్య క్లినిక్స్ కు వస్తున్న వారి లెక్కలు..ఇవన్నీ 70 లక్షల జనాభా ఉన్న నగరంలో వైరస్ నిలకడగా వ్యాపిస్తోందని చెబుతున్నారు. అటు సింగపూర్ లోనూ కేసుల ఉద్రుతి మరింత ఎక్కువగా కనిపిస్తోంది. అక్కడి ఆరోగ్య మంత్రిత్వ శాఖ అరుదుగా విడుదల చేసిన ప్రకటనలో మే 3తో ముగిసిన వారంలో అంచనా వేసిన వారపు కేసుల సంఖ్య 28శాతం పెరిగి 14,200కు చేరుకుందని తెలిపింది. అదే సమయంలో ఆసుపత్రిలో చేరేవారి సంఖ్య కూడా 30శాతం పెరిగింది.

ప్రజల్లో ఇమ్యూనిటీ తగ్గడం వల్లే ఈ పెరుగుదల ఉండవచ్చని అంటున్నారు. అయితే ప్రస్తుత వేరియంట్ల మహమ్మారి ఉద్రుతంగా ఉన్నప్పటి కంటే ప్రమాదకరమైనవి లేదా వేగంగా వ్యాపించేవి అనేందుకు ఆధారాలు లేవని మంత్రిత్వ శాఖ తెలిపింది. కేసుల సంఖ్య భారీగా పెరిగినప్పుడు మాత్రమే సింగపూర్ వంటి ప్రకటనలు విడుదల చేస్తుంది. ఇది ప్రస్తుత పరిస్థితి తీవ్రతను సూచిస్తుందని తెలిపారు. 

Tags:    

Similar News