Elon Musk: ఎలాన్ మస్క్‌పైనే రివర్స్ సెటైర్ వేసిన శామ్ ఆల్ట్‌మన్.. సెటైర్ మామూలుగా లేదుగా!!

Update: 2025-02-11 09:43 GMT

ఎలాన్ మస్క్‌ ప్రతిపాదనకు సెటైర్‌తో నో చెప్పిన శామ్

ఎలాన్ మస్క్, ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ మధ్య విబేధాలు మరింత ముదురుతున్నాయి. వీళ్ల మధ్య గత కొంతకాలంగా ఓపెన్ ఏఐ సంస్థ పనితీరు విషయంలో మాటలు, ట్వీట్స్ యుద్ధం నడుస్తోన్న సంగతి తెలిసిందే. గతేడాది రెండుసార్లు ఓపెన్ ఏఐ సంస్థపై ఎలాన్ మస్క్ కోర్టుకు కూడా వెళ్లారు. ఇదిలావుండగానే, తాజాగా ఓపెన్ ఏఐ సంస్థను 97 బిలియన్ డాలర్లు పెట్టి కొనుగోలు చేసేందుకు ఎలాన్ మస్క్ ఒక ప్రతిపాదన చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఎలాన్ మస్క్ తన వద్ద ఉన్న పెట్టుబడిదారుల గ్రూప్‌తో కలిసి వెళ్లి శామ్ ఆల్ట్‌మన్‌కు ఈ ప్రతిపాదన చేశారు. కానీ మస్క్ ప్రతిపాదనను శామ్ ఆల్ట్‌మన్ తిరస్కరించారు. అంతేకాదు... "తనే 9.7 బిలియన్ డాలర్లు ఇచ్చి మీ ఎక్స్ సంస్థను (గతంలో ట్విటర్) కొంటాను అమ్ముతారా" అంటూ రివర్స్ ప్రతిపాదన చేశారు.


2022 లోనే ఎలాన్ మస్క్ 44 బిలియన్ డాలర్లు పెట్టి ఎక్స్‌ను కొనుగోలు చేశారు. అంతకంటే మూడు రెట్ల కన్నా తక్కువ ధరకే ఇప్పుడు శామ్ ఆ కంపెనీని కొంటానని ప్రపోజల్ పెట్టారు. ఈ ఆసక్తికరమైన పరిణామం ఇప్పుడు వ్యాపారవర్గాలు, ఐటి పరిశ్రమలో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. 

ఎలాన్ మస్క్, శామ్ ఆల్ట్‌మన్ మధ్య అసలు గొడవేంటి?

ఓపెన్ ఏఐ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్ స్టార్టప్ సంస్థను స్థాపించేటప్పుడు ఆ సంస్థ కోఫౌండర్స్‌లో ఎలాన్ మస్క్ ఒకరు. అయితే, ఎలాన్ మస్క్ చెబుతున్న వెర్షన్ ప్రకారం ఎలాంటి లాభాపేక్ష, వ్యాపార కాంక్ష లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్‌ను ఓపెన్ సోర్స్ చేసి అందరికీ ఉచితంగా ఉపయోగపడేలా చేయాలన్నదే ఓపెన్ఏఐ సంస్థ లక్ష్యం. కానీ ఆ తరువాత కాలంలో ఓపెన్ఏఐ సంస్థ లాభం కోసమే పనిచేసే వ్యాపార సంస్థగా మారిందని మస్క్ ఆరోపిస్తున్నారు.

ఇదే విషయమై ఆయన 2024లో రెండుసార్లు కోర్టుకు కూడా వెళ్లారు. ఓపెన్ఏఐ సంస్థ లక్ష్యాలను గుర్తుచేస్తూ లాభం కోసం పనిచేయడం పక్కనపెట్టి నలుగురికి ఉపయోగపడేలా సంస్థ పనిచేయాలని అన్నారు. అంతేకాదు... ఓపెన్ఏఐ సంస్థ భవిష్యత్ ప్రణాళికలు కూడా మానవాళికి ఆందోళనకరంగా ఉన్నాయని సంస్థ పనితీరును ప్రశ్నించారు. ఇప్పుడు ఓపెన్ఏఐ సంస్థను కొనుగోలు చేయడానికి ముందుకు రావడానికి కారణం కూడా అదేనని మస్క్ చెబుతున్నారు.

అయితే, ఎలాన్ మస్క్ ఆరోపణలను ఓపెన్ఏఐ సంస్థ ఖండించింది. ఓపెన్ఏఐ సంస్థను మస్క్ సొంత సంస్థ అయిన టెస్లాలో విలీనం చేసి భారీగా డబ్బు సంపాదించుకోవాలని భావించారని శామ్ ఆల్ట్‌మన్ ఆరోపిస్తున్నారు.  

Tags:    

Similar News