Elon Musk: గత వారం రోజుల్లో ఎవరెవరు ఏం పని చేశారో మెయిల్ చేయాలన్న మస్క్.. అవసరం లేదన్న కాశ్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న మస్క్.. ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించే విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు.

Update: 2025-02-24 06:44 GMT

Elon Musk: ఎలాన్ మస్క్ కు బిగ్ షాక్..21 మంది డోజ్ ఉద్యోగుల రాజీనామా

Elon Musk: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న మస్క్.. ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించే విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలోని ప్రభుత్వ ఉద్యోగులకు షాక్ ఇస్తూ.. దాదాపు 20 లక్షల మందికి పైగా ఫెడరల్ ఉద్యోగులకు ఈ మెయిల్స్ పంపారు. గడిచిన వారం రోజుల్లో ఎవరెవరు ఏం పని చేశారనే వివరాలను ఐదు బుల్లెట్ పాయింట్ల రూపంలో తెలియజేయాలని యూఎస్ ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్‌మెంట్ (ఓపీఎం) నుంచి శనివారం పంపిన మెయిల్‌లో ఆదేశించారు.

ఉద్యోగులు సవివరమైన సమాచారం, లింకులు లేదా అటాచ్‌మెంట్లు పంపొద్దని స్పష్టం చేశారు. సోమవారం రాత్రి 11:59 గంటల్లోపు సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. జవాబు ఇవ్వడంలో విఫలమైన వారిని రాజీనామా చేసినట్టుగానే పరిగణిస్తామని మస్క్ తేల్చి చెప్పారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆంకాంక్షలకు అనుగుణంగానే ఈ ఆదేశాలను జారీ చేసినట్టు శనివారం మధ్యాహ్నం సోషల్ మీడియాలో వెల్లడించారు.

అయితే ప్రత్యేక ప్రభుత్వ అధికారిగా, అధ్యక్షుడి సలహాదారుగా ఉన్న మస్క్‌కు ఫెడరల్ ఉద్యోగులను తొలగించే అధికారాలు లేవని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. దీనిపై అమెరికాకు చెందిన అతి పెద్ద ఉద్యోగ సంఘం అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ జాతీయ అధ్యక్షుడు ఎవెరెట్ కెల్లి స్పందించారు. ట్రంప్ తీసుకుంటున్న చర్యలు ఫెడరల్ ఉద్యోగుల పట్ల, దేశ ప్రజలకు అందించే క్లిష్టమైన సేవల పట్ల ఆయనకు ఉన్న అయిష్టతను సూచిస్తున్నాయని అన్నారు. మస్క్ పంపిన మెయిల్ చాలా క్రూరమైందన్నారు. ఆయన ఆదేశాలతో ప్రభుత్వం చట్టవిరుద్ధమైన తొలగింపులకు పాల్పడితే వాటిని సవాల్ చేస్తామని స్పష్టం చేశారు. తన జీవితంలో ఒక్కసారి కూడా నిజాయితీగా ప్రజలకు సేవ చేయని మస్క్‌తో తమ ఉద్యోగులకు విధుల గురించి చెప్పించడం అంటే వారిని అగౌరపరచడమేనని అన్నారు.

మరోవైపు మస్క్ నేతృత్వంలోని డోజ్ విభానికి ప్రత్యేక అధికారాలిస్తూ కార్యనిర్వాహక ఆదేశాలపై ట్రంప్ ఇటీవలే సంతకం చేసిన విషయం తెలిసిందే. ప్రతి ఏజెన్సీ ఉద్యోగుల తగ్గింపునకు ప్రణాళికలు, అవసరమైన మేరకే నియామకాలు చేపట్టాలని అందులో తెలిపారు. ఆతర్వాత డోజ్ పనితీరును ట్రంప్ ప్రశంసించారు. మస్క్ పని తీరును కొనియాడారు. ఆయన మరింత దూకుడుగా ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ఈ వారంలో మీరేం పని చేశారు..? అనే ప్రశ్న మస్క్ తన సంస్థల్లో పనిచేసే ఉద్యోగులను కూడా అడిగారు. 2022లో ట్విట్టర్‌ను కొనుగోలు చేసేముందు ఆ సంస్థ సీఈవో పరాగ్ అగర్వాల్‌కు ఇదే ప్రశ్నను సంధించారు. ఆ తర్వాత ఆయనను సీఈవో పదవి నుంచి తప్పించిన విషయం తెలిసిందే.

ఇక మస్క్ పంపిన మెయిల్ పై ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI)కు 9వ డైరెక్టర్‌గా శుక్రవారం బాధ్యతలు చేపట్టిన కాశ్ పటేల్ సైతం దీనిపై స్పందించారు. ఆ మెయిల్‌కు స్పందించవద్దని ఎఫ్‌బీఐ సిబ్బందికి స్పష్టం చేశారు. ఏం పనిచేస్తున్నారో తెలియజేయాలంటూ ఓపీఎం నుంచి FBI ఉద్యోగులకు మెయిల్ వచ్చి ఉండొచ్చు. FBI నిబంధనల ప్రకారం ప్రస్తుతం దర్యాప్తు సంస్థలో సమీక్షల ప్రక్రియ జరుగుతోంది. ఏదైనా సమాచారం అవసరమైతే మేమే స్పందిస్తాం. ప్రస్తుతానికి ఉద్యోగులెవరూ మస్క్ మెయిల్‌కు జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు అని కాశ్ FBI ఉద్యోగులకు సందేశం పంపారు. అలాగే జాతీయ భద్రత సంస్థ కూడా తాము తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు ఎవరూ మస్క్ మెయిల్‌కు స్పందన తెలియజేయాల్సిన అవసరం లేదని ఉద్యోగులకు సందేశం పంపించింది. 

Tags:    

Similar News