Gate To Hell: గేట్ టు హెల్.. అసలు ఈ అగ్నిగుండం కథ ఏంటి?
Gate To Hell: ఒక ఎడారి మధ్యలో మండిపోతున్న మంటలు… ఎంత కాలంగా అంటే పదేళ్లు కాదు, 20 ఏళ్ళు కాదు… ఏకంగా 50 సంవత్సరాలుగా ఆ మంట ఆగకుండా వెలుగుతూనే ఉంది.
Gate To Hell: గేట్ టు హెల్.. అసలు ఈ అగ్నిగుండం కథ ఏంటి?
Gate To Hell: ఒక ఎడారి మధ్యలో మండిపోతున్న మంటలు… ఎంత కాలంగా అంటే పదేళ్లు కాదు, 20 ఏళ్ళు కాదు… ఏకంగా 50 సంవత్సరాలుగా ఆ మంట ఆగకుండా వెలుగుతూనే ఉంది. నిటారుగా పడిపోయిన పెద్ద గుండ్రని గుంతలోంచి ఎగిసి పడుతున్న అగ్నలాంటిది... దాన్ని చూసినవాళ్లు దానికి ఓ భయాంకరమైన పేరు పెట్టారు...ఆ పేరే “గేట్ టు హెల్”. అంటే నరకానికి ద్వారం అనిపించేటంతలా… ఆ మంటలు ప్రతి రోజు రాత్రి పగలు తేడా లేకుండా ఆగకుండా ఎగిసిపడుతూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ మంట మసకబారిపోతోందట. ఇది నిజంగా ఆగిపోతున్నదా? ఇది ఒక ప్రకృతి శాపమా? మానవ తప్పిదం ఫలితమా? అసలు ఈ అగ్నిగుండం కథ ఏంటి?
టుర్క్‌మెనిస్తాన్ అనే మధ్యఆసియా దేశంలోని ఎడారి లోతుల్లో ఈ భారీ గ్యాస్ గుంత ఉంది. దాని అసలు పేరు దర్వాజా గ్యాస్ క్రేటర్. ఇది అసలు కావాలని తవ్వింది కాదు… అప్పట్లో సోవియట్ యూనియన్ ఇంజినీర్లు 1970లలో అక్కడ తైలం కోసం తవ్వకాలు చేస్తుండగా, అద్భుతంగా ఓ పెద్ద అండర్‌గ్రౌండ్ గ్యాస్ కేబిన్ బయటపడిందట. ఎవరూ ఊహించని విధంగా, ఆ మట్టి కింద ఖాళీగా ఉన్న గ్యాస్ గుహలోకి బోర్ రిగ్ దిగిపోయింది. దీని వలన భారీగా మీథేన్ గ్యాస్ లీక్ అవ్వడం మొదలైంది. ఆ గ్యాస్ వాతావరణానికి హానికరమైనదని, ప్రజలకు ప్రమాదమవుతుందని అనుకుని... ఆ ఇంజినీర్లు ఆ గ్యాస్‌ని మంట పెట్టేశారు. కొద్ది రోజుల్లో గ్యాస్ పూర్తిగా కాలిపోతుంది, సమస్య తీరిపోతుందిలే అని అనుకున్నారు వాళ్లంతా . కానీ… తీరిందా? అసలు ఆగిందా? ఏమీ ఆగలేదు. ఆ మంటలు అప్పటినుంచి ఇప్పటివరకు మూడున్నర దశాబ్దాలుగా అలాగే మండుతూనే ఉన్నాయి.
ఈ అగ్నికుండాన్ని చూసేందుకు వేలాది పర్యాటకులు వెళ్లేవాళ్లు. రాత్రి సమయంలో, ఆ మంటల వెలుగు చుట్టూ ఎడారంతా ప్రకాశిస్తుండేది. అలా చూడడానికి ఇది ఎంతో ఆసక్తికరమైన విజువల్… కానీ దీని వల్ల జరిగే నష్టం మాత్రం ఊహించనంత తీవ్రమైంది. మంటలతో గ్యాస్ వృథా అవుతోంది. మీథేన్ అనేది ఒక గ్రీన్‌హౌస్ గ్యాస్. అది వాతావరణ మార్పులకు, ఉష్ణోగ్రతల పెరుగుదలకు కారణం అవుతోంది. అంతేకాదు, ఇదొక విలువైన నైసర్గిక వనరు కూడా. దాన్ని ఇలా కాల్చేస్తూ వృథా చేయడం… ఆ దేశ అభివృద్ధికీ, వాతావరణానికీ నష్టమే.
గతంలో అప్పటి అధ్యక్షుడు బెర్దీముఖమ్మెదోవ్ 2010లోనే ఈ మంటలు ఆపాలని సూచించారు.2022లో ఇవి మానవాళికి నష్టం కలిగిస్తున్నాయని, దీనివల్ల మనం విలువైన వనరులను కోల్పోతున్నామని, దీన్ని కచ్చితంగా ఆపాల్సిందే అంటూ మరింతగా స్పష్టంగా చెప్పారు. దానికి తోడు 2023 తర్వాత నుంచి, టుర్క్‌మెనిస్తాన్‌లో కొత్తగా గ్యాస్ కంట్రోల్ టెక్నాలజీ అమలయ్యింది. దీని వల్ల దర్వాజా క్రేటర్‌కు వెళ్లే గ్యాస్ ఫ్లోను తగ్గించారు. ఫలితంగా ఇప్పుడు ఆ మంటలు మెల్లగా తగ్గిపోతున్నాయి.
సాటిలైట్ చిత్రాలు కూడా ఇదే చెబుతున్నాయి. ఒకప్పుడు ఎగిసిపడే అగ్ని, ఇప్పుడు చిన్న చిన్న అగ్గిపుల్లల మాదిరిగా వెలుగుతోంది. ఇదంతా చూస్తుంటే, అర్థమవుతోంది… “గేట్ టు హెల్” అనబడే ఆ అగ్నికుండం ఇప్పుడు చివరి శ్వాసలు తీసుకుంటోందని. మంటలు ఇప్పుడే పూర్తిగా ఆగిపోకపోయినా… ఇది చివరి దశ అనిపిస్తోంది. ఇక ముందు ఈ అగ్ని తిరిగి మళ్లీ మండుతుందా? లేక ఇది శాశ్వతంగా ఆగిపోతుందా? అన్నది మాత్రం చెప్పలేం.