కాశ్మీర్ అంశంపై చైనా యూ టర్న్.. పాకిస్తాన్ కి షాక్!

Update: 2019-10-09 05:50 GMT

కశ్మీర్ అంశంపై వారం రోజుల్లోనే చైనా యూ టర్న్ తీసుకుని పాకిస్తాన్ కు గట్టి షాక్ ఇచ్చింది. కాశ్మీర్ అంశాన్ని ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు సూచించింది. ప్రస్తుతం ఇమ్రాన్ చైనా పర్యటనలో ఉన్నారు. ఈ నేపధ్యంలో భారత్, పాకిస్థాన్‌లు కశ్మీర్ సహా అన్ని వివాదాలను పరస్పర అవగాహనకు వచ్చి ద్వైపాక్షిక చర్చలు, సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జెంగ్ షుంగ్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. రెండురోజుల్లో చైనా అధ్యక్షుడు జీ జింగ్‌పింగ్ భారత పర్యటనకు రానున్నారు. దీంతో ఈ అంశం కీలకంగా మారింది. ఇప్పుడు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ప్రకటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇటీవల కాలంలో ఐక్య రాజ్య సమితి సర్వప్రతినిధుల సభలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మాట్లాడుతూ.. కశ్మీర్‌ అంశం దీర్ఘకాలంగా అపరిష్కృతంగా కొనసాగుతోన్న వివాదమని అభివర్ణించారు. ఐరాస నియమావళి, ద్వైపాక్షిక ఒప్పందం, భద్రతామండలి తీర్మానాలకు అనుగుణంగా సమస్యను పరిష్కరించుకోవాల్సి ఉందని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే వారం రోజులు తిరగ కుండానే.. ఆ ప్రకటనకు భిన్నంగా ప్రకటన రావడం గమనార్హం. శుక్రవారం భారత్ లో మూడు రోజుల పర్యటనకు చైనా అధ్యక్షుడు జీ జింగ్‌పింగ్ రానున్నారు. అయన తన పర్యటనలో ప్రధాని మోడీ తో తమిళనాడు తీరదేవాలయం మహాబలిపురంలో సమావేశం అవుతారు.

కశ్మీర్ సమస్యను భారత్, పాకిస్థాన్‌లు ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఆగస్టు 5 కి ముందు ఉన్న స్థితిని పునరుద్దరించడానికి సిద్ధంగా ఉన్నట్టు చైనా తాజా ప్రకటనతో సూచనలు ఇచ్చింది. యుఎన్ చార్టర్, సెక్యూరిటీ కౌన్సిల్ తీర్మానాల సూచనలను భారత్ విస్మరించిందని వాదిస్తోన్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వాలు చైనాలో పర్యటిస్తున్న వేళ డ్రాగన్ ప్రకటన ప్రాముఖ్యతను సంతరించుకుంది.

కశ్మీర్ అంశంలో మూడో వ్యక్తి జోక్యాన్ని సహించబోమని భారత్ తెగేసిచెప్పడంతో చైనా తన విధానాన్ని మార్చుకున్నట్టు భావిస్తున్నారు. అయితే, జింగ్‌పింగ్ భారత పర్యటన విజయవంతం కావాలంటే కశ్మీర్ విషయంలో పాకిస్థాన్‌కు మద్దతు ఇవ్వకపోవడమే ఉత్తమమని చైనా భావిస్తోన్నట్టు తెలుస్తోంది. అలాగే, తన వైఖరిని మార్చుకోవడం ద్వారా కశ్మీర్ విషయంలో పాకిస్థాన్‌ వెనక్కు తగ్గించే ప్రయత్నం చేస్తోంది. కశ్మీర్ సమస్యపై భారత్‌ కరాఖండిగా చెప్పడంతో చైనా తటస్థంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు దాని ప్రకటనతో అవగతమవుతోంది.

ఇక, చైనా అధ్యక్షుడి భారత పర్యటన గురించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీనికి సంబంధించి మీడియా సమావేశంలో ఈరోజు ఒక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి.


Tags:    

Similar News