అమెరికాలో కనీ వినీ ఎరుగని కల్లోలం కరోనా!

Update: 2020-04-30 08:28 GMT

కరోనా మహమ్మారి ధాటికి అమెరికా విలవిల్లాడుతోంది. ఏ దేశంలో లేనంతగా అమెరికాలో కల్లోలం సృష్టిస్తున్న కరోనా యుద్ధం కంటే ఎక్కువ ప్రాణనష్టం కలిగిస్తోంది. ప్రాణ నష్టంతో పాటు భారీగా ఆర్థిక నష్టాన్ని చవిచూస్తోంది అమెరికా. దశాబ్ద కాలంలో ఎన్నడూ చూడనంతగా కుదేలవుతోంది అమెరికా ఆర్థిక వ్యవస్థ.

అగ్రరాజ్యం అమెరికాలో కొవిడ్‌ బీభత్సం కొనసాగుతోంది. వేలకొద్దీ ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. రెండు దశాబ్దాల పాటు భీకరంగా సాగిన వియత్నాం యుద్ధం కంటే కరోనా బలితీసుకున్న ప్రాణాలే ఎక్కువగా ఉన్నాయి. అమెరికా వియత్నాం మధ్య జరిగిన యుద్ధంలో 58 వేల 200 మంది అమెరికన్‌ సైనికులు ప్రాణాలు కోల్పోగా కరోనా మాత్రం తక్కువ కాలంలో అరవై వేల ప్రాణాలను బలితీసుకుంది. ఇప్పటివరకు అమెరికాలో కేసులు పది లక్షలు దాటిపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా నమోదైన కేసుల్లో మూడో వంతు కేసులు అమెరికాలోనే ఉన్నాయి. మొత్తం మరణాల్లోనూ 4వ వంతు అమెరికాలోనే చోటుచేసుకున్నాయి.

ఇక అమెరికాలో ఆర్థిక కార్యకలాపాలు మొదలుపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్. కాలిఫోర్నియాలో జులై-ఆగస్టులో విద్యాసంస్థలు ప్రారంభం కానున్నాయి. టెక్సాస్‌లోనూ ఆంక్షలు సడలిస్తున్నారు అధికారుల. ఇక టెన్నిస్సీలో ఇప్పటికే రెస్టారెంట్లు ప్రారంభం కాగా రిటైల్ దుకాణాలు కూడా తెరుచుకోనున్నాయి. అయితే అమెరికాలో కరోనా సెకండ్ వేవ్‌కి ఛాన్స్ ఉందంటున్నారు అలర్జీ అండ్ ఇన్‌ఫెక్షియస్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ ఆంథోనీ పౌచీ తెలిపారు. అప్పటివరకు ముందుజాగ్రత్తలు పాటించకపోతే భారీ నష్టం తప్పదని హెచ్చరించారు. ఇక సెంటర్ ఫర్ డిసిస్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ అమెరికాలో మరణాల సంఖ్య అధికారిక గణాంకాల కంటే భారీగా ఉంటుందని అభిప్రాయపడింది.

కరోనా ఎఫెక్ట్‌కి అమెరికాలో దశాబ్దకాలంలో ఎన్నడూ లేనంత ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 4.8 శాతం జీడీపీ తగ్గిపోయిందని ఆర్థిక విశ్లేషణల సంస్థ తెలిపింది. రెండో త్రైమాసికంలో జీడీపీ 15 నుంచి 20 శాతం తగ్గనున్నట్లు వైట్‌హౌస్‌ ఆర్థిక సలహాదారు అంచనా వేస్తున్నారు.

ఇక ఇప్పటివరకు బ్రిటన్‌లోనూ మరణాలు భారీగా సంభవిస్తున్నాయి. అమెరికా, ఇటలీ తర్వాత బ్రిటన్‌లో కరోనా మరణాలు అధికంగా ఉన్నాయి. ఇప్పటివరకు ఆ దేశంలో లక్షా 65వేల మందికి కరోనా సోకగా 26 వేల మందికి పైగా మరణించారు. నిన్న ఒక్కరోజే బ్రిటన్ నాలుగు వేల మరణాలను జాబితాలో చేర్చింది. ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా ఎఫెక్ట్‌తో 30 కోట్ల 50 లక్షల ఉద్యోగాలకు ఎసరు పెట్టే ముప్పు ఉన్నట్లు అంచనా వేసింది అంతర్జాతీయ కార్మిక సంస్థ.

Tags:    

Similar News