Gold Reserves: బంగారం నిల్వల్లో రారాజు అమెరికా... మరి భారత్ స్థానం ఎంత?

ప్రపంచంలోని అత్యంత విలువైన లోహాలలో బంగారం ఒకటి. మహిళలు బంగారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అయితే ఇది కేవలం అలంకరణ వస్తువులు, ఆభరణాలకే పరిమితం కాదు.

Update: 2025-02-17 10:25 GMT

బంగారం నిల్వల్లో రారాజు అమెరికా... మరి భారత్ స్థానం ఎంత?

Gold Reserves: ప్రపంచంలోని అత్యంత విలువైన లోహాలలో బంగారం ఒకటి. మహిళలు బంగారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అయితే ఇది కేవలం అలంకరణ వస్తువులు, ఆభరణాలకే పరిమితం కాదు. ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుంది. దేశ ఆర్థిక స్థిరత్వాన్ని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. అందుకే ప్రతి దేశం బంగారాన్ని నిల్వ చేసుకునేందుకు ప్రాధాన్యత ఇస్తాయి. అవసరమైతే వాటిని పెంచుకునేందుకు ప్రయత్నిస్తాయి. ఒక దేశ కరెన్సీ విలువను కూడా బంగారం నిల్వలు ప్రభావితం చేస్తాయంటే బంగారానికి ఉండే విలువ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

ముఖ్యంగా భారతీయులకు బంగారానికి విడదీయలేని బంధం ఉంది. ప్రపంచంలో భారతీయులు ఉపయోగించినంత బంగారాన్ని మరే దేశస్తులు వినియోగించరేమో. పిల్లల బారసాల ఫంక్షన్ నుంచి ప్రతి శుభకార్యాలయాలకు బంగారం తప్పనిసరి. ఒకరకంగా బంగారం లేకుండా ఏ ఫంక్షన్ కూడా జరగదని చెప్పొచ్చు. మన భారతీయులకు బంగారం అంటే అంత మక్కువ. ఏటా టన్నుల కొద్ది భారత్‌కు బంగారం దిగుమతి అవుతోంది. దేశం ఆర్థికంగా కుదేలైనా, మరేదైనా సవాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు బంగారం నిల్వలే కాపాడతాయని ప్రభుత్వాల నమ్మకం. అందుకే భారత్ ఇటీవల ఏకంగా 100 టన్నుల బంగారాన్ని ఇండియాకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

బంగారాన్ని పెట్టుబడిగా పెట్టి లాభాలు పొందేవాళ్లు కొందరైతే.. దీనిని ప్రెస్టేజ్ ఇష్యూగా భావించేవారు మరికొందరు. బంగారం ధరలు రూ.80 వేలు దాటినా కూడా కొనుగోళ్లు మాత్రం ఆగడం లేదు. అంటే మన దేశంలో గోల్డ్‌కి అంతలా డిమాండ్ ఉంది. బంగారం నిల్వలు ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ 7వ స్థానంలో ఉంది. పవర్‌లోనే కాదు.. బంగారం నిల్వల్లోనూ అగ్రరాజ్యం అమెరికాదే పై చేయి. గోల్డ్ నిల్వల్లో అమెరికా టాప్ నెంబర్ 1 ప్లేస్‌లో ఉంది.

2024 సెప్టెంబర్ నాటికి అమెరికా దగ్గర మొత్తం 8,133.5 టన్నుల బంగారం నిల్వ ఉంది. అంతేకాదు ప్రతి ఏటా ఈ నిల్వలలను పెంచుకుంటూనే ఉంది. ఇలా పెద్ద మొత్తంలో బంగారం నిల్వ చేసి మరింత తిరుగులేని శక్తిగా అమెరికా ఎదిగే ప్రయత్నం చేస్తోంది. ఆ తర్వాత రెండో స్థానంలో జర్మనీ ఉంది. ప్రస్తుతం జర్మనీ దగ్గర మొత్తం 3,351.53 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. ఇటలీ మూడో స్థానంలో నిలిచింది. ఇటలీ దగ్గర 2,451.84 టన్నుల బంగారం ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఆ తర్వాత 2,436.94 టన్నుల బంగారంతో ఫ్రాన్స్ నాలుగో స్థానంలో ఉంది. ఇక 5వ స్థానం విషయానికొస్తే... 2,264.63 టన్నుల బంగారం నిల్వలతో చైనా 5వ స్థానం సొంతం చేసుకుంది. 1,039.94 టన్నుల బంగారం నిల్వలతో 6వ స్థానంలో స్విట్జర్లాండ్ ఉంది. ఇక ఏడో స్థానంలో 853.63 టన్నుల బంగారంతో భారత్ ఉంది.

చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లో భారీ బంగారు గని బయటపడింది. దాదాపు 78 బిలియన్ యూరోలు విలువైన బంగారు గనిని గుర్తించారు. ఈ గనిలో సుమారు వెయ్యి టన్నుల బంగారం ఉంటుందని అంచనా వేస్తున్నారు. నిజంగా ఇక్కడ అంచనాలకు అనుగుణంగా బంగారం లభిస్తే చైనా బంగారు పరిశ్రమతో ప్రపంచ మైనింగ్ రంగం ఓ మైలు రాయిగా మారుతుంది. చైనాలోని హంగులో బయటపడిన ఈ బంగారు గని ఆ దేశ ఆర్థిక వృద్ధిని పెంచుతుందని అందరూ భావిస్తున్నారు. ఈ స్థాయి నిల్వ సాధ్యమైతే హునాన్ ప్రావిన్స్ ప్రపంచ బంగారు మార్కెట్లో ప్రధాన పాత్రధారిగా ఎదిగే అవకాశాలున్నాయి. ఈ ఆవిష్కరణకు సంబంధించిన ఆర్థిక ప్రయోజనాలు మైనింగ్ కార్యకలాపాలకు మించి విస్తరించి ఉన్నాయి. మైనింగ్, శుద్ధి, రవాణా, అనుబంధ పరిశ్రమలలో వేలాది కొత్త ఉద్యోగాల పుట్టుకొస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News